వాలెంటైన్స్‌ డే హిస్టరీ..

History Behind Valentines Day - Sakshi

ప్రేమికులు, కొత్తగా ప్రేమలో పడ్డవారు మనసు నిండా కళ్లు చేసుకుని ఎదురుచూసే రోజు ‘ వాలెంటైన్స్‌ డే’ . ఫిబ్రవరి 14 రాగానే తమ ప్రియమైన వారిని బహుమతులతో సరఫ్రైజ్‌ చేసే వారు కొందరైతే.. ప్రేమికుల రోజునైనా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేయాలనుకునే వారు మరికొందరు. కానీ, చాలా మందికి ఆ రోజు అంత ప్రముఖ్యత ఎందుకు సంతరించుకుందో తెలియదు. వాలెంటైన్స్‌ డే ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించరు. అయితే వాలెంటైన్స్‌ డే ఆవిర్భావం గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికి కొన్ని కథలు మాత్రమే ప్రాచూర్యం పొందాయి.

ప్రేమను గెలిపించి.. మరణానికి తలొగ్గి..
పూర్వం... క్లాడియస్ రాజు రోమ్‌ను పరిపాలిస్తున్న కాలంలో... సైనికులు  పెళ్లిళ్లు చేసుకోకూడదనే నియమం ఉండేది. కానీ పాపం సైనికులూ మనుషులే కదా! వారి బాధను అర్థం చేసుకున్న వాలెంటైన్ అనే సెయింట్... సైనికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేస్తుండేవాడు. అది రాజుకు తెలిసిపోయింది. వాలెంటైన్‌ను జైల్లో బంధించాడు. మరణ దండన విధించాడు. ఆ దండనను ఆమలు చేసే రోజు వచ్చింది. చనిపోయే ముందు ఈ  ప్రపంచానికి తన చివరి సందేశాన్ని వినిపించాలనుకున్నాడు వాలెంటైన్. ఎలా ఆ పని చేయాలా అని ఆలోచిస్తుంటే  రాలిపడిన రావిచెట్టు ఆకులు కనిపించాయి. వాటి మీద... ‘నేను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపాలని వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. ప్రతి మనిషికీ ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే జీవితమే ఉండదు. ప్రేమను బ్రతికించండి. ఇదే  నా చివరి సందేశం’ అని బొగ్గుముక్కతో రాసి, తన గది కిటికీలోంచి వాటిని బయటకు విసిరేశాడు.

ఆ తర్వాత మరణ దండనకు తలవంచాడు. అయితే వాలెంటైన్‌కు తెలియదు... తాను ఇచ్చిన ఆ సందేశం ఈ ప్రపంచం మొత్తాన్నీ తనకు అభిమానులుగా మార్చేస్తుందని. తాను మరణించిన రోజు వాలెంటైన్స్‌డేగా ప్రేమికులకు అంకితం అవుతుందని. వాలెంటైన్ తన చివరి సందేశాన్ని రాసిన రావి ఆకును అతని హృదయంగా భావించి, దాని ఆకారాన్ని హృదయా కారంగా, ప్రేమకు గుర్తుగా స్థిరపరిచారని ఓ కథనం.

దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు..
పూర్వం గ్రీకు దేశాన్ని పాలిస్తున్న క్లాడియస్‌ 2 తాను నమ్మే పన్నెండు దేవతలను మాత్రమే పూజించాలని రోమన్లందరినీ ఆజ్ఞాపిస్తాడు. క్రిస్టియన్లతో ఎవరైనా సన్నిహితంగా మెదిలారని తెలిస్తే మరణశిక్ష ఖాయమని హెచ్చరిస్తాడు. కానీ, వాలెంటినస్‌ అనే సాధువు చక్రవర్తి మాటను చెవికెక్కించుకోడు. తన జీవితాన్ని క్రిస్తుకే అంకితం చేస్తాడు. దాంతో కన్నెర్ర చేసిన క్లాడియస్‌ వాలెంటినస్‌ను జైల్లో పెట్టి మరణ శిక్ష విధిస్తాడు. ఆయనకు జూలియా అనే కూతురు ఉంటుంది. ఆమె పుట్టుకతో అంధురాలు. వాలెంటినస్‌ తన కూతరుకి అన్నీ నేర్పిస్తాడు. తనకళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వారం రోజుల్లో ఆ సాధువుకు మరణశిక్ష అమలవుతుండగా జైలర్‌ అయన్ని అడుగుతాడు..‘ నీ కూతుర్ని చూడాలనుకుంటున్నావా? అని. ఆమెను పిలిపిస్తాడు. జైల్లోంచే తన కూతురికి జీవన సత్యాలు బోధిస్తుంటాడు.

సెయింట్‌ వాలెంటైన్‌ రాసినట్లుగా చెప్పబడుతున్న 1477 నాటి సందేశం

ఆ జ్ఞానంతో జూలియాకు చూపు వస్తుంది. చివరకు తాను చనిపోయే ముందు రోజు జూలియాకు ఓ ఉత్తరం రాస్తాడు.. ‘దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. ఫ్రమ్‌ యువర్‌ వాలెంటైన్‌’ అని! ఆ తర్వాత రోజు అంటే క్రీ.శ 270, ఫిబ్రవరి 14న వాలెంటినస్‌కు మరణ శిక్ష అమలవుతుంది. తన తండ్రిని సమాధి చేసిన చోట గులాబిరంగులో పూత పూసే బాదం మొక్క నాటుతుంది. ఆ మొక్క తర్వాత కాలంలో వృక్షమై ప్రేమ,స్నేహానికి చిహ్నంగా నిలిచిందని అంటారు. ఆ ప్రేమను స్నేహాన్ని ప్రపంచానికి చాటడానికే ప్రతి ఫిబ్రవరి 14న వాలెంటినస్‌ పేరుమీద ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్‌ డేని జరుపుకోవటం మొదలుపెట్టారనే మరో కథనం.

వాలెంటైన్స్‌ గుర్తుగా.. 
ప్రాచీన రోమన్లు ఫిబ్రవరి నెలలో ‘‘లూపెర్కాలియా’’ అనే పండుగను జరుపుకునేవారు. ఈ పండుగ వేడుకల్లో భాగంగా అబ్బాయిలు.. అమ్మాయిల పేర్లను చీటీలో రాసి డబ్బాలో వేసేవారు. ఆ తర్వాత ఒక్కో అబ్బాయి ఒక్కో చీటీని తీసేవాడు. అలా ఆ చీటీలో పేరు వచ్చిన అమ్మాయికి అతడు బాయ్‌ఫ్రెండ్‌ అవుతాడు. ఇదంతా ఆ పండుగ వరకు మాత్రమే. కానీ, కొన్ని సందర్భాలో ఆ జంట పెళ్లిళ్లు కూడా చేసుకునేది. ఆ తర్వాత కొన్ని చర్చీలు దీన్ని క్రిస్టియన్‌ వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ఆ రోజు సెయింట్‌ వాలెంటైన్‌ను గుర్తు చేసుకునేలా కూడా ఉండాలని భావించాయి. అలా 496వ సంవత్సరంలో మొదటి వాలెంటైన్స్‌ డే జరిగింది. తదనంతరం ప్రజలు తమ ప్రేమను వ్యక్తపరచటానికి సెయింట్‌ వాలెంటైన్స్‌ డేను ఎంచుకోవంటం ప్రారంభించారు. 

ఎనిమిది రోజుల ప్రేమ పండుగ 
వాలెంటైన్స్‌ డేకు ఏడు రోజుల ముందునుంచే ప్రేమ పండుగ మొదలవుతుంది. ఫిబ్రవరి 7నుంచి ఫిబ్రవరి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సందడి ఉంటుంది. ఈ వారంలోని ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు సైతం ఒక్కోరోజు ఒక్కోవిధంగా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తారు.
1) ఫిబ్రవరి 7 : రోజ్‌ డే 
2) ఫిబ్రవరి 8 :  ప్రపోజ్‌ డే
3) ఫిబ్రవరి 9 : చాక్లెట్‌ డే
4) ఫిబ్రవరి 10 :  టెడ్డీ డే
5) ఫిబ్రవరి 11 : ప్రామిస్‌ డే
6) ఫిబ్రవరి 12 : హగ్‌ డే
7) ఫిబ్రవరి 13 : కిస్‌డే
8) ఫిబ్రవరి 14 : వాలెంటైన్స్‌ డే 


Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top