అనుష్క తాజా చిత్రం ఖరారు | Sakshi
Sakshi News home page

అనుష్క తాజా చిత్రం ఖరారు

Published Tue, Mar 27 2018 4:14 AM

anushka new movie with gautham menon - Sakshi

తమిళసినిమా: నటి అనుష్క తాజా చిత్రం ఎట్టకేలకు ఖరారైందన్నది తాజా సమాచారం. బాహుబలి సిరీస్, భాగమతి వంటి భారీ చిత్రాల నాయకి అనుష్క చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఆమె చివరి చిత్రం భాగమతి విడుదలై రెండు నెలలు దాటినా తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో ఒక్క చిత్రం కూడా లేకపోవడంతో అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నారని, అందుకే కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మధ్య భాగమతి చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చెన్నైకి వచ్చిన అనుష్క తాను దర్శకుడు గౌతమ్‌మీనన్‌ చిత్రం మాత్రమే అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ దర్శకుడి చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

గౌతమ్‌మీనన్‌ ఇంతకు ముందు మల్టీస్టారర్‌ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు అనుష్కతో లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇదీ భాగమతి తరహాలో వైవిధ్య కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరగుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ విక్రమ్‌ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్‌ హీరోగా ఎన్నై నోక్కి పాయుమ్‌ తూట్టా చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.  అనుష్క ప్రధాన పాత్రలో నటించే చిత్రం పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అనుష్క ఇంతకు ముందు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో అజిత్‌కు జంటగా ఎన్నై అరిందాల్‌ చిత్రంలో నటించారన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement