బిగ్‌బాస్‌: ‘హనీమూన్‌కు కాదు మనం వచ్చింది’

Bigg Boss 3 Telugu Bigg Suspended Task And Punish Housemates - Sakshi

దొంగలు దోచిన నగరం టాస్క్‌ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్‌ కొనసాగింది. అందరూ వారి సహనాన్ని కోల్పోయి అరుచుకుంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ.. దాడికి దిగారు. ఇంటిని అల్లకల్లోలం చేశారు. శిల్పకు గాయాలవడంతో మొదటిరోజే ఏడ్చేసింది.  బిగ్‌బాస్‌ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్‌ సూచించారు. ఇంటిసభ్యులంతా ఇరకాటంలో పడగా.. ఏ ఒక్కరూ తప్పు చేయలేదు అని కెప్టెన్‌ వరుణ్‌ చెప్పడంతో కోప్పడిన బిగ్‌బాస్‌ ఈ విషయం నవ్వులాటగా ఉందా అంటూ హెచ్చరించారు. నిజాన్ని దాయకుండా నిక్కచ్చిగా రెండు పేర్లను బిగ్‌బాస్‌కు తెలియజేయాల్సిందిగా ఇంటిసభ్యులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో శ్రీముఖి- రాహుల్‌, రవిలు హింసకు పాల్పడ్డట్టుగా తెలియజేసింది. అదేవిధంగా శిల్పా చక్రవర్తి- అలీరెజా, రాహుల్‌.. వితికా- అలీ, రాహుల్.. రాహుల్‌- అలీ, హిమజ.. హిమజ- రాహుల్‌, రవి.. పునర్నవి- శ్రీముఖి, అలీ.. శివజ్యోతి- రాహుల్‌, అలీ.. రవి- వితిక, శివజ్యోతి.. అలీ- రాహుల్‌, రవి.. మహేశ్‌- రాహుల్‌, రవి.. బాబా భాస్కర్‌- పునర్నవి, రాహుల్‌ల పేర్లను సూచించారు. దీంతో ఎక్కువమంది రాహుల్‌, రవిలను సూచించడంతో.. వారిద్దరినీ జైలులో బంధించాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. వారికి తినడానికి తిండి కూడా ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించాడు. ‘నా పేరు చెప్పని రవిని అనవసరంగా జైల్లో వేయించాను’ అంటూ అలీరెజా కన్నీరుమున్నారయ్యాడు. జైల్లో ఉన్న రవి దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు.

జైలు కూడు ఎలా ఉంటుందో బిగ్‌బాస్‌ రుచి చూపించాడు. కాఫీ, టీ, ఆహారాన్ని అందించకుండా కేవలం రాగి సంగటిని మాత్రమే అందజేశాడు. దాన్ని తినడానికి రాహుల్‌, రవి నానాతంటాలు పడ్డారు. అనంతరం టాస్క్‌లో జరిగిన తప్పొప్పుల గురించి చర్చించుకున్నారు. రవి మాట్లాడుతూ.. వితిక ప్రవర్తన ఏం బాగోలేదంటూ చెప్పుకొచ్చాడు. వితిక, పునర్నవిలు మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారు.. కానీ పునర్నవి లేని సమయంలో వితికా ఆమె గురించి చాలా దారుణంగా మాట్లాడుతుందంటూ.. మిత్రులంటే అలా ఉంటారా? అని రాహుల్‌తో చెప్పుకొచ్చాడు. అలా వెనకాల గోతులు తీయడం నచ్చలేదని, తన మీద నమ్మకమే​ పోయిందని విమర్శించాడు. రాహుల్‌ మాట్లాడుతూ.. శ్రీముఖి కావాలని నన్నే టార్గెట్‌ చేస్తుందంటూ వాపోయాడు. ‘శిల్ప దగ్గర ఎక్కువ చేస్తున్నావేంటి? గుద్దితే.. ముక్కు పచ్చడవుద్ది’ అంటూ రాహుల్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది పునర్నవి. ఆ ఇద్దరూ రోజంతా చిప్పకూడు తింటూ జైలు జీవితాన్ని రుచి చూశారు.

ఇక టాస్క్‌ రద్దయినా వరుణ్‌, వితికాల మధ్య చిచ్చు చల్లారలేదు. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ పెట్టి ఆలోచించు అంటూ వితికపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యాడు వరుణ్‌. మనం షోకు వచ్చాం హనీమూన్‌కు కాదంటూ వితికపై ఫైర్‌ అయ్యాడు. దయచేసి నాతో మాట్లాడకు అంటూ వితిక ఏడుపు లంకించుకుంది. అయినా వరుణ్‌ కోప్పడుతూనే ఉన్నాడు. ప్రతీది భూతద్దం వేసుకుని చూస్తావంటూ నిందించి మరింత బాధపెట్టాడు. ఇక టాస్క్‌ రద్దు చేయటంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. హింసాత్మకమైన టాస్క్‌ ఇచ్చి హింస జరగకూడదు అనేదానిలో అర్థమేంటొ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. హింసకు చోటు లేదంటూనే బిగ్‌బాస్‌ కావల్సినంత హింస సృష్టించాడని అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top