
ఔను పోటీ పడ్డాం
ఔను మేము పోటీపడ్డాం, చిత్రాల్లో ఒకరినొకరు విమర్శలు గుప్పించుకున్నాం అంటున్నారు నటుడు శింబు. ఈ సంచలన నటుడు మాట్లాడుతోంది ధనుష్ గురించే.
ఔను మేము పోటీపడ్డాం, చిత్రాల్లో ఒకరినొకరు విమర్శలు గుప్పించుకున్నాం అంటున్నారు నటుడు శింబు. ఈ సంచలన నటుడు మాట్లాడుతోంది ధనుష్ గురించే. ఇంతకు ముందు వీరిద్దరు బద్దశత్రువులుగా మెలిగారు. ఒకే వేదికపై సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అయితే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విదేశాలకూ ఒకటిగా వెళుతున్నారు. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న కాకాముట్టై చిత్రంలో శింబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు శింబు ఇటీవల ధనుష్‌తో కలిసి ఉన్న ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి మంచి పోటీతత్వం ఉన్న వాళ్లే మంచి మిత్రులవ్వగలరంటూ పేర్కొనడం విశేషం.
ధనుష్‌తో పోటీ గురించి శింబు ప్రస్తావిస్తూ తామిద్దరం 2000 సంవత్సరంలో ఒకే సారి హీరోలుగా రంగ ప్రవేశం చేశామన్నారు. అప్పట్లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఆ ప్రభావం తాము నటించిన చిత్రాల్లోనూ చోటు చేసుకునేదని తెలిపారు. ఒకరి సినిమా మరొకరి గురించి విమర్శలు గుప్పించుకునేవాళ్లం అన్నారు. ఈ పోటీ, పోరు అనేది తమ అభిమానుల వరకు పాకిందన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో వాళ్లు ఢీ అంటే ఢీ అంటూ మోదుకునేవారని తెలిపారు. అయితే ధనుష్‌కు తనకు మధ్య కోల్డ్‌వార్ అనేది కొంత కాలం తరువాత తగ్గుముఖం పడుతూ వచ్చిందన్నారు. సినిమా కార్యక్రమాల్లో ఒకరినొకరం పలకరించుకోవడం షేక్ హ్యాండ్‌లిచ్చుకోవడం ప్రారంభం అయ్యిందని చెప్పారు. అలా మొదలయిన తమ స్నేహం ఇప్పుడు పూర్తిగా బలపడిందని శింబు పేర్కొన్నారు.