రింగ్‌ రింగా..!

రూ.17 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు

ఒక టెండర్‌..నలుగురు పోటీ

పదే పదే గడువు పొడిగిస్తున్న ఆర్‌అండ్‌బీ

ఒక్కరే పోటీలో ఉండేలా రింగుకు ప్లాన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార పార్టీ నేతల్లో టెండర్ల రగడ నడుస్తోంది. ఫలానా పని తామే చేయాలంటూ పోటీ పడుతున్నారు. కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి సఫా కాలేజీ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలతో పాటు మిత్రపక్ష బీజేపీ నేత మధ్య పోటీ మొదలయ్యింది. వీరిని రింగు చేసి ఒక్కరికే అప్పగించేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. అయితే, ససేమిరా అంటుండటంతో రింగు అయ్యే వరకూ ఏకంగా టెండర్ల గడువును పదే పదే పొడిగిస్తున్నారు.

ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. ఈ నేతల మధ్య రింగు చేసేందుకు రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఒక అధికారే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఒక్కరే పోటీలో ఉండి అధిక ధరకు టెండర్‌ దక్కించుకునేందుకు పథక రచన చేస్తున్నట్టు సమాచారం. గతంలో జాతీయ రహదారి–40గా ఉన్న సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ (350/5 నుంచి 356/5 కిలోమీటర్లు) రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.17 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. గత నెల 4న పిలిచిన టెండర్ల గడువు 24వ తేదీన ముగియాల్సి ఉంది. అయితే, ఒకసారి జనవరి 31 వరకు, తాజాగా ఫిబ్రవరి 15వ తేదీ వరకూ పొడిగించారు.

నలుగురూ నలుగురే!
ఈ రోడ్డు పనులు అటు పాణ్యం, ఇటు కర్నూలు నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన అధికారపార్టీ నేతల మధ్య పోటీ మొదలయ్యింది. దీంతో పాటు రోడ్లు, భవనాల శాఖ పనులన్నింటినీ చేపడుతున్న మరో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా పోటీకి దిగడంతో నాలుగు స్తంభాలాట మొదలయ్యింది. అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి తన సంస్థ ద్వారా టెండర్‌లో పాల్గొంటానంటుండగా.... అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రింగుగా మారి వారి సంస్థ తరఫున పోటీ పడాలనుకుంటున్నారు. ఇక మిత్రపక్షానికి చెందిన నేత కూడా బరిలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి మాట వినాలో అధికారులకు అర్థం కావడం లేదు. దీంతో పదే పదే టెండర్‌ గడువును పొడిగిస్తున్నట్టు తెలుస్తోంది. 

రింగు చేసేందుకు రంగంలోకి..
నలుగురు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్వయంగా ఒక అధికారి రంగంలోకి దిగినట్టు సమాచారం. టెండర్‌ ధర కంటే 5 శాతం అధిక ధరకు పనులు దక్కించుకుని.. పర్సెంటేజీలు పంచుకునేలా ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. పనులను మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలు రింగుగా ఏర్పడిన సంస్థకే కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఏకాభిప్రాయం వచ్చి..పర్సెంటేజీల వ్యవహారం తేలిన తర్వాతే టెండర్‌ తెరిచే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top