12 నెలలు సూచనలు

Priyanka Chopra's 12 Pro Tips for Life Will Inspire Even the Most Ambitionless Potato - Sakshi

‘‘గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉంది.. మహా అయితే నటించగలదు, డ్యాన్స్‌ చేయగలదు.. వాక్చాతుర్యం ఉంటుందా? అని తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు ప్రియాంకా చోప్రా షాకిచ్చారు. ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌’ అనేలా మాట్లాడి, అందర్నీ అబ్బురపరిచారు. ఓ ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ నిర్వహించిన ‘యాన్యువల్‌ లెక్చర్‌’లో భాగంగా మాట్లాడటానికి ఆమెను ఆహ్వానించారు. రచయితలు, కథకుల మధ్య జరిగే సదస్సులో ప్రియాంక ఏం మాట్లాడతారని కొందరు పెదవి విరిచారు. కానీ, తన అద్భుతమైన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. ‘‘మన ఆశలను, మన కలలను నిజం చేసుకోవాలంటే మనం బెస్ట్‌ అయ్యుండాలి. బెస్ట్‌ అనిపించుకోవాలంటే కొన్ని పాటించాలి’’ అంటూ ప్రియాంక కొన్ని సూచనలు కూడా చెప్పారు.

ధైర్యంగా నిలబడగలగటం:
మనం కన్న కలలకి, ఆశయాలకి మొట్టమొదటి శత్రువు మనలోని భయమే. ఆ భయంతో పోరాడాలి. ధైర్యంగా నిలబడి, గెలవాలి.

సరైన నిర్ణయాలు తీసుకోగలగటం:
మనం ఏం కావాలనుకుంటున్నామో అవి మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.

అవకాశాల్ని అందిపుచ్చుకోండి:
అవకాశాలు తరచుగా రావు. చాలా అరుదు. అందుకే దొరికిన వాటిని అందిపుచ్చుకోండి.

స్వార్థంగా ఉండండి:
‘ఇది లేక అది... ఏదో ఒకటి’ అంటూ మన కళ్ల ముందు ఒక్కోసారి రెండు చాయిస్‌లు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో స్వార్థంగా ఉండండి. రెంటినీ సద్వినియోగం చేసుకోండి.

కాంప్రమైజ్‌ కావద్దు:
మీకు నచ్చిన విషయాల్లో అస్సలు కాంప్రమైజ్‌ కావద్దు. నిర్ణయాలు మీరు తీసుకోవాలి తప్ప పరిస్థితులు లేదా ఇంకొకరు కాదు.

ఫెయిల్‌ అవ్వండి.. ఫెయిల్‌ అవుతూనే ఉండండి:
మీరు ఎన్నిసార్లు ఫెయిల్‌ అయినా బాధపడకండి. ఫీనిక్స్‌ పక్షిని ఆదర్శంగా తీసుకోండి. ఫెయిల్యూర్స్‌ నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్లండి.

రిస్క్‌ తీసుకోండి:
మనం ఎంత గొప్ప విజయం సాధించాలంటే అంత గొప్ప రిస్క్‌ తీసుకోవాలి అని నమ్ముతాను నేను.

పాజిటివిటీ:
మన సక్సెస్‌ మన చుట్టూ ఉన్న వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే పాజిటివ్‌ పీపుల్‌తో స్నేహం ఏర్పరచుకోండి.

అందర్నీ గెలవలేం:
ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత సాధించినా అందర్నీ సంతృప్తిపరచలేం. అందర్నీ గెలవలేం. అవతలివాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ముందుకు వెళం్లడి.

మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకోకండి:
మనం ఏం రాకెట్‌లు తయారు చేయడంలేదు. కూల్‌గా ఉండండి. జీవితాన్ని ఆస్వాదించండి.

తిరిగి ఇచ్చేయండి:
మన వంతుగా సమాజానికి సహాయం చేయాలి. మార్పు మనతో మొదలవ్వాలి.

మూలాల్ని మరువకండి:
ఎక్కణ్ణుంచి వచ్చామన్నది మరచిపోవద్దు.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏడాదికి 12 నెలలు. ప్రియాంక కూడా 12 సూచనలు చెప్పారు. ఒక్కో నెల ఒక్కటి ఫాలో అయినా ‘మనం బెస్ట్‌’ అనిపించుకోవచ్చేమో.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top