
శ్రేయాన్ గొప్ప స్టార్ అవుతాడు
‘‘ఈరోజు ఫాదర్స్ డే. ఇంటర్నేషనల్ యెగా డే. అన్నింటినీ మించి మొదటిసారి కేసీఆర్‌గారు సినిమా వేడుకకు వచ్చిన రోజిది.
‘‘ఈరోజు ఫాదర్స్ డే. ఇంటర్నేషనల్ యెగా డే. అన్నింటినీ మించి మొదటిసారి కేసీఆర్‌గారు సినిమా వేడుకకు వచ్చిన రోజిది. దీన్నిబట్టి సినిమాల పట్ల, కళాకారుల పట్ల ఆయనుకున్న గౌరవం ఏంటో తెలుస్తోంది. సినిమా పరిశ్రమ ఒక బస్తీలాంటిది. చిన్న నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సినిమా పరిశ్రమను కేసీఆర్‌గారు కాపాడాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, స్వీయదర్శకత్వంలో వాసు మంతెన రూపొందించిన చిత్రం ‘బస్తీ’. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బిగ్ సీడీని ఆవిష్కరించారు.
ఆడియో సీడీని కూడా ఆయనే ఆవిష్కరించి, దాసరికి ఇచ్చారు. ఈ వేదికపై దాసరి ఇంకా మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది జయసుధ. 43ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. ఇప్పుడు తన బిడ్డని దర్శకుడు వాసు చేతుల్లో పెట్టింది. వాసు ఒకే ఒక్కసారి నన్ను కలిశాడు. అప్పుడే అతనికి ఎంత క్రియేటివిటీ ఉందో అర్థమైంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. శ్రేయాన్ గొప్ప స్టార్ అవుతాడు. కొత్త హీరోతో సినిమా తీయడం అంటే అంత సులువు కాదు. దానికి గట్స్ కావాలి’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘కేసీఆర్ ఆశీస్సులతో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఆయనతో నాకు చనువు తక్కువ. రెండు, మూడు సార్లు కలిసినప్పుడు ఆయన ఆలోచనలు తెలుసుకునే అవకాశం దక్కింది.
ఆ ఆలోచనలన్నీ సక్రమంగా జరిగితే భారతదేశంలోనే మన కేసీఆర్‌గారు నంబర్ వన్ ముఖ్యమంత్రి అవుతారు. ఇది అతిశయోక్తి కాదు. జయసుధ హీరోయిన్‌గా చేసిన ఓ సినిమాకి నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా క్లాప్ కొట్టాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి జంటగా నటించాం. నా బిడ్డల్లానే శ్రేయాన్ గొప్ప నటుడు కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.జయసుధ మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి సినిమాల్లోకి వస్తాడని ఊహించలేదు. ఎందుకంటే, తను స్పోర్ట్స్ పర్సన్. హఠాత్తుగా సినిమాల్లోకి రావాలనుకున్నాడు.. వచ్చాడు. నలభైమూడేళ్లుగా నన్ను ఆశీర్వదించినట్లుగానే మా అబ్బాయిని కూడా ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. వాసు మంతెన మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ఆడియో వేడుకను ఇంతమంది దిగ్గజాల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది.
నా జీవితంలో అపురూపమైన రోజిది. దర్శకుడిగా నేనెక్కడా శిక్షణ తీసుకోలేదు. ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు జయసుధగారు నన్ను ప్రోత్సహించి, నన్ను నమ్మి, వాళ్ల అబ్బాయిని నా చేతుల్లో పెట్టారు. ఇది వండర్‌ఫుల్ స్వీట్ స్టోరీ. శ్రేయాన్, ప్రగతి అద్భుతంగా నటించారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. విచ్చేసిన అతిథులకు శ్రేయాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. రామ్మోహనరావు, పార్లమెంట్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, ‘దిల్’ రాజు, లగడపాటి శ్రీధర్, యలమంచిలి సాయిబాబు, దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఎన్ శంకర్, నటులు మురళీమోహన్, రాజశేఖర్, సీనియర్ నటీమణులు, దర్శకులు విజయనిర్మల, శ్రీప్రియ, నటి, దర్శకురాలు జీవిత, చిత్రసంగీతదర్శకుడు {పవీణ్ ఇమ్మడి, చిత్రకథానాయిక ప్రగతి తదితరులు పాల్గొన్నారు.