శంకర్‌ ఓ మెజీషియన్‌

Rajinikanth Speech At 2.0 Movie Press Meet - Sakshi

రజనీకాంత్

‘‘శంకర్‌గారు తెలుగు మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ‘రోబో’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో ‘నాకు తెలుగు తెలీదు’ అని చెప్పి ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడొచ్చి ఇంత బాగా తెలుగు మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచివాళ్లు. మమ్మల్ని చాలా అభిమానిస్తారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్‌ ఆనందమైంది’’ అని రజనీకాంత్‌ అన్నారు. రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో    తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’.

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీప్రసాద్‌ తెలుగులో   రిలీజ్‌ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29న ఈ చిత్రం విడు దలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘రోబో’ సినిమా చేసినప్పుడు ఒక రీల్‌ త్రీడీలోకి మార్చి, ఆ తర్వాత మొత్తం సినిమా త్రీడీలోకి మార్చాలనుకున్నాం. ఒక రీల్‌ త్రీడీలోకి కన్వర్ట్‌ చేశాక శంకర్‌గారు డిసైడ్‌ చేశారు. త్రీడీలో కచ్చితంగా చేద్దాం. కానీ, త్రీడీ చేయాలని సినిమా చేస్తే బాగుండదు.. దానికి సరైన కథ కుదరాలి.

అప్పుడు ఆలోచిస్తా అన్నారు. నాలుగేళ్ల ముందు నన్ను కలిసి త్రీడీ సినిమా చేద్దామన్నారు. మంచి కథ కుదిరిందని నాకు అర్థం అయింది. ఆయనతో నేను సినిమా చేశాను కాబట్టి ఇది సాధ్యమా? అనే అనుమానం నాకు రాలేదు. ఆయనొక మెజీషియన్‌. ‘బాహుబలి’ సినిమా అంత పెద్ద సక్సెస్‌కి కారణం ఫస్ట్‌ కథ. దానికి తగ్గుట్టు గ్రాండ్‌ లుక్‌. ఆ రెండు బాగా కుదిరాయి కాబట్టి అంతపెద్ద సక్సెస్‌ అయింది. ‘2.ఓ’  కూడా అంతే. త్రీడీ టెక్నాలజీ.. దానికి తగ్గ కథ.

ఈ రెండు చక్కగా కుదిరినందు వల్ల ఈ సినిమా వందశాతం పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్మకం ఉంది. శంకర్‌కి కావాల్సినవన్నీ ఇచ్చిన సుభాస్కరన్‌గారికి హ్యాట్సాఫ్‌. ఈ సినిమాకి ప్రమోషన్‌ అక్కర్లేదు.. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు దుబారా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. టికెట్‌ బుకింగ్స్‌ కూడా స్టార్ట్‌ అయ్యాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పా.

1975లో నా తొలి సినిమా ‘అపూర్వ రాగంగల్‌’ చూడాలని ఎంత ఆత్రుతగా ఉన్నానో.. 43ఏళ్ల తర్వాత ఈ ‘2.ఓ’ చూడాలని అంతే ఆత్రుతగా ఉన్నా. ట్రైలర్‌లో మీరు చూసింది జస్ట్‌ శాం్యపిల్సే. ఆశ్చర్యపోయే అంశాలన్నీ సినిమాలో ఉన్నాయి. మన ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకే ‘2.ఓ’ పెద్ద వెలుగు. దానికి శంకర్, ఆయన యూనిట్, నిర్మాత, అక్షయ్‌గారి ఎఫర్ట్‌.. అన్నీ కలిపి కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నాకు నమ్మకం ఉంది. శంకర్‌గారు చెప్పినట్టు ఈ సినిమాని త్రీడీలో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మీలాగా నేను కూడా 29వ తేదీ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు.  

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–
‘‘2.ఓ’ ని ప్రసాద్‌గారు, మేము, యూవీ క్రియేషన్స్‌ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. రెండు రోజులకు ముందు విడుదలైన పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ఆన్‌లైన్‌లోనే తెలిసిపోతోంది. ‘2.ఓ’ వన్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ కాబోతోంది’’ అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ–
‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారు గ్రేట్‌ ఆర్టిస్ట్‌. అక్షయ్‌ కుమార్‌కూడా ఈ మధ్య వరుస హిట్లు అందుకున్నారు. ఇటీవల ఆయన సినిమాలు పబ్లిక్‌లో మంచి అవేర్‌నెస్‌ తీసుకొచ్చాయి. ఇండియాగర్వించదగ్గ గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన నాలుగేళ్లు రాత్రి, పగలు కష్టపడి ‘2.ఓ’ సినిమాని సృష్టించారు. సుభాస్కరన్‌గారు అంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ ఇండియన్‌ సినిమాని ప్రపంచస్థాయి సినిమాగా మార్చేందుకు వీరు నలుగురూ కృషి చేశారు. ఈ నెల 29నుంచి దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది.

సంక్రాంతి తర్వాత కూడా ఈ దీపావళి కొనసాగుతుంది. తొలిసారి రియల్‌ త్రీడీలో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. యూనిట్‌ కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చి, ఇదొక ప్రపంచస్థాయి సినిమా అవ్వాలని ఆశిస్తున్నా. ఈ సినిమాని మేం గర్వంగా తెలుగులోకి తీసుకొస్తున్నాం.  మీరు(శంకర్‌), రాజమౌళిగారు, రాజు హిర్వాణీగార్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తు పెట్టుకునేటట్లు ఇటువంటి ఎన్నో మంచి చిత్రాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

శంకర్‌ మాట్లాడుతూ–
‘‘ఇలా నడిస్తే ఎలా ఉంటది? అన్న నా ఊహే ‘2.ఓ’. ఇదొక ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లర్‌. మంచి భావోద్వేగంతో పాటు, సామాజిక కథ ఉంది. ఇదొక పెద్ద టీమ్‌ వర్క్‌. నటీనటులు, వేలమంది టెక్నీషియన్స్‌ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఢిల్లీలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలో చిత్రీకరించిన క్లైమాక్స్‌ కోసం రజనీగారు చాలా కష్టపడ్డారు. రెహమాన్‌గారు ఆరు నెలల కిందే నేపథ్య సంగీతం స్టార్ట్‌ చేశారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చూస్తే ‘బ్లాక్‌ పాంథర్, స్పైడర్‌ మేన్‌’ చూసినట్టు ఉంటుంది. ఈ క్రెడిట్‌ మెయిన్‌గా నిర్మాత సుభాస్కరన్‌గారికి ఇవ్వాలి. ఇక ఇండియన్‌ ఫిల్మ్‌కి ఇంతపెద్దగా ఎవరూ ఖర్చు పెట్టరు. కానీ, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఇంత గ్రాండ్‌గా తీసినందుకు థ్యాంక్స్‌. మా టీమ్‌కి ఎంత ఎగై్జట్‌మెంట్‌ ఉందో అదే ఎగై్జట్‌మెంట్‌ ప్రేక్షకులకూ ఉంటుంది. ఇలాంటి సినిమాని మీడియా కూడా సపోర్ట్‌ చేస్తే మన దేశంలో కూడా ‘2.ఓ’ లాంటి సినిమా చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు’’ అన్నారు.

అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ–
‘‘2.ఓ’ నాకు ఒక సినిమా కాదు. శంకర్‌ ప్రిన్సిపల్‌గా ఉన్న స్కూల్‌కి వెళ్లినట్లు ఉంది. ఇండస్ట్రీలో
28 ఏళ్లుగా ఉంటూ నేర్చుకున్నదానికంటే  ‘2.ఓ’ చిత్రంతో నేర్చుకున్నదే ఎక్కువ. బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌సార్‌కి విలన్‌గా నటించడం గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. రజనీకాంత్‌గారు సింపుల్‌లైన్‌లో కూడా మ్యాజిక్‌ చేయగలరు. ఎలానో నాకు తెలీదు. ఆయనతో నటించే అవకాశంతో పాటు ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఇచ్చిన శంకర్‌కి థ్యాంక్స్‌. నిర్మాత సుభాస్కరన్‌ బాగా ఖర్చు పెట్టారు. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు. రిలీజ్‌ కోసం ప్రేక్షకుల్లా నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

హైదరాబాద్‌లో ‘2.ఓ’ సినిమా ప్రమోషన్‌లో  పాల్గొన్న శంకర్‌  ఇంటర్వ్యూ విశేషాలు...  
► నాలుగేళ్ల ‘2.ఓ’ ప్రయాణం ముగిసింది. సినిమా రిలీజవుతోంది. ఈ ఫీలింగ్‌  ఇప్పుడు ఎలా ఉంది?
సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో? ఎంత ఎంజాయ్‌ చేస్తారో అని ఎదురుచూస్తున్నా.  
► ఈ సినిమా టెక్నాలజీ, బడ్జెట్‌ పెరగడం గురించి..?
స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకే త్రీడీ టెక్నాలజీ వాడాం. కొత్తగా డిజైన్‌ చేయాలనుకున్నాం. అందుకు కొంత ఖర్చు పెట్టక తప్పదు. ట్రైలర్లో కనిపించిన సెల్‌మెన్, బర్డ్‌.. అన్నీ సెటప్‌నే. వాటిని డిజైన్‌ చేయడానికి చాలా టైమ్‌ పట్టింది. బడ్జెట్‌ కూడా పెరిగింది. క్రియేట్‌ చేసిన క్యారెక్టర్స్‌లో ఎమోషన్స్‌ని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించడం చాలెంజింగ్‌గా అనిపించింది.
► ‘2.ఓ’ కథాంశం పెద్దగా బయటకు రాలేదు?
ఫస్ట్‌ నన్ను నేను ఒక ఆడియన్‌గా భావించి థియేటర్‌కి వెళతాను. ఓ ప్రేక్షకునిగా సినిమాను నేను ఎలా ఎంజాయ్‌ చేయాలనుకుంటానో అలాంటి అనుభవాన్నే నా సినిమా చూస్తున్నవారికి ఇవ్వాలన్నది నా ఆలోచన. అందుకే సినిమాలో కోర్‌ సబ్జెక్ట్‌ను రివీల్‌ చేయలేదు. చేస్తే ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ మిస్‌ అవు తారు. అందుకే ట్రైలర్‌లో ఎక్కువ కథ చెప్పలేదు.
► మేకింగ్‌ వీడియోలో అక్షయ్‌ కష్టం కనిపించింది. ఆయనతో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
అక్షయ్‌ కుమార్‌ కమిట్‌మెంట్, డెడికేషన్, డిసిప్లేన్‌ సూపర్‌. ప్రతిరోజూ 3–4 గంటలు వర్క్‌ చేయాల్సిందే. కేవలం మేకప్‌ తీయడానికే గంటన్నర పట్టేది. ప్రోస్థటిక్‌ మేకప్, టీత్, పెద్ద బరువు ఉన్న డ్రెస్‌లు వేసుకున్నారు. మండు వేసవిలోనూ షూటింగ్‌లో పాల్గొన్నారు. అందుకే ఆయన్ని విలన్‌గా అనుకోలేదు. ఆయన క్యారెక్టర్లో షేడ్స్‌ ఉంటాయి. అవి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
► రజనీగారితో ‘రోబో’ కి పని చేసారు? ఇప్పుడు ‘2.ఓ’కి.. ఎమైనా డిఫరెంట్‌గా అనిపించిందా?
ప్రతి సినిమాకు రజనీగారు కష్టపడతారు. ఆయన ఏం చేసినా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. ఒక స్టైల్, ఫన్, పెర్ఫార్మెన్స్‌..అన్నీ ఉంటాయి.
► ‘రోబో’ కి సీక్వెల్‌ ఆలోచన ఎప్పుడొచ్చింది?
‘రోబో’ సినిమాకి సీక్వెల్‌ ఉంటే బాగుటుందని ఆడియన్స్‌ అనుకున్నారు. కరెక్ట్‌ స్టోరీ కుదరాలని నేను అనుకున్నాను. సెకండ్‌ పార్ట్‌పై అంచనాలతో వచ్చిన ఆడియన్స్‌ నిరుత్సాహపడకూడదు. 5 సంవత్సరాల క్రితం ఓ స్ట్రీట్‌లో చాలా సెల్‌ఫోన్స్‌ కనిపించాయి నాకు. అప్పుడే ‘2.ఓ’ ఐడియా వచ్చింది.  
► ‘2.ఓ’ లో ఐశ్వర్యారాయ్‌ని ఎందుకు తీసుకోలేదు?
‘రోబో’ లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఉంది. కానీ ‘2.ఓ’ డిఫరెంట్‌ స్టోరీ. సైంటిస్ట్, చిట్టి, రోబో 2.0 క్యారెక్టర్లు ఉన్నాయి. స్టోరీ డిమాండ్‌ చేయలేదు. కానీ, ఐశ్వర్యారాయ్‌ క్యారెక్టర్‌ రిఫరెన్స్‌ సినిమాలో కనిపిస్తుంది.
► తర్వాతి ప్రాజెక్టులు ఏంటి?
కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2’ సినిమా చేయబోతున్నాను. ఇందులో బాలీవుడ్, సౌత్‌ స్టార్స్‌ ఉంటారు. డిసెంబరులో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top