అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు..

Raksha Bandhan Special Interview With Puri Jagannadh Son Akash - Sakshi

రక్ష బంధన్‌ సందర్భంగా ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాద్‌ కూతురు పవిత్ర, కొడుకు ఆకాశ్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.

రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి?
పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు.
ఆకాశ్‌: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను.

పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్‌ అంటే ఇష్టం?
ఆకాశ్‌: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్‌ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ).

పవిత్ర: లాస్ట్‌ ఇయర్‌ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్‌ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్‌ నుండి ఒక బ్యాగ్‌ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం.

ఆకాశ్‌: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్‌ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి  ప్లాన్‌ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్‌ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్‌ ఇయర్‌ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్‌ బ్యాగ్‌ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్‌ ఉంది. కానీ సర్‌ప్రైజ్‌.

పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ).

ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్‌’ ఎవరైనా ఉన్నారా?
పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్‌ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్‌ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్‌ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్‌ తీసుకుంటాను.

మీ ఇద్దరూ పర్సల్‌ విషయాలు షేర్‌ చేసుకుంటారా?
పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్‌ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్‌ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు   విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్‌ ఏముంటాయి?

మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్‌ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్‌?
పవిత్ర: సినిమా షూటింVŠ  టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్‌ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని  మేం  కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్‌ చేసి షూటింగ్‌ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్‌ న్యాయం చేశాడు. రివ్యూస్‌ ఎలా వచ్చినా తను డల్‌ అవ్వటం ఉండదు.

ఆకాశ్‌: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్‌ గురించి మాట్లాడరు. ఫస్ట్‌ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్‌ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్‌ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను.

మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్‌ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా?
ఆకాశ్‌: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్‌ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్‌ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే.

పవిత్ర ఎలాంటి కెరీర్‌లో సెటిల్‌ అవ్వాలనుకుంటోంది?
ఆకాశ్‌: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్‌ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్‌ అయిపోగానే ప్రొడక్షన్‌లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్‌ తెచ్చిస్తుంటారు.

ప్రొడక్షన్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్‌పుట్స్‌ తీసుకుంటారు?
పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్‌ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు.

కాలేజీలో మీరు డైరెక్టర్‌ పూరీ డాటర్‌ అని అందరికీ తెలుసా?
పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్‌షిప్‌ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి  తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్‌ అవుతాను.

డ్రగ్స్‌ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్‌ అయినట్లు అనిపించింది..
పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్‌ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్‌ హౌస్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్‌ ఉంది అని మా అమ్మను ఇన్‌వాల్వ్‌ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్‌ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు.  ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్‌ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్‌ చేశాను.

ఆకాశ్‌: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్‌ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్‌ చేస్తూ, నాకు చాలా కాల్స్‌ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్‌ ఎ ఫెంటాస్టిక్‌ జాబ్‌.

పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా?
ఆకాశ్‌: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్‌ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు.

పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ).

అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్‌ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు?

ఆకాశ్‌: ఏమో స్క్రిప్ట్‌ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం.
పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు.

పవిత్ర ఇచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌?
ఆకాశ్‌: కాంప్లిమెంట్‌ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్‌ అందరితో ఫుల్‌ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్‌.

యాక్టర్‌గా ప్రూవ్‌ చేసుకోవాలంటే నీ డ్రీమ్‌ రోల్‌?
ఆకాశ్‌: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్‌ ఇలా చాలెంజింగ్‌ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్‌ టచ్‌ చేయాలనేది నా డ్రీమ్‌.

నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్‌. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్‌ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా?
పవిత్ర: ఫస్ట్‌ నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్‌ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్‌లో సక్సెస్‌ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్‌ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్‌ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్‌ వాళ్లు.

అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా?
పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్‌ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్‌ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్‌ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్‌ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్‌ అండ్‌ హాఫ్‌ ఇయర్‌ ముందే తను బ్యాంకాక్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్‌ దగ్గర వీటి గురించి డిస్కస్‌ చే సేవాడు. అందుకే ఫస్ట్‌ డే షూటింగ్‌లో తన ఎగై్జట్‌మెంట్‌ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్‌ అయ్యాను.

ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి..
ఆకాశ్‌: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు.
పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్‌లో ఆకాశ్‌ సరదాగా ఆశీర్వదించాడు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top