
‘ఇంకొక్కడు’ మరింత ఉత్సాహాన్నిచ్చింది
విలక్షణ హీరో విక్రమ్ నటించిన తాజా సినిమా ‘ఇంకొక్కడు’. నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్లు. ఆనంద్ శంకర్ దర్శకత్వం
విలక్షణ హీరో విక్రమ్ నటించిన తాజా సినిమా ‘ఇంకొక్కడు’. నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్లు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్.కె.ఆర్. ఫిలింస్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ నెల 8న విడుదల చేసిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. హీరో విక్రమ్ చెప్పిన విశేషాలు...
ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేయాలనుకోలేదు. దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పగానే.. విలన్‌గా ఎవరు చేస్తే బాగుంటుందని చాలా డిస్కషన్స్ జరిగాయి. రెండు రోజుల తర్వాత దర్శకుడితో హీరోగానూ, విలన్‌గానూ నేనే చేస్తే ఎలా ఉంటుందని అడిగా. ‘వెరీ గుడ్ ఐడియా’ అన్నారు. ‘అపరిచితుడు’లోనూ, ‘ఐ’లోనూ సింగిల్ క్యారెక్టరే. కానీ, హీరో క్యారెక్టరైజేషన్‌లో మూడు భిన్నమైన పార్శ్వాలుంటాయి. నాకెప్పట్నుంచో డబుల్ యాక్షన్ చేయాలనే ఆశ ఉంది. ఈ సినిమాతో అది తీరింది.
హీరో పేరు ‘అఖిల్’, రా ఏజెంట్. కోపం ఎక్కువ. సమస్య వస్తే.. ఎదుటివ్యక్తిని ముందు కొట్టి, తర్వాత మాట్లాడతాడు. విలన్ పేరు లవ్. ఓ శాస్త్రవేత్త. ప్రేమ, మంచితనం, మానవత్వం వంటి గుణాలు అసలు లేవు. రెండు క్యారెక్టర్లలో నటించడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ప్రతి సినిమాలోనూ హీరో కంటే విలన్‌కి కొంచం తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులోనూ విలన్ (లవ్) క్యారెక్టర్ లెంగ్త్ తక్కువే. కానీ, హీరోతో సమానమైన పవర్‌ఫుల్ క్యారెక్టర్. అఖిల్‌తో పాటు లవ్‌కీ మంచి పేరొచ్చింది. ఇది ప్రయోగాత్మక సినిమా కాదు, పక్కా కమర్షియల్ ఫిల్మ్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. తెలుగులో కృష్ణారెడ్డిగారు, తమిళంలో శిబు సినిమాను నిర్మించారు. కేవలం డబ్బులు పెడితే చాలనుకునే నిర్మాతలు కాదు. ప్రతి విషయం మీద అవగాహన ఉంది. మంచి నిర్మాతలతో పని చేయడం ఆనందంగా ఉంది.
ఆనంద్ శంకర్ మొదటి సినిమా ‘ఆరిమానంబి’ విడుదలకు ముందు చూసి, పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. కథేమైనా ఉందా? అని అడిగితే.. ఓ నెల టైమ్ తీసుకుని నా కోసం ఈ కథ రాశాడు. నయనతార, నిత్యా మీనన్ అయితేనే కథకు న్యాయం చేస్తారనుకున్నాం. ఇద్దరూ బాగా నటించారు. హ్యారిస్ జయరాజ్, నా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు, పాటలు హిట్. అల్బమ్‌లో అన్ని పాటలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తారు. ఈ సినిమా పాటలు, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్.
ప్రస్తుతం కమర్షియల్ సినిమా చేయడమే రిస్క్. ‘ఇలాంటివి చాలా చూశాం’ అంటున్నారు ప్రేక్షకులు. అయినప్పటికీ ఆదరిస్తున్నారు. ‘ఇంకొక్కడు’ లాంటి డిఫరెంట్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈ విజయం మరిన్ని డిఫరెంట్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎంకరేజ్‌మెంట్ అందించింది.
‘‘మా ఎన్.కె.ఆర్ .ఫిలింస్ సంస్థ విడుదల చేసిన తొలి చిత్రమిది. వసూళ్లు బాగున్నాయి. విక్రమ్ నటనకు, చిత్రానికి మంచి పేరొచ్చింది. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. మా ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఈ రోజు (ఆదివారం) విశాఖలో విజయయాత్ర నిర్వహిస్త్తున్నాం. హీరో విక్రమ్‌తో సహా చిత్ర బృందమంతా 11 గంటలకు సి.యం.ఆర్ మాల్, 12 గంటలకు వి-మ్యాక్స్ థియేటర్‌ను సందర్శించనున్నాం’’
- నిర్మాత నీలం కృష్ణారెడ్డి