నేను అదృష్టవంతురాలినే: కృతి సనన్‌

Funday Actress Kriti Sanon Interview - Sakshi

‘హీరో పంటి’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి సనన్‌కు ప్రతిభకు తగ్గ అంకితభావం ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే అయిదు సంవత్సరాలు పూర్తయింది. ఆమధ్య తెలుగులో ‘వన్‌: నేనొక్కణ్ణే’ సినిమాలో మహేష్‌బాబు సరసన తళుక్కున మెరిసింది. ‘హౌస్‌ఫుల్‌–4’ సినిమాతో నవ్వించడానికి ముస్తాబవుతున్న కృతి ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

కలల దారిలో...
బీటెక్‌ పూర్తి కాగానే నా అదృష్టం పరీక్షించుకోవడానికి ముంబై వెళ్లాను. పెద్దగా కష్టాలు పడకుండానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది, ఒకవిధంగా నేను అదృష్టవంతురాలినే అని చెప్పాలి. ఎందుకంటే నా కంటే ప్రతిభావంతులు ఎంతోమంది ఉండి ఉండచ్చు. ప్రతి సినిమాతో ఏదో ఒకటి  నేర్చుకుంటూ నాలోని ప్రతిభను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను.

అతడు
నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇలా ఉండాలి అనే ‘క్వాలిటీ లీస్ట్‌’ అమ్మాయిలందరికీ ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే అతడు అందరికీ మర్యాద ఇచ్చే వాడై ఉండాలి. అతడి ప్రస్తావన రాగానే ‘అబ్బాయి చాలా మంచోడు’ అనిపించుకునేలా ఉండాలి. పిల్లలంటే  బాగా ఇష్టమైనవాడై ఉండాలి. అతడితో మాట్లాడితే ఇంకా ఇంకా మాట్లాడాలనిపించాలి. మాటల్లోనే కాదు ‘నిశ్శబ్దం’లో కూడా అతడితో సంతోషంగా ఉండగలగాలి!

పెళ్లి
వివాహ వ్యవస్థ పట్ల నాకు గౌరవం ఉంది. పెళ్లి అనేది ఒక అందమైన భావన. అరెంజ్‌డ్‌ మ్యారేజ్‌ అంటే నాకేమీ వ్యతిరేకత ఏమీ లేదుకానీ, బొత్తిగా పరిచయం లేకుండా, అతడి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం తగదు అనేది నా అభిప్రాయం. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోడం అంటే అతడితో జీవితాంతం కలిసి ఉండడం. అతడి గురించి పూర్తిగా తెలుసుకోగలిగినప్పుడే, అతడిని బాగా ప్రేమించగలం. అప్పుడే ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ అంటే బ్యూటిఫుల్‌ కమిట్‌మెంట్‌ కదా! చేతిలో చేయి వేసుకొని, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచే వృద్ధదంపతులను చూసినప్పుడు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది నాకు!

ఆనందం
ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి అభిరుచులు, ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. అందుకే ‘ఏకాభిప్రాయం’ ‘సర్వజన ఆమోదం’ అనేది అన్నివేళాల సాధ్యం కాకపోవచ్చు. ‘‘ఈ స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తే తప్పకుండా హిట్టే’’ అనుకుంటాం. తీరా సినిమా విడుదలయ్యాక ఫలితం మరోలా ఉంటుంది! స్క్రిప్ట్‌ నచ్చినప్పుడు, అది సినిమాగా వచ్చినప్పుడు, అది ప్రేక్షకులకు నచ్చినప్పుడు... ‘‘ఆడియెన్స్‌ ఆలోచనలకు దగ్గరగా ఉన్నాం కదా’’ అనే చిన్నపాటి ఆనందం కలుగుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top