సర్దార్... స్టార్టయ్యాడు | Pawan kalyan Sardar movie First Look | Sakshi
Sakshi News home page

సర్దార్... స్టార్టయ్యాడు

Aug 1 2015 12:20 AM | Updated on Mar 22 2019 5:33 PM

సర్దార్... స్టార్టయ్యాడు - Sakshi

సర్దార్... స్టార్టయ్యాడు

పవన్ కల్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. ‘గోపాల... గోపాల’ చిత్రం తరువాత కొద్ది నెలలుగా ...

పవన్ కల్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. ‘గోపాల... గోపాల’ చిత్రం తరువాత కొద్ది నెలలుగా మేకప్ వేసుకోని పవర్‌స్టార్ ఇప్పుడు తన తాజా చిత్రం ‘సర్దార్’ షూటింగ్‌లో పాల్గొనడం మొదలుపెట్టారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాక్సాఫీస్ హిట్ ‘గబ్బర్‌సింగ్’ ద్వారా జనసామాన్యాన్ని ఉర్రూతలూపిన పవన్ దాదాపు దానికి సీక్వెల్ తరహాలో ఉండేలా ఈ కొత్త సినిమాను డిజైన్ చేశారు. ముందుగా ‘గబ్బర్‌సింగ్-2’ అని టైటిల్ ప్రచారమైనా, చివరకు ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
 
 ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆ మధ్య పుణే సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో షెడ్యూల్‌లో పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశారు. ‘‘సర్దార్... గబ్బర్‌సింగ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎప్పటిలానే చాలా డైనమిక్‌గా, డ్యాషింగ్‌గా కనిపిస్తున్నారు’’ అని చిత్ర నిర్మాత శరత్ మరార్ పేర్కొన్నారు. సాధారణంగా సినిమా మొదలైన చాలా రోజుల తరువాత కానీ ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయరు. కానీ, ‘సర్దార్’కున్న క్రేజ్ దృష్ట్యానో, మరింత క్రేజ్‌ను తెచ్చేందుకనో కానీ, ఫస్ట్‌లుక్ స్టిల్ ఒకటి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. శరత్ మరార్ సైతం ఆ మాటే ఒప్పుకుంటూ, ‘‘ఫోటోలను కొంత ఆలస్యంగా రిలీజ్ చేయడం ఆనవాయితీ.
 
 కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఫ్యాన్స్ కోసం వ్యక్తిగతంగా ఈ చిత్రాన్ని షూట్ చేయించి, కంపోజ్ చేశారు’’ అని వివరించారు. పవన్‌కల్యాణ్ కేవలం వెనక నుంచి పోలీస్ డ్రెస్‌లో, తుపాకీతో, గ్యాంగ్‌ను ఎదుర్కొంటున్నట్లు స్టిల్‌లో కనిపించారు. ఆయన ముఖం కూడా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఈ స్టిల్ వైరల్‌గా వ్యాపించడం విశేషం. ‘పవర్’ చిత్ర ఫేమ్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఒక ఘట్టం కోసం ఇప్పటికే పవన్‌కల్యాణ్ గుబురు గడ్డం పెంచారు. ఇక, పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఎన్ని గెటప్‌లు వేస్తారో, ఏవేం డైలాగ్‌లు చెబుతారో వేచిచూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement