స్త్రీల ఇతివృత్తంగా కాట్రిన్‌ మొళి

Jyothika Kaatrin Mozhi Is Family Entertainer - Sakshi

తమిళసినిమా: సూర్యతో ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటూ పరిపూర్ణ సంసార జీవితాన్ని అనుభవిస్తున్న నటి జ్యోతిక. ఇంతకు ముందు అగ్రకథానాయకిగా వెలిగి నటనకు విరామం ఇచ్చి 36 వయదినిలే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తరువాత మగళీర్‌ మట్టుం, నాచియార్‌ అంటూ హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్‌ బాటలో సాగిపోతున్న జ్యోతిక తాజాగా కాట్రిన్‌ మొళి అంటూ తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు  రాధామోహన్‌న్‌దర్శకత్వంలో మొళి చిత్రంలో జ్యోతిక నటించారు. తాజాగా అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కాట్రిన్‌ మొళి. మొళి చిత్రంలో మూగ యువతిగా కళ్లతోనే నటించిన జ్యోతిక ఈ కాట్రిన్‌ మొళి చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా సరళంగా మాట్లాడే చురుకైన అమ్మాయిగా కనిపించనున్నారని దర్శకుడు రాధామోహన్‌ తెలిపారు.

ఆయన మరిన్ని వివరాలు తెలుపుతూ  ఇది హిందీలో సంచలన విజయం సాధించిన తుమ్హారా సుళు చిత్రానికి రీమేక్‌ అని,  అయితే తమిళ సంస్కృతికి దగ్గరగా చాలా మార్పులు, చేర్పులు చేసి మరి కొన్ని కొత్త పాత్రలను సృష్టించినట్లు తెలిపారు. ఇది స్త్రీల ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అయినా అన్ని వర్గాల వారు చూసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. ఇందులో విదార్థ్, నటి మంచులక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కాగా నటుడు శింబు అతిథి పాత్రలో నటించడం విశేషం. కుమరవేల్, భాస్కర్, మనోబాలా, మహన్‌ రామన్, ఉమాపద్మనాభన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏహెచ్‌.కాశీఫ్‌ సంగీతాన్ని, మహేశ్‌ ముత్తుసామి ఛాయాగ్రహణం అందించారు. దీన్ని బాఫ్టా మీడియా వర్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై జి.ధనుంజయన్, ఎస్‌. విక్రమ్‌కుమార్,లలిత ధనుంజయన్‌ నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top