జీవించా..

Old actor  jayanthi special Interview  - Sakshi

మీలో చాలామంది నటి జయంతిని చూసి ఉండకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ చదివితే జయంతి మాత్రమే కాదు, చిన్ననాటి జయంతి గురించి కూడా మీకు తెలుస్తుంది!లైఫ్‌ని ఊరికే లాగించేస్తుంటారు మనుషులు.కానీ జయంతి, జీవితంలోని ప్రతి దశలోనూ జీవించారు!నటనలో జీవించడం నటులు చేసే పనే. జీవితంలో నటించకుండా ఉండటమే లైఫ్‌ అంటే.ఆ లైఫ్‌నే ‘జీవించా..’ అంటున్నారు జయంతి. నేడు ఆమె బర్త్‌ డే. ఆ సందర్భంగా.. సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ. 

ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు.. బర్త్‌డే (జనవరి 6) గురించి నాలుగు మాటలు?
జయంతి: ధన్యవాదాలు. ‘సాక్షి’ని కలవడం నాకూ ఆనందంగా ఉంది. ఆ మధ్య నేను అనారోగ్యానికి గురయ్యానని వార్త వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. బెంగళూరులో ఉన్న నాకు ఇలాంటి అభిమానం దక్కడం మరచిపోలేను. నాకు బర్త్‌డేలంటే భలే ఇష్టం. నేను నటిగా ఉన్నప్పుడు గ్రాండ్‌గా చేసేవాళ్లు. మెల్లిగా ఎందుకిదంతా అనిపించింది. ఆ తర్వాత చాముండేశ్వరీ మాత దేవాలయానికి వెళ్లి ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో అందరం కలసి భోజనం చేసేవాళ్లం. బర్త్‌డే నాడు ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కలుస్తాం. ఈసారి బయటకు ఎక్కడికీ వెళ్లడంలేదు. ఇంట్లోనే.

ఈ సందర్భంగా ఒక్కసారి మీ బాల్యంలోకి వెళదాం. ఎక్కడ పుట్టారు. ఎక్కడ పెరిగారు?
బళ్లారిలో పుట్టాను. ఎక్కువ సంవత్సరాలు అక్కడే పెరిగాను. నాన్న బాలసుబ్రహ్మణ్యంగారు  సెంట్‌ జోసెఫ్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా ఉండేవారు. అమ్మగారు సంతాన లక్ష్మీ. నేను పెద్ద అమ్మాయి. నాకు ఇద్దరు తమ్ముళ్లు యోగేశ్‌బాబు, హరికృష్ణ. ఇది మా ఫ్యామిలీ. మేం బెంగళూరులో ఉండేవాళ్లం. అమ్మానాన్న ప్రేమగా ఉంటూనే స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్లు.

స్కూల్‌ డేస్‌లో చురుకుగా ఉండేవారా? 
చాలా. స్కూల్‌ ఫంక్షన్స్‌లో స్టేజ్‌ మీద డ్యాన్స్‌ చేయాల్సిందే. ఓ ప్రోగ్రామ్‌ చూసి, మా అమ్మగారైతే ‘నా కూతురు పెద్ద డ్యాన్సర్‌ అయిపోతుంది’ అని మురిసిపోయి, నాన్నని ఒప్పించి మద్రాస్‌ తీసుకెళ్లి చంద్రకళ అనే డ్యాన్స్‌ మాస్టర్‌ దగ్గర చేర్పించారు. ఈవిడ డ్యాన్స్‌ స్కూల్‌ నడుపుతూ సినిమాల్లో డ్యాన్స్‌ చేసేవారు. ఆవిడ దగ్గర చేరినప్పుడు నటి మనోరమ నాకు సీనియర్‌. తనేం డ్యాన్స్‌ చేస్తుంది. చేయి ఊపుతుందా? నడుము ఊపుతుందా? అని సీనియర్స్‌ అంతా నన్ను ఏడిపించేవాళ్లు. నాకు బాగా ఏడుపొస్తే గోడకు కొట్టుకునేదాన్ని. ఓసారి అలా చేసినప్పుడు మనోరమ చూశారు. ‘కమలా.. ఎందుకలా చేస్తున్నావు?’ అని అడిగితే,   ‘వీళ్లంతా నన్ను ఏడిపిస్తున్నారు. వచ్చింది కూడా నేర్చుకోలేకపోతున్నాను’ అన్నాను. ‘కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేయాలి. సారీ చెప్పండి’ అని వాళ్లను దులిపేశారామె.

మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు?
ఆ రోజు మా టీచర్‌కి షూటింగ్‌ ఉంది. మేం కూడా వస్తామని వెళ్లాం. ఆ సమయంలో కన్నడ దర్శకుడు వైఆర్‌ స్వామి ఒక కన్నడ సినిమా తీస్తున్నారు. అందులో ముగ్గురు హీరోయిన్స్‌  పండరీ బాయి, చంద్రకళ. ఈ చంద్రకళ మా డ్యాన్స్‌ టీచర్‌ కాదు. ఆవిడ నటి. మూడో హీరోయిన్‌గా ఒక చిన్నమ్మాయి  కోసం వెతుకుతున్నారు. నేను ఆయన కళ్లలో పడ్డాను. ‘నీ పేరేంటి’ అని అడిగితే,  కమలా అని వినపడీ వినపడనట్టు చెప్పాను. మా సినిమాలో యాక్ట్‌ చేస్తావా? అని అడిగారు. టీచర్‌ వైపు చూస్తే, ‘ఆ అమ్మాయికి తెలియదండీ.. వాళ్లింటికి తీసుకెళ్తాను’ అన్నారు. మరుసటిరోజు వచ్చారు. ‘మాకు సినిమాలంటే ఇష్టం లేదు’ అని మా అమ్మగారు అన్నారు. సినిమా అన్నా సినిమావాళ్లన్నా తక్కువ భావన ఉండేదట. మా అమ్మ వద్దని చెప్పి, పంపించేశారు. పాపం మూడుసార్లు వచ్చారు. ‘మీ అమ్మాయి అయితే బాగుంటుంది. నా బిడ్డలాగా చూసుకుంటాను. నా భార్యా పిల్లలు షూటింగ్‌కి  వస్తారు. వాళ్ల పక్కనే కూర్చుంటుంది’ అని అమ్మని కన్విన్స్‌ చేశారు. 

ఓకే.. షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చెబుతారా?
అంతా చిత్రాతిచిత్రంగా అనిపించింది. మేకప్‌ పూస్తున్నారు.. పూస్తున్నారు.. పూస్తూనే ఉన్నారు. ఏంటి ఇదంతా పూస్తేనే బావుంటారా? అనుకున్నాను. ఆ తర్వాత ఒకతను తల దువ్వాడు. ఇంకొకతను బట్టలు తీసుకొచ్చారు. కొంపతీసి ఈ అబ్బాయి బట్టలు కడతాడా? అనుకున్నాను. బట్టలు కట్టరమ్మా ఇచ్చి వెళ్తారమ్మా అని చెప్పాడు. రెడీ అయ్యాక నన్ను కెమెరా ముందు నిలబెట్టారు. చుట్టూ జనం. నాకేం చేయాలో తెలియలేదు. దర్శకుడు వచ్చి, ‘చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పింది చేస్తే చాలు’ అన్నారు. అలానే చేశా. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఆ సినిమా పేరు ‘జేను గూడు’ (‘తేనె తుట్టి’ అని అర్థం).

ఆ తర్వాత మీ లైఫ్‌ తేనెలాగానే సాగిందా?
హహ్హహ్హ... ఇంత తియ్యగా ఎవరూ ఈ మాట ఇప్పటివరకూ అనలేదు. (నవ్వుతూ). నిజంగానే దాదాపు తియ్యగానే సాగింది. ‘జేను గూడు’ డైరెక్టర్‌ వై.ఆర్‌. స్వామిగారు నాకు ‘గినిమరీ’ అని పేరు పెట్టారు. అంటే.. చిలక పిల్ల అని అర్థం. ఆ పిక్చర్‌ పెద్ద హిట్‌ అయింది. పేరు చిన్నదిగా ఉంటే బాగుంటుందని స్వామిగారు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురి పేర్లు కలిసొచ్చేట్లు ‘జయంతి’ అని పేరు పెట్టారు.  

ఒకసారి సావిత్రిగారు షూటింగ్‌ లొకేషన్‌లో మీపై ఆగ్రహం వ్యక్తపరిచారట. నిజమా? 
కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల కలగడానికి సావిత్రిగారే కారణం. ఆ సినిమా పేరు గుర్తు లేదు. సావిత్రిగారి కాంబినేషన్‌లో ఓ సీన్‌ తీస్తున్నప్పుడు నేను డైలాగ్‌ చెప్పడానికి తడబడ్డాను. ఆవిడకు కోపం వచ్చి, భాష రానివాళ్లను తీసుకొచ్చి విసిగిస్తారా? ముందు సరిగ్గా నేర్పించండి అన్నారు. నిజానికి నాకు తమిళ్‌ రాదని, ఆ సినిమా చేయనంటే మేనేజ్‌ చేసుకుంటామని ప్రొడ్యూసర్‌ ఒప్పించారు. అందరి ముందు సావిత్రిగారు అనేసరికి దుఃఖం వచ్చేసింది. కో–డైరెక్టర్‌ సముదాయించడానికి ట్రై చేసినా ఇలా ఇన్‌సల్ట్‌ చేస్తే నా వల్ల కాదు, నా కోసం ఖర్చు పెట్టినదంతా తిరిగి ఇచ్చేస్తానని ఇంటికి వచ్చేశాను. సావిత్రిగారంటే నాకు ఇష్టం. ఆవిడతో నటించే చాన్స్‌ మిస్‌ అయిందని ఓ వైపు బాధ. మా అమ్మ విషయం తెలుసుకుని మంచి తమిళ ట్యూషన్‌ మాస్టారుని పెట్టించారు. నేనే వేరేవాళ్లకు డబ్బింగ్‌ చెప్పేంతగా నాకు తమిళ్‌ నేర్పించారు. ఆ తర్వాత ఓ కన్నడ పిక్చర్‌లో సావిత్రిగారు నాకు అత్తగారిగా చేశారు. షూటింగ్‌లో నేను ఆవిడ కాళ్లు పట్టుకున్నాను. ‘జయంతీ.. ఏంటమ్మా ఇది. కన్నడంలో నంబర్‌ వన్‌ హీరోయిన్‌వి. నా కాళ్ల మీద పడుతున్నావు?’ అనగానే ‘నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం మీరు. భాష నేర్చుకునేలా చేశారు’ అన్నాను.

కెరీర్‌ స్టార్ట్‌ చేసిన తొలి రోజుల్లో మీ నడక మగరాయుడిలా ఉండేదట.. ఎలా మార్చుకున్నారు?
దానికి కారణం రామారావుగారు. డ్యాన్స్‌ నేర్చుకోవడానికి మద్రాస్‌ వెళ్లినప్పుడు రామారావుగారిని చూడ్డానికి ఆయన ఇంటికి వెళ్లాం. అప్పుడాయన ‘నాతో యాక్ట్‌ చేస్తావా?’ అని నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని అడిగితే, మా అమ్మను చూశాను. ‘ఏం తాగుతారు? మజ్జిగా? మంచినీళ్లా? వీరు మా హీరోయిన్‌’ అన్నారు రామారావుగారు. నిజంగానే ఆయన సరసన ఆ తర్వాత ‘జగదేకవీరుని కథ’లో నటించాను. ఆ షూటింగ్‌ అప్పుడు ‘షాట్‌ రెడీ’ అని నన్ను పిలిస్తే, విసావిసా నడుచుకుంటూ వెళ్లాను. అప్పుడు రామారావుగారు ‘మీరు అబ్బాయా? అమ్మాయా?’ అనడిగారు. నాకేం అర్థం కాలేదు. అమ్మాయి అయితే ఇలా అబ్బాయిలా నడుచుకుంటూ వస్తారా? అంటూ ఆయనే ఒక కాలు వంకరగా పెట్టి నిల్చోమన్నారు. ఎలా నడవాలో చూపించారు. అప్పటివరకూ నా నడక మగపిల్లల్లానే ఉండేది. 

అప్పటివరకూ ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌లో కనిపించిన మీరు ‘మిస్‌ లీలావతి’లో స్విమ్‌ సూట్‌ ధరించడం, కన్నడ స్క్రీన్‌కి మోడ్రన్‌ డ్రెస్సులు పరిచయం చేసిన తారగా పేరు తెచ్చుకోవడం, ‘గ్లామర్‌ దివా’ బిరుదు దక్కించుకోవడం గురించి?
నాకు ఈ సినిమా రావడమే విచిత్రంగా జరిగింది. ఆ పాత్రకు షావుకారు జానకిగారిని, ఆమె స్నేహితురాలి పాత్రకు నన్ను సెలక్ట్‌ చేశారు. ఆ చిత్రదర్శకుడు యంఆర్‌. విఠల్‌ ‘అమ్మా..  ఇందులో మీరు స్విమ్మింగ్‌ షాట్స్‌ చేయాలి. స్విమ్మింగ్‌ డ్రెస్‌ వేసుకోవాలి, సినిమాకు కీలక సన్నివేశాల్లో వస్తుంది’ అని జానకిగారితో అన్నారు. ‘ఆ సీన్స్‌ లేవంటే చేస్తాను’ అన్నారు. దాంతో నాకు ఆ పాత్ర గురించి చెప్పారు. స్విమ్మింగ్‌ చేయాలంటే స్విమ్మింగ్‌ డ్రెస్‌ వేసుకోవాలి కదా. అందుకే నేను యస్‌ అన్నాను. అప్పటికి కన్నడ సినిమా లంగా, వోణీల వరకే ఆగింది. ఈ సినిమాతోనే స్కర్ట్స్, టీ షర్ట్స్, స్విమ్‌ సూట్‌ స్క్రీన్‌కి వచ్చాయి. తర్వాత ఇలాంటి కాస్ట్యూమ్స్‌ మామూలు అయిపోయింది. 

రాజ్‌కుమార్‌గారితో ఎక్కువ చిత్రాలు చేసిన రికార్డ్‌ మీదేనట?
అవును. మేమిద్దరం చాలా సినిమాలు చేశాం. మాకు ‘రాజా జోడీ’ అనే పేరు కూడా ఉంది. మా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో ‘బహదూర్‌ గండూ’ ది బెస్ట్‌. మేం ఇద్దరం నువ్వా నేనా అన్నట్టు యాక్ట్‌ చేశాం. అందులో నేను రాజ్‌కుమార్‌ని, ఆయన కామన్‌ మ్యాన్‌. పిక్చర్‌ సూపర్‌ హిట్‌. ఇంగ్లీష్‌ మ్యాగజీన్స్‌ ‘జయంతి స్టీల్స్‌ ది షో’ అని రాశారు. 

ఫిల్మ్‌ ఇండస్ట్రీ మేల్‌ డామినేటెడ్‌ కాబట్టి ఆ కామెంట్‌కి రాజ్‌కుమార్‌గారికి కోపం వచ్చిందా?
కోపమా? ఆయనతో నాకదే లాస్ట్‌ పిక్చర్‌ (నవ్వేస్తూ). ఆ తర్వాత మేమిద్దరం చేయలేదు.  

మరి వ్యక్తిగతంగా కూడా మీ రిలేషన్‌ చెడిపోయిందా?
(జయంతి తనయుడు కృష్ణ అందుకుంటూ) సినిమాలు చేయకపోయినా ఆయన ఉన్నంత వరకూ ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. ‘రాజ్‌’ అని పేరు పెట్టి కర్ణాటకలో రాజ్‌కుమార్‌గారిని పిలిచేంత చనువు అమ్మకే ఉంది. (జయంతి అందుకుంటూ) ఆ సంగతలా ఉంచితే.. రాజ్‌తో యాక్ట్‌ చేసిన ఓ సినిమాలో నా పాత్ర చనిపోతుంది. మంచం మీద అలా నిద్రపోయినట్టు ఉండమన్నారు. ఆయనకేమో భారీ డైలాగ్‌ ఇచ్చారు. ఆయనేమో ఒక పట్టాన సీన్‌ని వదలరు. ఆ ఎమోషన్‌లో నా కాళ్ల మీద దబ్బ్‌మని పడ్డారు. అంతే.. పోయాం అనుకున్నాను (నవ్వుతూ). 

ఫైనల్లీ.. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ‘సాక్షి’ కోరుకుంటోంది.
థ్యాంక్యూ. మీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది.

మిమ్మల్ని ఎస్వీ రంగారావుగారు ‘చిన్న రంగారావు’ అని పిలిచేవారట? 
రామారావుగారు, యస్వీ రంగారావుగారు, భానుమతిగారు.. వీళ్లతో ఒక్క సీన్‌లో అయినా యాక్ట్‌ చేయాలని ఉండేది. ఆ అదృష్టం నాకు దక్కింది. రామారావుగారితో చేశాను. రంగారావుగారి గురించి చెప్పాలంటే.. ఆయన ఎందుకో నాకు చిన్నపిల్లాడిలా అనిపించేవారు. అందుకే రంగా రంగా అని పిలిస్తే నవ్వుకునేవారు. ‘ఏంటీ ఈ అమ్మాయి అలా యాక్ట్‌  చేస్తోంది’ అని డైరెక్టర్‌ అంటే ‘ఆ అమ్మాయి చేసింది కరెక్టే. బాగా యాక్ట్‌ చేస్తోంది’ అని రంగారావుగారు అనేవారు. ఆయన నన్ను ‘చిన్న రంగారావు’ అని పిలిచేవారు. భానుమతిగారితో నాకో మరచిపోలేని ఇన్సిడెంట్‌ ఉంది. ఆవిడ ఏం ఆర్టిస్ట్‌ అండీ. ఆవిడ పాద ధూళికి కూడా సరిపోను. ఒక సినిమాలో మా ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సాంగ్‌ పెట్టారు. నేను స్పెషల్‌ డ్రెస్‌ తెప్పించుకొని రెడీ అయ్యాను.

భానుమతిగారు ఆవిడ స్టైల్‌లో రెడీ అయి వచ్చారు. నా పక్కన కూర్చుని నన్ను కిందకీ పైకీ చూస్తుండిపోయారు. నా పోర్షన్‌ రేపు షూట్‌ చేద్దాం అని వెళ్లిపోయారు. నేనెలా అయితే రెడీ అయ్యానో మరుసటి రోజు అదేలా రెడీ అయ్యి వచ్చారు. మా టైలర్‌ దగ్గర కనుక్కుని, ఆ హెయిర్‌ స్టైల్‌ నుంచి అన్నీ సేమ్‌ టు సేమ్‌ నాలానే రెడీ అయ్యారు. అంతే.. నేను ఖుష్‌ అయిపోయాను.జయంతికి ఒకే ఒక్క కుమారుడు. పేరు కృష్ణ. గతేడాది మార్చిలో జయంతి అస్వస్థతకు గురైనప్పుడు ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వార్త ప్రచారమైంది. అప్పుడు ‘సాక్షి’ కృష్ణను సంప్రదించగా, ‘అమ్మ బాగానే ఉన్నారు. ఆ వార్త నిజం కాదు’ అన్నారు. ఇప్పుడు బర్త్‌డే సందర్భంగా జయంతిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కృష్ణతో గతేడాది మార్చి గురించి మాట్లాడితే ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పారు.

 ‘జయంతి ఇక లేరు’ అనే వార్త ప్రచారమైనది తెలుసుకుని మీ అమ్మ ఎలా ఫీలయ్యారు?
కృష్ణ: తన వరకూ ఆ వార్తను వెళ్లనివ్వలేదు. ఎందుకంటే హెల్త్‌ బాగా లేనప్పుడు అలాంటివి వింటే తనేదో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని అమ్మ భయపడుతుందని చెప్పలేదు.

అసలు అప్పుడు ఏం జరిగింది?
అమ్మకు ఆస్థమా అటాక్‌ అయింది. దానివల్ల ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్‌ వచ్చింది. హాస్పిటల్‌లో ఉంచి మంచి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాం. ఆమె కోలుకునే నెలవరకూ కూడా జరిగిన రాంగ్‌ పబ్లిసిటీ గురించి అమ్మకు తెలియదు. ఆరోగ్యంగా ఇంటికి వచ్చాక అమ్మతో ‘అమ్మా.. మన దేశం మొత్తం నువ్వు అభిమానులను సంపాదించుకున్నావు. నీ గురించి ఎంతమంది ఫోన్లు చేశారో’ అన్నాను. అమ్మ ఆనందపడింది. నిజంగా అమ్మ అచీవ్‌మెంట్‌ అదే అనుకుంటాను. మార్చి నెల మొత్తం రాత్రీ పగలూ తేడా లేకుండా నా దగ్గరున్న మూడు ఫోన్లు రింగ్‌ అవుతానే ఉన్నాయి. 

మీ అమ్మగారు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని అప్పుడే తెలిసిందా?
అభిమానులు ఉన్న విషయం తెలియక కాదు. అయితే ఇంతమంది అభిమానం చూపిస్తారని ఊహించలేదు. ఒక సినిమా స్టార్‌కి ఉన్న గొప్ప అదృష్టం అది. 

మీరెందుకు సినిమాల్లోకి రాలేదు?
నాకు ఇంట్రెస్ట్‌ లేదు.

ఇప్పుడు సినిమాల్లో నటించడానికి అమ్మ ఆరోగ్యం సహకరిస్తుందా?ఓ..
(జయంతి) నూటికి నూట పది శాతం సపోర్ట్‌ చేస్తుంది. (నవ్వుతూ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top