‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ

Naga Shouryas Ashwathama Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌: అశ్వథ్థామ
జానర్‌: యాక్షన్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌
నటీనటులు: నాగశౌర్య, మెహరీన్‌, ప్రిన్స్‌, సత్య, జిష్షు సేన్ గుప్తా, పోసాని కృష్ణమురళి, తదితరులు
కథ: నాగశౌర్య
దర్శకత్వం: రమణతేజ
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
నిర్మాత: ఉషా మూల్పూరి

‘ఛలో’ చిత్రంతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న యువ హీరో నాగశౌర్య ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేపోయాడు. యూత్‌ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి బలమైన స్క్రిప్ట్‌తో పాటు సందేశాత్మక చిత్రాన్ని అందించేందుకు స్యయంగా నాగశౌర్యనే కథా రచయితగా మారాడు. తన లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను పక్కకు పెట్టి ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథ ‘అశ్వథ్థామ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. మరి ఈ సినిమాతో నాగశౌర్యకు యాక్షన్‌ అండ్‌ మాస్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిందా? మళ్లీ ఈ యువ హీరో హిట్‌ ట్రాక్‌ ఎక్కాడా? డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం.

కథ: 
నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు ప్రెగ్నెంట్‌ కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ.
https://www.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif 
గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు. అయితే రవి (ప్రిన్స్‌)తో ప్రియ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్‌)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?  ఈ కథలోకి డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్‌ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ

నటీనటులు:
నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వన్‌ మ్యాన్‌ షోతో నాగశౌర్య ముందుండి నడిపించాడు. ఇప్పటివరకు ఉన్న లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను తొలగించుకునేందుకు ఈ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ చిత్రంలో నటించిన నాగశౌర్య ఫుల్‌ ఎనర్జీతో సూపర్బ్‌ అనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌లలో హై వోల్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో అటు మాస్‌ ఆడియన్స్‌ను సొంతం చేసుకోవడం పక్కా. సినిమా తొలి అర్థభాగంలో కొన్ని సీన్లలలో కాస్త క్లాస్‌ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్‌ మాస్‌ అండ్‌ రఫ్‌ లుక్‌లో కనిపిస్తాడు. సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. క్లాస్‌ అండ్‌ రిచ్‌ విలన్‌గా చక్కగా ఒదిగిపోయాడు. 

రబ్బరు బొమ్మగా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ మెహరీన్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడం తడబడింది. అంతేకాకుండా తన పాత్రలో జీవించడం మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రిన్స్‌, నాగశౌర్య చెల్లెలి పాత్రలో కనిపించి అమ్మాయి సందర్భానుసారంగా స్క్రీన్‌ పై వచ్చి పోతుంటారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో వచ్చిపోతుంటారు తప్ప కథకు వారు పెద్ద ప్లస్‌ కాదు.

విశ్లేషణ:
ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్‌. దీంతో తెరపైనే కాకుండా తెరవెనక కూడా ప్రధాన హీరో నాగశౌర్యనే. ఇక హీరో అందించిన కథను దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కూడా బోర్‌ కొట్టకుండా, నెక్ట్స్‌ ఏంజరుగుతుంది అనే కుతూహలం సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్‌ సాగుతుంది. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్‌ వరకు బాగానే ఉన్న సెకండాఫ్‌ దర్శకుడు ఎలా తీస్తాడా?  అనే అనుమానం అందరిలోనూ తలెత్తడం ఖాయం.

అయితే సెకండాఫ్‌లో కూడా కథను ఎక్కడా డీవియేట్‌ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్‌ ప్లే కూడా చాలా బాగుంది. యాక్షన్‌ సీన్స్‌ వావ్‌ అనిపిస్తాయి. అయితే అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ అంతగా పండలేదు. దీనిపై కాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్‌తో సినిమా ముగించడంతో సినిమా అయిపోయిందా అనే భావన సగటు ప్రేక్షుకడికి కలగడం ఖాయం. 
https://www.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif 
మనోజ్‌ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్‌ అందాలు, యాక్షన్‌ సీన్లలో మనోజ్‌ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జిబ్రాన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌. కొన్ని సీన్లలో సైలెంట్‌ మ్యూజిక్‌.. మరికొన్ని చోట్ల హార్ట్‌ బీట్‌ను పెంచే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించాడు. ముఖ్యంగా హీరో ఈల వేసేటప్పుడు థియేటర్‌ మొత్తం నిశ్శబ్బ వాతావరణం అలుముకుటుంది. ఇక శ్రీచరణ్‌ పాకాల పాటలు పర్వాలేదనిపించాయి. కానీ గుర్తుండిపోయే పాటలు మాత్రం కాదు. ఇక ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ‘గోపాల గోపాల’ సినిమాలో ధర్మం గురించి పవన్‌ కళ్యాణ్‌ చెప్పే డైలాగ్‌తో సినిమా ఆరంభం అవడం ‘అశ్వథ్థామ’కు బూస్టప్‌ను ఇచ్చే అంశం. 

ఆకట్టుకునే డైలాగ్‌లు: 
‘ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయింది రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు చనిపోయేవాడా?’, ‘లాంగ్‌ డిస్టెన్స్‌ రిలేషన్‌ షిప్‌లో ఏదో మ్యాజిక్‌ ఉంది’, ‘ప్రస్తుత కాలంలో ఆడపిల్లను కని, పెంచి ఏ గొడవ లేకుండా పెళ్లి చేయడం అంటే సాధారణ విషయం కాదు’ అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉంటాయి.

ప్లస్‌ పాయింట్స్‌:
కథ, కథనం
నాగశౌర్య నటన
బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌

మైనస్‌ పాయింట్స్‌:
కొన్ని సాగదీత సీన్స్‌
పాటలు
క్లైమాక్స్‌ సాదాసీదాగా ఉండటం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top