ఒంటికన్ను రాక్షసి

 Priya Prakash Warrier became the talk of the town - Sakshi

ప్రేమ

మధులిక ఆసుపత్రిలో ఉంది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. దాడిలో జ్యోతి చనిపోయింది. ప్రేమను నిరాకరిస్తే చంపేయడమేనా? ప్రేమలో నిరాదరణకు గురైతే చనిపోవడమేనా? ప్రేమికులు ఏకాంతంగా కనిపిస్తే వెంటాడి, వేటాడ్డమేనా? చిన్నప్పటి ఒంటికన్ను రాక్షసిలా ఈ ప్రేమెందుకు పెద్దయ్యాక తలుపులు తడుతోంది?!

మాధవ్‌ శింగరాజు
‘ముందు ఇతరులకిచ్చి తాననుభవించగల ప్రేమ ఆమె యందు సృష్టిచే సేకరించబడుచుండెను కాబోలు..’ అని ‘చలం’ విస్మయంగా ప్రకృతిని తిలకిస్తాడు. అతడి విస్మయం ప్రకృతి కాదు. శశిరేఖ. పదహారేళ్లుంటాయి ఆ పిల్లకు. నీళ్ల కోసం కడవతో కాలువకు వెళ్తుంటే.. ఆ సాయంకాలపు ఆరుగంటల ప్రకృతి ఆమె నుంచి ప్రేమను సంగ్రహిస్తూ ఉంటుంది! అది చూస్తాడు. ప్రకృతి వల్లనే కదా మానవజన్మకు సాఫల్యం. ఇదేమిటి, మిసమిసలకొస్తున్న ఒక కసుగాయి కనురెప్పల్నుంచి వీచే పరిమళంలో ప్రకృతే సోలిపోవడం! చలం కావ్యనాయిక ‘శశిరేఖ’. నూరేళ్ల నాటి శశిరేఖ. ప్రకృతేనా ఆమెలో తన కడవను నింపుకుంది? చలం తనే సృష్టించి, తనే పొందాలనుకోలేదూ.. కొంతైనా శశిరేఖలోని ప్రేమను! తొలి రచనే కాదు, తొలి వలపు కూడా చలానికి శశిరేఖ. ఫోన్‌లే లేని కాలపు ప్రేమ ఎమోజీ ఆమె. పర్టిక్యులర్‌గా శశిరేఖ అని కాదు. ఏ కాలానికైనా, ఎన్ని కాలాలకైనా స్త్రీని మించిన ఎమోజీ ఉంటుందా ప్రేమకు!‘ఇవ్వడమే’ ప్రేమ అనుకుంటుందేమో స్త్రీ.

ఊరికే అలా కళ్లల్లోకి చూస్తుంటుంది. ఏమీ అడగదు. అడిగినా.. ‘ఏమైనా అడగవేం?’ అని అడగడానికే. అదే ఆమె ప్రేమలోని బలం. ఆ బలం వల్లనే ప్రేమలో తను ఆమెకు బలిష్టుడినయ్యానని అనుకోడు పురుషుడు లేదా బాలుడు లేదా బలహీనుడు. పైగా స్త్రీ ప్రేమనే బలహీనం అనుకుంటాడు! అడక్కుండా ఆమె ఇచ్చిందీ, అడిగి ఆమె నుంచి తీసుకున్నదీ.. రెండూ గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ వెళ్లిపోతాడు.. మధ్యలో వాటిని ఏ కాల్వలోనో పారేసి హఠాత్తుగా! ఏమైపోయావని తనిక్కడ ఏడుస్తున్నా.. ‘నేనడిగానా.. నువ్వేగా నా వెంట పడ్డావ్, ఏడువ్‌’ అని మెసేజ్‌ వస్తుంది. ‘నువ్వంటే నాకేనా, నేనంటే నీకేం లేదా’ అని అడగడానికి ఫోన్‌ స్విచ్డ్‌ ఆఫ్‌! వేరే సిమ్‌లోకి వెళ్లిపోతాడు. ప్రేమకో సిమ్‌ ఉంటుంది ఆ ‘వాలెంటైన్‌’కి. ఏళ్లుగా ఇదే భంగపాటు స్త్రీ ప్రేమకు. అకస్మాత్తుగా ఉత్తరాలు ఆగిపోయేవి. ఏమైపోయాడో తెలీదు. ఏమనుకున్నాడో తెలీదు.

ప్రేమను రీచ్‌ అయ్యాక, ఇప్పుడూ అంతే.. మనిషి నాట్‌ రీచబుల్‌. ఆమె అన్నీ ఇచ్చింది. అడిగినంతా ఇచ్చింది. ‘ఇంకెవ్వరికీ ఇవ్వవు కదా’ అని అతడు అనుమానిస్తే.. ‘ఇవ్వడానికి ఉంటే కదా’ అని నవ్వింది. ‘ఉంటే ఇచ్చేదానివే.. ఎవరికైనా’ అంటే, ‘నువ్వు మిగలనిస్తే కదా మిగిలి ఉంటుంది’ అంది. యుగాలుగా ఎన్ని కోల్పోయింది స్త్రీ! కోల్పోవడం ఆమె స్వభావం. తను ప్రేమించినందుకే కాదు, తనను ప్రేమించినందుకూ ఇచ్చేస్తుందేమో. శిఖరాలకు ఆ ఔన్నత్యం, సముద్రాలకు నిగూఢత్వం, అగ్నికి జ్వాలాగుణం, నక్షత్రాలకు ఆ కాంతి.. స్త్రీ ఇచ్చిందే అనిపిస్తుంది. లేకుంటే వాటి ముఖం చూసి షెల్లీ రాసేవాడా, చలం రాసేవాడా పొయెట్రీ! పూలు, పక్షులు, గానం  కూడా.. వట్టి ప్లాస్టిక్‌ వేస్ట్‌.. స్త్రీ ఆ దరిదాపుల్లో లేకుండా. ఆమె ప్రేమ లోకాన్ని వెలిగించకుండా. స్త్రీ ప్రేమ వల్ల జీవితాన్ని వెలిగించుకున్న పురుషుడు ఆఖరికి ఆమె జీవితాన్నెందుకు చీకటిమయం చేసి వెళ్లిపోతాడు? ఏ యుగపు ప్రశ్న! ఈ యుగంలోనూ ఫ్రెష్‌గా ఉంది.

నేనున్నాను కదా.. నీ జీవితానికి పెద్ద వెలుగు.. మీ అమ్మానాన్న ఎందుకు? స్నేహితులెందుకు? వాళ్లతో వీళ్లతో మాటలు ఎందుకు? ఇంకా ఆ ఉద్యోగం ఎందుకు? సినిమాల్లో, సీరియళ్లలో ఆ యాక్టింగ్‌ ఎందుకు? బ్యాంకులో అకౌంట్‌లు ఎందుకు? ఒంటి మీద బంగారం ఎందుకు? పాపం అన్నీ ఇచ్చేస్తుంది, ఇచ్చేయడమే తన ప్రేమకు వెలుగు అన్నట్లు. ఇస్తున్న కొద్దీ వెలిగే ప్రేమ స్త్రీది. తీసుకోడానికి ఆమె దగ్గర ఇంకేం లేదని తెలిసేంతవరకే పురుషుడి ప్రేమ. తనేం ఇవ్వడా? ఇస్తాడు. ఇవ్వడంలో స్త్రీకి సంతోషం ఉందని తెలుసుకుని, స్త్రీ నుంచి ఇప్పించుకుని ఆమెకు సంతోషాన్నిస్తాడు! ఎలా ఈ ప్రేమల్నుంచి పిల్లల్ని కాపాడుకోవడం? ఆడపిల్లలే కాదు. మగపిల్లల్ని కూడా. పదహారూ పదిహేడేళ్లుంటాయి. అప్పుడప్పుడే వస్తున్న ఆ గడ్డాన్నీ మీసాల్నీ వేళ్లతో కప్పేస్తే వాడూ ఆడపిల్లలానే ఉంటాడు కానీ ప్రేమ అతడిని పురుషుడిని చేస్తుంది! రెండు జడల నుంచి ఆ క్రితమే ఒక జడకు వచ్చిన పిల్ల ఒకవేళ ఆ పురుషుడిచ్చిన ఐలవ్యూ పువ్వుని జడలోకి బాగుంటుందని తీసుకున్నా.. అదీ ప్రమాదమే.

ప్రేమ అనుకుంటాడు వాడు.. పువ్వును తీసుకోవడం, పువ్వును పెట్టుకోవడం! ఇంకెవరో ఐలవ్యూ పువ్వు కాకుండా, వట్టి స్నేహపు పువ్విచ్చి, దాన్ని ఆమె తలలో పెట్టుకున్నప్పుడు చూస్తే కనుక దుఃఖపడి గదిలోకొచ్చి ముఖం దాచుకుంటాడు. నేనేడ్వడం ఏమిటనుకుంటే ఏ బోండాల కత్తినో తెచ్చి దాచిపెట్టుకుంటాడు! దేవుడా.. ఎలా పిల్లల్ని పొత్తిళ్లలోకి తీసుకోవడం. ఎలా వాళ్లను మెడ మీదకు ఎత్తుకుని రెండు కాళ్లు, చేతులు కలిపి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకోవడం. ఎలా ఒక కారు బొమ్మ కొనిచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టడం. ఎలా ఒక చాక్లెట్‌ కొనిచ్చి మాయ చెయ్యడం.   పెరిగిపోయారే. ప్రేమంటున్నారే. అన్నం వద్దంటున్నారే. రాత్రంతా మేల్కొనే ఉంటున్నారే.

ఎలా ఈ ప్రేమ దెయ్యం నుంచి పిల్లల్ని తప్పించడం?! ప్రియా వారియర్‌ వస్తోందే ఎలా! ‘ఓ స్త్రీ రేపు రా’ అని గోడ మీద రాస్తేనో. రేపే వాలెంటైనూ వస్తున్నాడు. ‘రేపు రా’ అని అతడికీ రాస్తే? ఆ ఒంటి కన్ను రాక్షసి, ఆ ప్రేమ ప్రేతాత్మ వింటారా?!బాధ ఉండేదే.. బతుకుల్లోకి పిల్లలు వెళ్లే వరకు. ప్రేమా ఉండేదే.. బతుకు బంధాలకు వాళ్లు మళ్లే వరకు. నీళ్ల కోసం కాలువ కెళుతుంటే మెట్లు దిగేచోట జాగ్రత్త అని చెప్పడం, గులాబీ కొమ్మను విరుస్తుంటే.. ‘నీకు గుచ్చుకున్నా పర్లేదు, నువ్వు పువ్విచ్చే అమ్మాయికి ముల్లు గుచ్చుకోనివ్వకని హెచ్చరించడం మాత్రమే మన చేతుల్లో ఉన్నది. మనం చేయవలసి వున్నదీ.  ∙

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top