breaking news
Love story film
-
నీ వెంటే..
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాలు–స్నేహ జంటగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘నీ వెంటే నేను’. అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మించారు. ‘సినీ బజార్’ అనే డిజిటల్ థియేటర్లో ఈ చిత్రం అక్టోబరు 6న 177 దేశాల్లో విడుదల కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సినీబజార్ సీఈవో రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘నీ వెంటే నేను’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
దర్శకుడు శేఖర్ కమ్ముల కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్, అడిక్ట్ అవుతున్నాను’
ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా దాని గురించి చెప్పడానికి ఏదో మిగిలే ఉంటుంది. ప్రేమలోతును, అందులో మునిగినవారి పరిస్థితిని చెప్పడానికి ‘అమృతరామమ్’ సినిమా సిద్ధమైంది. ‘దేర్ ఈజ్ నో లవ్ విత్ అవుట్ పెయిన్’ అనే క్యాప్షన్‌తో సినిమా ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో మూలన మిగిలి ఉన్న ప్రేమను తట్టిలేపేందుకు ఈ ప్రేమకావ్యం త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. హీరో హీరోయన్లు రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమలో ఉండే అన్ని కోణాలను స్పృశించేందుకు ప్రయత్నించిందీ చిత్రం. కాకపోతే ఈ సారి ప్రేమకోసం పరితపించింది, ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది ప్రేమికుడు కాదు, ప్రేయసి. అదే ఈ సినిమాలోని ప్రత్యేకత. ‘తన ప్రేమని నువ్వు గెలవాలంటే ముందు నువ్వు ఓడిపోవాలి’, ‘ప్రేమలో సంతోషాలే కాదు, త్యాగాలు కూడా ఓ భాగమే’ ‘రోజురోజుకీ నాకు డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్, నేను నీకు అడిక్ట్ అవుతున్నాను’ ‘ఈ ప్రపంచంలో చావుకంటే నరకం ఏంటో తెలుసా... ఓ మనిషిని పిచ్చిగా ప్రేమించడం’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన ప్రేమగీతాలు సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. ఈ చిన్న సినిమా సురేష్‌బాబు లాంటి పెద్ద నిర్మాతను ఆకట్టుకుంది. ఈ సినిమాకు దర్శకుడు: సురేందర్ కొంటడ్డి. నిర్మాత: ఎస్ఎన్ రెడ్డి. సంగీత దర్శకుడు: ఎన్ఎస్ ప్రసు. గేయరచయిత: చైతన్యప్రసాద్, మధుసూదన్ రామదుర్గం, కృష్ణ చైతన్య. -
ఒంటికన్ను రాక్షసి
మధులిక ఆసుపత్రిలో ఉంది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. దాడిలో జ్యోతి చనిపోయింది. ప్రేమను నిరాకరిస్తే చంపేయడమేనా? ప్రేమలో నిరాదరణకు గురైతే చనిపోవడమేనా? ప్రేమికులు ఏకాంతంగా కనిపిస్తే వెంటాడి, వేటాడ్డమేనా? చిన్నప్పటి ఒంటికన్ను రాక్షసిలా ఈ ప్రేమెందుకు పెద్దయ్యాక తలుపులు తడుతోంది?! మాధవ్ శింగరాజు ‘ముందు ఇతరులకిచ్చి తాననుభవించగల ప్రేమ ఆమె యందు సృష్టిచే సేకరించబడుచుండెను కాబోలు..’ అని ‘చలం’ విస్మయంగా ప్రకృతిని తిలకిస్తాడు. అతడి విస్మయం ప్రకృతి కాదు. శశిరేఖ. పదహారేళ్లుంటాయి ఆ పిల్లకు. నీళ్ల కోసం కడవతో కాలువకు వెళ్తుంటే.. ఆ సాయంకాలపు ఆరుగంటల ప్రకృతి ఆమె నుంచి ప్రేమను సంగ్రహిస్తూ ఉంటుంది! అది చూస్తాడు. ప్రకృతి వల్లనే కదా మానవజన్మకు సాఫల్యం. ఇదేమిటి, మిసమిసలకొస్తున్న ఒక కసుగాయి కనురెప్పల్నుంచి వీచే పరిమళంలో ప్రకృతే సోలిపోవడం! చలం కావ్యనాయిక ‘శశిరేఖ’. నూరేళ్ల నాటి శశిరేఖ. ప్రకృతేనా ఆమెలో తన కడవను నింపుకుంది? చలం తనే సృష్టించి, తనే పొందాలనుకోలేదూ.. కొంతైనా శశిరేఖలోని ప్రేమను! తొలి రచనే కాదు, తొలి వలపు కూడా చలానికి శశిరేఖ. ఫోన్లే లేని కాలపు ప్రేమ ఎమోజీ ఆమె. పర్టిక్యులర్‌గా శశిరేఖ అని కాదు. ఏ కాలానికైనా, ఎన్ని కాలాలకైనా స్త్రీని మించిన ఎమోజీ ఉంటుందా ప్రేమకు!‘ఇవ్వడమే’ ప్రేమ అనుకుంటుందేమో స్త్రీ. ఊరికే అలా కళ్లల్లోకి చూస్తుంటుంది. ఏమీ అడగదు. అడిగినా.. ‘ఏమైనా అడగవేం?’ అని అడగడానికే. అదే ఆమె ప్రేమలోని బలం. ఆ బలం వల్లనే ప్రేమలో తను ఆమెకు బలిష్టుడినయ్యానని అనుకోడు పురుషుడు లేదా బాలుడు లేదా బలహీనుడు. పైగా స్త్రీ ప్రేమనే బలహీనం అనుకుంటాడు! అడక్కుండా ఆమె ఇచ్చిందీ, అడిగి ఆమె నుంచి తీసుకున్నదీ.. రెండూ గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ వెళ్లిపోతాడు.. మధ్యలో వాటిని ఏ కాల్వలోనో పారేసి హఠాత్తుగా! ఏమైపోయావని తనిక్కడ ఏడుస్తున్నా.. ‘నేనడిగానా.. నువ్వేగా నా వెంట పడ్డావ్, ఏడువ్’ అని మెసేజ్ వస్తుంది. ‘నువ్వంటే నాకేనా, నేనంటే నీకేం లేదా’ అని అడగడానికి ఫోన్ స్విచ్డ్ ఆఫ్! వేరే సిమ్‌లోకి వెళ్లిపోతాడు. ప్రేమకో సిమ్ ఉంటుంది ఆ ‘వాలెంటైన్’కి. ఏళ్లుగా ఇదే భంగపాటు స్త్రీ ప్రేమకు. అకస్మాత్తుగా ఉత్తరాలు ఆగిపోయేవి. ఏమైపోయాడో తెలీదు. ఏమనుకున్నాడో తెలీదు. ప్రేమను రీచ్ అయ్యాక, ఇప్పుడూ అంతే.. మనిషి నాట్ రీచబుల్. ఆమె అన్నీ ఇచ్చింది. అడిగినంతా ఇచ్చింది. ‘ఇంకెవ్వరికీ ఇవ్వవు కదా’ అని అతడు అనుమానిస్తే.. ‘ఇవ్వడానికి ఉంటే కదా’ అని నవ్వింది. ‘ఉంటే ఇచ్చేదానివే.. ఎవరికైనా’ అంటే, ‘నువ్వు మిగలనిస్తే కదా మిగిలి ఉంటుంది’ అంది. యుగాలుగా ఎన్ని కోల్పోయింది స్త్రీ! కోల్పోవడం ఆమె స్వభావం. తను ప్రేమించినందుకే కాదు, తనను ప్రేమించినందుకూ ఇచ్చేస్తుందేమో. శిఖరాలకు ఆ ఔన్నత్యం, సముద్రాలకు నిగూఢత్వం, అగ్నికి జ్వాలాగుణం, నక్షత్రాలకు ఆ కాంతి.. స్త్రీ ఇచ్చిందే అనిపిస్తుంది. లేకుంటే వాటి ముఖం చూసి షెల్లీ రాసేవాడా, చలం రాసేవాడా పొయెట్రీ! పూలు, పక్షులు, గానం కూడా.. వట్టి ప్లాస్టిక్ వేస్ట్.. స్త్రీ ఆ దరిదాపుల్లో లేకుండా. ఆమె ప్రేమ లోకాన్ని వెలిగించకుండా. స్త్రీ ప్రేమ వల్ల జీవితాన్ని వెలిగించుకున్న పురుషుడు ఆఖరికి ఆమె జీవితాన్నెందుకు చీకటిమయం చేసి వెళ్లిపోతాడు? ఏ యుగపు ప్రశ్న! ఈ యుగంలోనూ ఫ్రెష్‌గా ఉంది. నేనున్నాను కదా.. నీ జీవితానికి పెద్ద వెలుగు.. మీ అమ్మానాన్న ఎందుకు? స్నేహితులెందుకు? వాళ్లతో వీళ్లతో మాటలు ఎందుకు? ఇంకా ఆ ఉద్యోగం ఎందుకు? సినిమాల్లో, సీరియళ్లలో ఆ యాక్టింగ్ ఎందుకు? బ్యాంకులో అకౌంట్లు ఎందుకు? ఒంటి మీద బంగారం ఎందుకు? పాపం అన్నీ ఇచ్చేస్తుంది, ఇచ్చేయడమే తన ప్రేమకు వెలుగు అన్నట్లు. ఇస్తున్న కొద్దీ వెలిగే ప్రేమ స్త్రీది. తీసుకోడానికి ఆమె దగ్గర ఇంకేం లేదని తెలిసేంతవరకే పురుషుడి ప్రేమ. తనేం ఇవ్వడా? ఇస్తాడు. ఇవ్వడంలో స్త్రీకి సంతోషం ఉందని తెలుసుకుని, స్త్రీ నుంచి ఇప్పించుకుని ఆమెకు సంతోషాన్నిస్తాడు! ఎలా ఈ ప్రేమల్నుంచి పిల్లల్ని కాపాడుకోవడం? ఆడపిల్లలే కాదు. మగపిల్లల్ని కూడా. పదహారూ పదిహేడేళ్లుంటాయి. అప్పుడప్పుడే వస్తున్న ఆ గడ్డాన్నీ మీసాల్నీ వేళ్లతో కప్పేస్తే వాడూ ఆడపిల్లలానే ఉంటాడు కానీ ప్రేమ అతడిని పురుషుడిని చేస్తుంది! రెండు జడల నుంచి ఆ క్రితమే ఒక జడకు వచ్చిన పిల్ల ఒకవేళ ఆ పురుషుడిచ్చిన ఐలవ్యూ పువ్వుని జడలోకి బాగుంటుందని తీసుకున్నా.. అదీ ప్రమాదమే. ప్రేమ అనుకుంటాడు వాడు.. పువ్వును తీసుకోవడం, పువ్వును పెట్టుకోవడం! ఇంకెవరో ఐలవ్యూ పువ్వు కాకుండా, వట్టి స్నేహపు పువ్విచ్చి, దాన్ని ఆమె తలలో పెట్టుకున్నప్పుడు చూస్తే కనుక దుఃఖపడి గదిలోకొచ్చి ముఖం దాచుకుంటాడు. నేనేడ్వడం ఏమిటనుకుంటే ఏ బోండాల కత్తినో తెచ్చి దాచిపెట్టుకుంటాడు! దేవుడా.. ఎలా పిల్లల్ని పొత్తిళ్లలోకి తీసుకోవడం. ఎలా వాళ్లను మెడ మీదకు ఎత్తుకుని రెండు కాళ్లు, చేతులు కలిపి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకోవడం. ఎలా ఒక కారు బొమ్మ కొనిచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టడం. ఎలా ఒక చాక్లెట్ కొనిచ్చి మాయ చెయ్యడం. పెరిగిపోయారే. ప్రేమంటున్నారే. అన్నం వద్దంటున్నారే. రాత్రంతా మేల్కొనే ఉంటున్నారే. ఎలా ఈ ప్రేమ దెయ్యం నుంచి పిల్లల్ని తప్పించడం?! ప్రియా వారియర్ వస్తోందే ఎలా! ‘ఓ స్త్రీ రేపు రా’ అని గోడ మీద రాస్తేనో. రేపే వాలెంటైనూ వస్తున్నాడు. ‘రేపు రా’ అని అతడికీ రాస్తే? ఆ ఒంటి కన్ను రాక్షసి, ఆ ప్రేమ ప్రేతాత్మ వింటారా?!బాధ ఉండేదే.. బతుకుల్లోకి పిల్లలు వెళ్లే వరకు. ప్రేమా ఉండేదే.. బతుకు బంధాలకు వాళ్లు మళ్లే వరకు. నీళ్ల కోసం కాలువ కెళుతుంటే మెట్లు దిగేచోట జాగ్రత్త అని చెప్పడం, గులాబీ కొమ్మను విరుస్తుంటే.. ‘నీకు గుచ్చుకున్నా పర్లేదు, నువ్వు పువ్విచ్చే అమ్మాయికి ముల్లు గుచ్చుకోనివ్వకని హెచ్చరించడం మాత్రమే మన చేతుల్లో ఉన్నది. మనం చేయవలసి వున్నదీ. ∙ -
ఆ ఇద్దరితో శంకర్ మరో చిత్రం?
సెల్యులాయిడ్‌పై అద్భుతాల సృష్టికర్తలలో ఒకరు దర్శకుడు శంకర్. తమిళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకరని గంటాపథంగా చెప్పవచ్చు. అందుకే ఆయన వెండితెరకే ఇష్టమైన దర్శకుడుగా మారారు. అంతే కాదు ఆయన్ని జయాపజయాలకు అతీతుడని చెప్పవచ్చు. అలాంటి శంకర్ ఇక చిన్న చిత్రాలకు రూపకల్పన చేయడం సాధ్యం కాదేమో. చాలా కాలంగా ఒక చక్కని ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆసక్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు అవకాశం లేకపోతోంది. శంకర్ చిత్రం అంటే ఇప్పుడు అద్భుతం, అదరహో లాంటి పదాలకు పర్యాయాలుగా మారిపోయాయి. ఆయన చిత్రాలు 100, 200 దాటి 350 కోట్ల బడ్జెట్ చిత్రాల స్థాయికి పెరిగిపోయాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిస్తున్న 2.ఓ చిత్రం బడ్జెట్ 350 కోట్లు అంటున్నారు. ఇక వాట్ నెక్ట్స్ శంకర్ చిత్రం అన్న ప్రశ్న ఇప్పటి నుంచే తలెత్తడం విశేషం. దానికి సమాధానం కూడా కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఎస్ శంకర్ తదుపరి ఇళయదళపతి విజయ్, విక్రమ్ హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. నిజానికి ఈ చిత్రం 2.ఓ చిత్రానికి ముందే నిర్మాణం జరగాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల వెనక్కు వెళ్లి 2.ఓ చిత్రం ముందుకొచ్చిందనేది కోడంబాక్కమ్ వర్గాల టాక్. చాలా కాలం క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ విజయ్, విక్రమ్‌ల కాంబినేషన్లో చిత్రం చేస్తానని బహిరంగంగానే వెల్లడించారు. ఇదే నిజం అయితే విజయ్ హీరోగా నన్భన్, విక్రమ్ హీరోగా అపరిచితుడు, ఐ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన శంకర్ వీరిద్దర్ని కలిసి చేసే చిత్రం ఇంకెంత భారీగా ఉంటుందో ఊహించుకోండి. ఒకప్పుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి చాలా చిత్రాలు చేశారు. అలాంటి ట్రెండ్ కు శంకర్ మళ్లీ శ్రీకారం చుట్టనున్నారా? ఈ ప్రశ్నకు బదులు దొరకాలంటే 2.ఓ చిత్ర విడుదల వరకూ ఆగాల్సిందే.