దివ్య భారతి స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు.. | Sajid Nadiadwala Wife Says She Never Tried To Replace Divya Bahrathi | Sakshi
Sakshi News home page

దివ్య భారతిని మా పిల్లలు పెద్దమ్మ అంటారు: వార్దా

Apr 25 2020 10:56 AM | Updated on Apr 25 2020 11:23 AM

Sajid Nadiadwala Wife Says She Never Tried To Replace Divya Bahrathi - Sakshi

ముంబై: సాజిద్‌ భార్యగా దివ్య భారతి స్థానాన్ని భర్తీ చేసేందుకు తానెన్నడూ ప్రయత్నించలేదని జర్నలిస్టు వార్దా అన్నారు. దివ్య ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యురాలిగానే ఉంటారని.. ఆమె వదిలివెళ్లిన జ్ఞాపకాలు తమతోనే ఉన్నాయన్నారు. హీరోయిన్‌గా అగ్రస్థానానికి చేరుకుంటున్న సమయంలోనే పద్దెమినిదేళ్ల వయస్సులో దివ్య భారతి బాలీవుడ్‌​ నిర్మాత సాజిద్‌ నడియాద్‌వాలాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో 1993 ఏప్రిల్‌లో తమ అపార్టుమెంటులోని ఐదో అంతస్తు నుంచి జారి పడి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. దివ్య భారతిని ఉద్దేశపూర్వంగానే కిందకు తోసేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (లాక్‌డౌన్‌: భార్య ఫొటో షేర్‌ చేసిన డైరెక్టర్‌)

ఇక తదనంతర కాలంలో సాజిద్‌ జర్నలిస్టు వార్దాను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల దివ్య వర్ధంతి(ఏప్రిల్‌ 5) సందర్భంగా అభిమానులు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. ఈ విషయంపై స్పందించిన వార్దా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘దివ్య, ఆమె కుటుంబం, తన సోదరుడు కునాల్‌ నేటికీ మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ప్రతీ వేడుకలోనూ పాలుపంచుకుంటారు. మీరు నన్ను ట్రోల్‌ చేసినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేమీ లేదు. దివ్య పుట్టినరోజు, తనకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను మేం జరుపుకొంటాం. ఆ సమయంలో తను నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. తన సినిమాలు చూస్తున్నప్పుడు మా పిల్లలు పెద్దమ్మ అంటూ సంతోషం వ్యక్తం చేస్తారు. మా అందమైన జీవితాల్లో తను ఎప్పుడూ జీవించే ఉంటుంది. సాజిద్‌ దివ్య వాళ్ల నాన్నను తన తండ్రిలా చూసుకుంటారు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు')

ఇక దివ్య సోదరుడు కునాల్‌తో కూడా అన్నలా వ్యవహరిస్తారు. నిజం చెప్పాలంటే నేను ఏనాడు దివ్య స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు. నాకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే దివ్య మిగిల్చిన అందమైన జ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి’’అని చెప్పుకొచ్చారు. కాగా విశ్వాత్మ, దిల్‌ కా క్యా కసూర్‌, సోలా ఔర్‌ షబ్నం, జాన్‌ సే ప్యారా వంటి హిందీ చిత్రాల్లో నటించిన దివ్య భారతి... బొబ్బిలి రాజా, చిట్టెమ్మ మొగుడు, అసెంబ్లీ రౌడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. చిన్న వయస్సులోనే దివికేగి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement