అమితాబ్‌ రాజకీయాల్లోకి వెళ్లొద్దన్నారు

Amitabh Bachchan Advice Dont go to Politics to Rajinikanth - Sakshi

పెరంబూరు: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ తనను రాజకీయాల్లోకి వెళ్లొద్దని హితవు చెప్పారని  సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చెప్పారు. తలైవా అని ఎంతో అభిమానంగా పిలుచుకునే ఆయన అభిమానులు చాలా కాలంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అలా సుమారు 25 ఏళ్ల వారి ఆకాంక్షను నెరవేర్చడానికి రజనీకాంత్‌ సిద్ధమయ్యారు. గత రెండేళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్‌ నెలలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. అంతే కాదు ఎంజీఆర్‌ బాటలో పయనిస్తానని, తమిళనాడు రాజకీయాల్లో ఆయన లేని లోటును తాను మాత్రమే భర్తీ చేయగలనని చాలా ఆవేశంగానే పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయాయి. అయితే ఆ తరువాత రాజకీయపరంగా వార్తల్లో ఉన్నారు గానీ ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. దీంతో రజనీ రాజకీయం అన్నది మాటల్లోనే కానీ, చేతల్లో కార్యరూపం దాల్చదు అనే ప్రచారాన్ని ఆయన ప్రతి కూల వర్గం గొంతెత్తి మరీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇటీవల కమలహాసన్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్‌ మరోసారి రాజకీయంగా కాక పుట్టించే వ్యాఖ్యలు చేశారు. కమలహాసన్‌ తన చిరకాల మిత్రుడని, అవసరం అయితే ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేస్తానని పేర్కొన్నారు, అంతే కాదు 2020లో అద్భుతాన్ని చూస్తారని పేర్కొన్నారు..దీంతో కమలహాసన్, రజనీకాంత్‌ కలిసి రానున్న  శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు నిజం గానే వీరిద్దరూ కలుస్తారా? అలా కలిసి పోటీ చేసినా గెలవగలరా? ఒక వేళ గెలిస్తే సీఎం గద్దెనెక్కేది ఎవరూ? లాంటి రకరకాల ప్రశ్నలతో కూడిన  వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా తాజాగా రజనీకాంత్‌ తన రాజకీయ ప్రస్థావనను తీసుకొచ్చారు.

అమితాబ్‌ సూచనను పాటించలేకపోతున్నా
రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం దర్బార్‌. దీంతో సోమవారం దర్బార్‌ చిత్ర యూనిట్‌ ముంబైలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ హిందీ చిత్రసీమలో సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ రాజకీయాలోక్కి రావద్దని తనకు  చెప్పారన్నారు. అయితే ఆయన సూచనను తాను పాఠించలేకపోతున్నానని అన్నారు. దీంతో ఆయన రాజకీయరంగ ప్రవేశం నిశ్చయం అని చెప్పకనే చెప్పారు. దీంతో రజనీకాంత్‌ అభిమానులిప్పుడు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. నిజానికి రజనీకాంత్‌ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారో, అప్పటి నుంచే అందుకు కార్యాచరణను మొదలెట్టారు. తన అభిమాన సంఘాలను రజనీప్రజా సంఘాలుగా మార్చి వారిలో కొందరికి కార్య నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టేశారు. వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు కార్యోన్ముఖులయ్యారు. అలా రజనీకాంత్‌ టార్గెట్‌ కోటి మందిని సభ్యులుగా నమోదు చేసినట్లు సమాచారం. కాగా రజనీకాంత్‌ 2020 జనవరిలోనే రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని, ఆయన ప్రజా సంఘ నిర్వాహకులు దృఢంగా చెబుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top