సినీ చరిత్రను పరిరక్షించుకోవాలి  | History Of Cinema Must Be Preserved Says Directed Shyam Benegal | Sakshi
Sakshi News home page

సినీ చరిత్రను పరిరక్షించుకోవాలి 

Dec 9 2019 1:04 AM | Updated on Dec 9 2019 5:10 AM

History Of Cinema Must Be Preserved Says Directed Shyam Benegal - Sakshi

నాగార్జున, చిరంజీవి, రాజమౌళి

‘‘మనకెంతో విలువైన సినీ వారసత్వ సంపద ఉంది. కానీ, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలో తెలియకపోవడం బాధాకరం. ఆ పనిని ‘ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్’ ఎంతో చక్కగా నిర్వహించడంతో పాటు, వాటిని ఎలా భద్రపరచాలన్న అంశంపై శిక్షణ ఇస్తోంది. మన సినీ చరిత్రని పరిరక్షించుకోవడం ద్వారా భావి తరాలకు మన సంస్కృతిని అందించగలుగుతాం’’ అని లెజెండరీ దర్శకులు శ్యామ్‌ బెనగల్‌ అన్నారు. భారతీయ, తెలుగు సినీ వారసత్వ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ‘ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అర్కీవ్స్‌) (ఎఫ్‌ఐఎఎఫ్‌) సంయుక్తంగా ఆదివారం నుంచి ఈ నెల 15 వరకు హైదరాబాద్‌లో ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రారంభ వేడుకలో శ్యామ్‌ బెనగల్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాలు మన జీవితాల్లో అంతర్భాగం.

వాటిని భద్రపరచడమనేది మన దృశ్యపరమైన చరిత్రను, మన వారసత్వాన్ని, జ్ఞాపకాలను భద్రపరచడంతో సమానం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుండాలి. దీనికి ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు కావాలి’’ అన్నారు. హీరో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాక ఓ నిర్మాత నాకు అరుదైన కానుక ఇచ్చారు. నన్ను స్టార్‌ హీరోగా నిలబెట్టిన ‘ఖైదీ’ నెగిటివ్‌ రైట్స్‌ నాకు కానుకగా ఇచ్చారు. కానీ, అవి నాకు ఏ ల్యాబ్‌లో దొరక్కపోవడంతో బాధపడ్డా. ఈ తరంలో ఎంత మందికి రాజ్‌కపూర్, చిత్తూరు నాగయ్య, ఎల్వీ ప్రసాద్‌ వంటి వాళ్లు తెలుసు.. వాళ్లు అందించిన విలువైన సినీ సంపదను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు.

కానీ, వాటిలో మేం కొన్ని కూడా భద్రపరచుకోలేక పోయాం.. ఇది చాలా బాధగా ఉంది. వాటిని దాచుకోవాలన్న ఆలోచన కూడా మాకెప్పుడూ రాలేదు. నా ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాల నెగిటివ్‌ రీల్స్‌ ఇప్పుడు లేవు. కానీ, ఇక నుంచైనా మన సినీ వారసత్వ సంపదను కాపాడుకోవాలి’’ అన్నారు. డైరెక్టర్‌ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం అందరం డిజిటల్‌ మీడియాలో చిత్రాలు తెరకెక్కిస్తున్నాం.కానీ, వాటిని భద్రపరచుకోలేకపోతున్నాం. ‘మగధీర’ను భద్రపరచమని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్  స్థాపకులు శివేంద్రగారు నన్ను అడిగారు. నేను చేస్తా అన్నాను.. అప్పడు డిజిటల్‌లో 4కె రిజల్యూషన్‌ ఉన్న ఆ చిత్రం ఇప్పుడు 2కె రిజల్యూషన్‌కి పడిపోయింది. నాణ్యతను కోల్పోకుండా ఉండాలంటే  సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.  డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, టి.సుబ్బరామి రెడ్డి, నటి అమల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement