నరసింహ పంచ్‌లు రజనీ రాసిన వేళ

KS Ravikumar meets Superstar Rajinikanth - Sakshi

‘నా దారి రహదారి. బెటర్‌ డోంట్‌ కమ్‌ ఇన్‌ మై వే. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’... ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్‌ చెప్పిన ఈ పంచ్‌ డైలాగులు ఇప్పటికీ పాపులరే. ఆ డైలాగులను ఇంకా వాడుతూనే ఉన్నాం. విశేషమేంటంటే ఈ డైలాగులను రాసింది రజనీకాంతే. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పడయప్పా’. (తెలుగులో నరసింహ). శివాజీ గణేశన్, సౌందర్య, రమ్యకృష్ణ, అబ్బాస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.  ఏప్రిల్‌ 10వ తేదీతో ఈ సినిమా రిలీజ్‌ అయి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ ఓ ఇంగ్లీష్‌ పత్రికతో సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు.

► సినిమాలో ఫీమేల్‌ విలన్‌ (నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ) ఉండాలన్నది స్వయంగా రజనీకాంత్‌ ఆలోచనే. రజనీకాంత్‌ పొలిటికల్‌ స్టాండ్‌ ప్రకారం ఆ ఫీమేల్‌ విలన్‌ పాత్ర అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి రూపొందించినది. ఒకర్ని ఉద్దేశించి రూపొందించిన పాత్ర అయినప్పటికీ అన్ని రాష్ట్రాల వాళ్లు ఎంజాయ్‌ చేసేంత బలమైన కథ అయ్యుండాలని చెప్పారు రజనీ.

► నీలాంబరి పాత్ర కోసం మొదట మీనా, నగ్మా పేర్లను అనుకున్నాం. కానీ ఎందుకో వాళ్లు సూట్‌ కారనిపించింది. ఆ తర్వాత డిస్కషన్స్‌లో రమ్యకృష్ణ పేరు వచ్చింది. ఆమె అయితే కరెక్ట్‌ అనుకుని, స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేయకుండానే ఫిక్స్‌ చేశాం. తన పాత్రకు నీలాంబరి అనే పేరుని కూడా రజనీయే సూచించారు.

► మొదట నీలాంబరి పాత్ర కోసం అనుకున్న మీనా వసుంధర పాత్రకు అయితే బావుంటుందనుకున్నాం. ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో రజనీకాంత్‌తో అప్పటికే ‘అరుణాచలం’లో నటించిన సౌందర్యనే హీరోయిన్‌గా తీసుకున్నాం.

► ‘నా దారి రహదారి, పోరా.. ఆ దేవుడే నా వైపు ఉన్నాడు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’.. ఈ మూడు ఫేమస్‌ పంచ్‌ డైలాగులను రజనీకాంతే స్వయంగా రాసుకున్నారు. మేం స్క్రిప్ట్‌ తయారు చేసే ఆలోచనల్లో ఉంటే రజనీకాంత్‌ డైలాగ్స్‌ గురించి ఆలోచించేవారు.

► సినిమాలో రమ్యకృష్ణ వాడిన రెక్కలు విచ్చుకునే కారు నాదే. స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌ అప్పుడు నా కార్లో రజనీ, నేను తిరిగేవాళ్లం. ఈ  కారు అయితే నీలాంబరి క్యారెక్టర్‌కు బాగా సూట్‌ అవుతుందని రజనీ తన అభిప్రాయం చెప్పారు.  అదే సినిమాలో  ఉపయోగించాం.

► సినిమా పూర్తయ్యేసరికి కంటెంట్‌ 19 రీళ్లు వచ్చింది. రెండు ఇంటర్వెల్స్‌ ఇచ్చేలా సినిమా రిలీజ్‌ ప్లాన్‌ చేద్దాం అన్నది రజనీకాంత్‌ ఆలోచన. అప్పట్లో  కమల్‌హాసన్‌ ‘భారతీయుడు’ సినిమాకు ఇదే ప్రాబ్లమ్‌. కమల్‌ను సలహా అడిగితే బావుంటుందని ఆయన్ను సంప్రదించాం. 14 రీళ్లకు సినిమాను కుదించండి అని ఆయన కూడా అనడంతో చాలా పోర్షన్‌ ఎడిట్‌ చేసేశాం. ఇప్పుడంటే డిజిటల్‌ అయిపోయింది. అప్పుడు ఫిల్మ్‌ కాబట్టి మిగిలిన భాగమంతా వృథా  అయిపోయింది. .

► నీలాంబరి, నరసింహను 18 ఏళ్ల తర్వాత కలిసే సందర్భం అది. నరసింహను నిలబెట్టి  తాను కుర్చీలో కూర్చుని అవమానించాలని నీలాంబరి భావిస్తుంది. నరసింహ తన స్టైల్లో అక్కడున్న కుర్చీ లాక్కొని కూర్చుంటాడు. ఇదీ సన్నివేశం. లొకేషన్‌కు వెళ్లి చూస్తే కుర్చీ లాగేంత చోటు లేదక్కడ.  లక్కీగా ఊయల ఉండటంతో ఆ ఊయలను పైనుంచి కిందకు లాగి కూర్చునే సన్నివేశంగా మార్చాం.

► ‘నరసింహ’æ షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ తరచూ వ్యాయామం చేస్తుండేవారు. కాస్ట్యూమ్స్‌ చేంజ్‌ సమయంలో రజనీకాంత్‌ ఫిట్‌ బాడీని గమనించాను నేను. రజనీ బాడీ చూపించే సన్నివేశం ఉంటే బావుంటుంది అనుకున్నాను. ఈ విషయం రజనీకు చెప్పడంతో రజనీ ఇంకా శ్రమించి ఎక్సర్‌సైజ్‌ చేశారు. ఆ సీన్‌లో ‘వాట్‌ ఏ మ్యాన్‌’ అనే డైలాగ్‌ అబ్బాస్‌తో చెప్పించాను.
‘నరసింహ’ గురించి రవికుమార్‌ చెప్పిన విషయాలు బాగున్నాయి కదూ. ఈ సినిమా తర్వాత రజనీతో ‘లింగా’ సినిమా డైరెక్ట్‌ చేశారు కేయస్‌ రవికుమార్‌. రజనీని మరోసారి డైరెక్ట్‌ చేయనున్నారట. ప్రస్తుతం రజనీ చేస్తున్న ‘దర్బార్‌’ తర్వాత రవికుమార్‌ కాంబినేషన్‌లో ఆయన సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని చెన్నై టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top