అందుకే ‘ఎంఎల్‌ఎ’ కథ ఎంచుకున్నా

MLA Telugu Movie Review, Rating - Sakshi

‘‘నా పేరు ఉపేంద్ర రెడ్డి. మా బ్రదర్‌ పేరు మాధవ్‌ రెడ్డి. ఆయన రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. ఆయన లేకుంటే ఇండస్ట్రీలో నేను ఇన్నేళ్లు ఉండేవాణ్ని కాదు. అందుకే నా పేరుకి మా బ్రదర్‌ పేరు యాడ్‌ చేసుకుని ఉపేంద్రమాధవ్‌ అని పెట్టుకున్నా’’ అని ఉపేంద్ర మాధవ్‌ అన్నారు. కల్యాణ్‌ రామ్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎంఎల్‌ఏ’. టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా ఉపేంద్ర మాధవ్‌ మాట్లాడుతూ– ‘‘మాది గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని జొన్నలగడ్డ. దర్శకుడు కావాలనే హైదరాబాద్‌ వచ్చా. ప్రియదర్శిని రామ్‌గారి వద్ద ‘మనోడు, టాస్‌’ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశా. ఆయన వద్దే యాడ్స్, కార్పొరేట్‌ ఫిల్మ్స్‌ చేసేవాణ్ని. నా ఫ్రెండ్‌ సాయి ద్వారా ‘దూకుడు’ సినిమాలో స్క్రిప్ట్‌ విభాగంలో అసోసియేట్‌గా పనిచేసే చాన్స్‌ వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద, యాక్షన్‌ త్రీడీ, బాద్‌షా, ఆగడు, బ్రూస్‌లీ’ చిత్రాలకు రచనా విభాగంలో  పనిచేశా.

‘బ్రూస్‌లీ’ తర్వాత సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టా. శ్రీనువైట్లగారితో బాగా ట్రావెల్‌ అయ్యేవాణ్ని. ఓ కమర్షియల్‌ సినిమాతోనే లాంచ్‌ కావాలని ‘ఎంఎల్‌ఎ’ కథ ఎంచుకున్నా. ‘పటాస్‌’ సినిమా టైమ్‌లో అనిల్‌ రావిపూడి ద్వారా కల్యాణ్‌రామ్‌తో పరిచయం అయింది. మంచి కథ తీసుకురా సినిమా చేద్దామన్నారు ఆయన. రెండేళ్ల తర్వాత ‘ఎంఎల్‌ఎ’ కథ ఆయనకు వినిపించడం, నచ్చడం, సినిమా మొదలవడం జరిగిపోయాయి. ఈ కథ బాగుందని శ్రీనువైట్లగారు కూడా అభినందించారు. సినిమా విడుదలయ్యాక చాలామంది దర్శకులు ఫోన్‌ చేసి ‘మంచి కథ. బాగా తీశావ్‌’ అని మెచ్చుకున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నా రెండో సినిమా కూడా పీపుల్‌ మీడియా, బ్లూ ప్లానెట్‌ బ్యానర్స్‌లోనే ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top