
సినిమాలోకం ఎటు పోతోంది?
సినీలోకం ఎటు పోతోంది? అని ప్రశ్నిస్తున్నారు సంగీతజ్ఞాని ఇళయరాజా.
సినీలోకం ఎటు పోతోంది? అని ప్రశ్నిస్తున్నారు సంగీతజ్ఞాని ఇళయరాజా. మాస్, క్లాస్ అన్న తారతమ్యం లేకుండా కథను మెరుగుపరచే విధంగా సంగీతం అందించడంలో దిట్ట. ఈయనని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మెలోడీలో మధురిమలు గుబాళింపజేసే సంగీతరాజా సంగీతంతో ఎన్నో చిన్న చిత్రాలు ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి.
అలా తాజాగా ఆయన సంగీతం కారణంగానే పెద్ద చిత్రంగా తెరపైకి రానున్న వైవిధ్యభరిత చిత్రం ఎంగ అమ్మ రాణి. నటి ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సంగీతజ్ఞాని ఇళయరాజాతో ఎంగఅమ్మ రాణి చిత్ర ముచ్చట్లు..
ప్ర: ఎంగఅమ్మరాణి వంటి చిన్న చిత్రానికి సంగీతం అందించడానికి కారణం?
జ: ఇప్పుడు సినీలోకం ఎటువైపు పయనిస్తోంది? సరైన బాటలో సాగుతుందా?లేదా గాడితప్పుతుందా? అన్నది సినిమా చూసే ప్రేక్షకుడికి గానీ, తీసే వారికి గానీ సరిగా తెలియడంలేదు. ఉదాహరణకు చిన్న విషయం సీజీ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారికి రిజల్ట్ ఇలానే వస్తుందని చెప్పగలరా? అలాంటప్పుడు అందుకంటూ సెపరేట్ బడ్జెట్ ఎందుకు? ప్రస్తుతం సినిమాలో సహజత్వం కొరవడుతోంది.
భావోద్రేకాల్లో యథార్ధత లోపిస్తోంది. నేటికీ దేవాలయాలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం, ప్రజలకు మంచి విషయాలు తెలియజేయకపోతే నడవడిక మారిపోతుంది. భావితరాలకు మంచి విషయాలను రక్తంలో జీర్ణించుకునేలా చేయాలన్నదే. సినిమా ఒక కాలక్షేప మాధ్యమం అయినా అందులో మంచి కథాంశం, మంచి విషయాలు, చక్కగా చెప్పాలి. అలాంటి కథాంశంతో కూడిన చిత్రం కావడంతోనే ఎంగ అమ్మరాణి చిత్రానికి నేను సంగీతాన్ని అందిస్తున్నాను.
ప్ర: ఇంతకు ముందు మీరు చేసిన చిత్రాలకు ఈ చిత్రానికి భిన్నత్వం ఏమిటంటారు?
జ: నిజం చెప్పాలంటే నేను పని చేసే చిత్రాల గురించి ఎప్పుడూ మీ చెప్పను. చిత్రం చూసిన ప్రేక్షకులే చెప్పాలి. వాళ్లే ఇది మంచి చిత్రం అని చెప్పాలి.
ప్ర: ఎంగఅమ్మ రాణి చిత్రం గురించి మీ అభిప్రాయం?
జ: ఒక తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. కన్నబిడ్డపై తల్లికి అక్కర 200 శాతం ఉంటుంది. ఈ చిత్రంలో అలాంటి తల్లి తన పిల్లల కోసం ఎవరూ చేయనటువంటి పని చేస్తుంది.అదే ఈ చిత్రంలో కొత్తదనం.
ప్ర: చిత్రంలో పాటల గురించి?
జ: ఇందులో అమ్మ గురించి ఒక పాటను కంపోజ్ చేశాను.అది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అమ్మ అనే ఒకరు లేరనే భావన లోకంలో ఎవరికీ రాదు.అలా వా వా మగళే అనే ఈ పాట ప్రమోషన్‌లోనే విశేష ఆదరణను పొందింది.