క్యాన్సర్‌ను ఎదిరించిన నటికి హ్యాపీ బర్త్‌డే

Happy Birthday Sonali Bendre She Brave Fight With Cancer - Sakshi

ఇండస్ట్రీలో టాప్‌ ప్లేస్‌లో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హీరోయిన్‌ సొనాలి బింద్రేను క్యాన్సర్‌ మహమ్మారి కుదిపేసింది. కానీ పడి లేచిక కెరటంలా ఆమె మామూలు స్థితికి రావడమే కాకుండా తనలాంటి వాళ్లలో పోరాడగలమన్న ధైర్యాన్ని నింపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న రోజుల్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన ఆమె ఆ తర్వాత తన లాంటి వాళ్లకు మాటలతో ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. క్యాన్సర్‌ గురించి ఎంతో మందికి అవగాహన కల్పించింది. ఇక తన గురించి చెప్పాలంటే క్యాన్సర్‌కు ముందు, క్యాన్సర్‌ తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. నేడు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్‌ సమయంలో పోరాడిన క్షణాలను, క్యాన్సర్‌ బాధితుల్లో ఉత్తేజం నింపిన పోస్టుల గురించి తెలుసుకుందాం..

సొనాలి బింద్రే గత పుట్టిన రోజు కన్నా ముందు ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. ఇందులో సొనాలి దీనంగా చూస్తున్న కళ్లతో బాధాతప్త హృదయంతో కనిపిస్తుంది. ‘నేను పోరాడటానికి, నాకు వచ్చిన క్యాన్సర్‌ను నయం చేయడానికి నాతో పాటు ఎందరో నిలబడ్డారు. వారికి కృతజ్ఞతలు. ఇక జీవితంలో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి.. అందులో నా జుట్టు ఒకటి అని తను జుట్టు కత్తిరించుకుంటున్న ఫొటోను పోస్ట్‌ చేసింది.

క్యాన్సర్‌ తర్వాత ఆమె కుంగిపోయిన మాట వాస్తవమే కానీ కుంగుబాటు నుంచి బయటకు వచ్చాక ఎంతోమంది తనలా బాధపడుతూ ఉన్నారని గ్రహించింది. వారితో ‘వాస్తవాన్ని అంగీకరించాలని, దాన్ని ఎదుర్కోవాలి’ అని పదేపదే చెబుతుండేది. ఇక క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అనంతరం గుండుతో, మేకప్‌ లేకుండా ఇండియాకు తిరిగొచ్చిన సొనాలీ సరికొత్త ఫొటో షూట్‌లతో అభిమానులను పలకరించింది. ‘నేను మీకు నేను శాంతిని ఇస్తున్నాను. దీంతో మీరు మీ స్వేచ్ఛను కనుగొంటారు’ అని హామీ ఇస్తున్నట్టుగా ప్రసన్న వదనంతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ‘పారాచ్యూట్‌ ఆయిల్‌ యాడ్‌ తర్వాతే నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. జీవితంలో ఎన్నో కోల్పోతామని అందులో జుట్టు కూడా ఒకటి. దానికోసం ఆలోచించడం బుద్ధి తక్కువ పని’ అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంది.

ఫిబ్రవరిలో జరిగే ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం నాడు సోనాలి తన మనసులో ఉన్న భావాలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. క్యాన్సర్‌ గురించి బాధపడటం, దానితో పోరాడుతున్నాం అని పిలిపించుకోవడం క్యాన్సర్‌ కన్నా దారుణం. ముందు దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించండి. ఇవాళ కాకపోతే రేపైనా మంచి జరుగుతుందన్న ఆశాభావంతో గడపండి. ఇది ప్రతికూల ఆలోచనలతో యుద్ధం కాదు, మీకు మీరే వాటిని దరిచేరనీయకుండా చేసుకునే ప్రయత్నం’ అంటూ ఇన్‌స్పిరేషనల్‌ పోస్ట్‌ పెట్టింది. వినాయక చతుర్థి సమయంలోనూ ‘నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి’ అని క్యాన్సర్‌ బాధితుల్లో విశ్వాసాన్ని నింపింది.

2018 అక్టోబర్‌లో సొనాలి క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎంత బాధను భరించిందో చెప్పుకొచ్చింది. ‘కనీసం చేతి వేలును ఎత్తాలన్నా నొప్పి కలిగేది. నేను ఓ చట్రంలో బంధీ అయిపోయాననిపస్తోంది. శారీరక బాధ కాస్తా మానసిక బాధకు దారి తీస్తోంది. కనీసం నవ్వినా కూడా నొప్పి పుడుతోంది. కానీ నేను చేస్తున్న యుద్ధానికి ఇవన్నీ తప్పవు. పోరాటం ఆపకూడదు’ అంటూ మానసిక ధైర్యాన్ని కూడదీసుకుంది. ‘క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో నొప్పిని అనుభవించాను, భరించలేక ఏడ్చాను. కానీ అవి మనం స్వీకరించాలి. భావోద్వేగాలు తప్పు కావు. కానీ కొంత కాలానికి వాటిని గుర్తించి దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి’ అని చెప్పుకొచ్చింది సొనాలి బింద్రే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top