
హైదరాబాద్ : సైరాలో స్వాతంత్ర సమరయోధుడిగా వెండితెరపై అద్భుత నటనను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే తన 152వ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషిస్తారనే ప్రచారం ఊహాగానమేనని వెల్లడైంది. కొరటాల మూవీలో మెగాస్టార్ లెక్చరర్ పాత్రలో అభిమానులను ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదలైన సైరా రూ 250 కోట్ల కలెక్షన్లతో చిరు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంలా నిలిచింది. ఇక కొరటాల శివ మూవీలో తమ హీరోను కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది.
ఈ మూవీలో చిరును స్లిమ్‌గా కనిపించాలని దర్శకుడు కోరడంతో మెగాస్టార్ జిమ్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. క్లాస్ లుక్‌తో తనదైన మాస్ స్టైల్‌తో మెగా స్టార్ ఈసారి దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొరటాల మూవీలో మెగాస్టార్ 30 సంవత్సరాల యువకుడిగా, పెద్దవయసు వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే చిరంజీవి యువకుడిగా ఉన్న పాత్రలో దర్శకుడు కోరిన మీదట ఆయన కుమారుడు రామ్‌చరణ్ పోషస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గోవింద్ ఆచార్య, గోవింద హరి గోవింద టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది.