అదే మా బ్యానర్‌ విజయ రహస్యం

Producer Bunny Vas Talk About Prathi Roju Pandage Movie - Sakshi

‘‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత కొన్ని నెలలు ఓ కథ మీద వర్క్‌ చేశాడు మారుతి. ఆ తర్వాత మరో ఆలోచనను పంచుకున్నాడు. అది నచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం. అయితే మా అమ్మగారి వల్ల ఈ సినిమా చేయాలనుకున్నాను’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’’ వాస్‌. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్‌ నిరి్మంచారు. సత్యరాజ్, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ‘బన్నీ’ వాస్‌ చెప్పిన విశేషాలు.

►దర్శకుడు మారుతి, నేను, యూవీ క్రియేషన్స్‌ వంశీ, యస్‌కేయన్‌ (ఈ చిత్ర సహనిర్మాత) మంచి ఫ్రెండ్స్‌. ఏ ఐడియా వచి్చనా నలుగురం పంచుకుంటాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లా ఎప్పుడూ ఉండం. మారుతి క్రియేటర్‌ కాబట్టి అతని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను.

►‘ప్రతి రోజూ పండగే’ కథ బాగానే అనిపించింది కానీ అమ్మానాన్నలను అశ్రద్ధ చేసేవాళ్లు ఎవరుంటారు? కనెక్ట్‌ అవుతారా? అనే డౌట్‌ని కొందరు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే  మా అమ్మగారు నాకు ఫోన్‌ చేశారు. ‘ఐదు రోజులుగా నీతో మాట్లాడటానికి ప్రయతి్నస్తున్నాను రా’ అన్నారు. నాకు వెంటనే తల్లిదండ్రులను అశ్రద్ధ చేసేవాళ్లలో నేను కూడా ఉన్నానా? అని భయం వేసింది. మేం పట్టించుకోనప్పుడు మీకెలా ఉంటుంది అమ్మా? అని అడిగాను. ‘పెద్దయిపోయారు. మీకు బాధ్యతలు ఉంటాయని సర్ది చెప్పుకుంటాం రా’ అని చెప్పింది. అందరం ఏదో ఒకసారి మన పేరెంట్స్‌ను అశ్రద్ధ చేస్తున్నవాళ్లమే. అలాంటి కథ కాబట్టి మారుతిని గోఎహెడ్‌ అన్నాను.

►ఈ చిత్రంలో తేజ్‌ ఫిట్‌బాడీతో కనిపిస్తాడు. ‘బాడీ మీద క్రమశిక్షణ తప్పింది. వర్కౌట్‌ చేస్తాను’ అని ఈ సినిమా కోసం బాడీని రెడీ చేశాడు. యాక్టర్‌గా తనను తాను చాలా మెరుగుపరుచుకుంటున్నాడు.  

►చావు అనివార్యం. పెళ్లి, పుట్టినరోజుని ఎలా అయితే సెలబ్రేట్‌ చేసుకుంటామో చావుని కూడా అలానే సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా, ఫన్నీగా చెప్పాం.

►అల్లు అరవింద్‌గారి సలహాలు బావుంటాయి. మనం చెప్పినదాంట్లో పాయింట్‌ ఉందంటే తీసుకుంటారు. మూడు జనరేషన్స్‌ (అరవింద్‌గారు , నేను, నూతన దర్శకులు) కలసి పని చేయడమే మా బేనర్‌ విజయ రహస్యం.  

►ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్, అఖిల్‌– ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ చిత్రం, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, నిఖిల్‌– సూర్యప్రతాప్‌ సినిమాలు చేస్తున్నాం.

►సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించను. కానీ ఎప్పుడైనా బాధ కలిగినా, నా అభిప్రాయాలను పంచుకోవాలన్నా ఫేస్‌బుక్‌లో స్పందిస్తా.  

►మేం అడ్వాన్స్‌ ఇచ్చినా ఆ దర్శకుడికి వేరే ఆఫర్‌ ఉంటే చేసుకోమంటాం. దర్శకులను మా దగ్గరే ఉండాలని నిబంధన పెట్టం. ప్రాజెక్ట్‌ ఓకే అయ్యాక మాత్రం వదలం (నవ్వుతూ).

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top