ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు  | mim president asaduddin owaisi fires on central government | Sakshi
Sakshi News home page

ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు 

Jan 20 2018 12:28 PM | Updated on Aug 20 2018 9:18 PM

mim president asaduddin owaisi fires on central government - Sakshi

సాక్షి, కర్నూలు: దేశ స్వాతంత్య్రం కోసం మొదటి రక్తబిందువు చిందించింది ముస్లింలేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఈ ప్రభుత్వం పార్లమెంటులో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు పాస్‌ చేయడం మరో డిసెంబరు 6ను తలపింపజేసిందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి కర్నూలులోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ‘షరియత్‌’ (మహమ్మద్‌ ప్రవక్త సూచించిన అంశాల)ను తుడిచి వేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 

షరియత్‌ను కాపాడుకునేందుకు ముస్లింలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఏర్పడిందని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు న్యాయం చేస్తామనే సాకుతో ఇస్లాంలోని ధార్మిక అంశాలను తుడిచిపెట్టాలనుకున్నారని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌పై బిల్లు తీసుకురావడం వల్ల నష్టపోయేది మహిళలేననేది మోదీ గుర్తించలేకపోయారని, మహిళలపై అంతగా సానుభూతి ఉంటే ట్రిపుల్‌ తలాక్‌కు గురైన వారికి రూ.15 వేల చొప్పున సాయం అందించాలని హితవు పలికారు. షరియత్‌ గురించి నోరు విప్పే వారిని సైతం ఈ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. అసలు ఇస్లాం ధార్మిక విషయాలపై ఈ ప్రభుత్వానికి గురి ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే మోదీకి.. ఆస్తిలో కూతురికి హక్కు కల్పించేది ఇస్లాం ధర్మమేననేది తెలియదన్నారు. 

వచ్చే నెల 9,10,11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ఏఐఎంపీఎల్‌బీ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ జామియా దరుల్‌ ఉలూంకు చెందిన మౌలానా రహీముద్దీన్, మజ్లిస్‌ ఉలమె దక్కన్‌ మౌలానా కుబూల్‌ పాషా షితరి సాహెబ్, జమాతె ఇస్లామి మౌలానా హామిద్‌ మహమ్మద్‌ ఖాన్, జమియత్‌ అహ్లె హదీస్‌ మౌలానా షఫి అహ్మద్‌ మదాని, జమియత్‌ ఉలమె హింద్‌ ముఫ్తి గియాజుద్దిన్‌ రహ్మాని, అమారతె షరియా మౌలానా జఫర్‌ పాషా,  వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బి.ఎ.కె. పర్వేజ్, ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్‌ ప్రసంగించారు. 

ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు జిల్లా అధ్యక్షుడు జాకిర్‌అహ్మద్‌ రషాది, సభ్యులు అబ్దుల్‌మాజిద్, అబ్దుస్‌సలాం, అబ్దుల్‌ఖదీర్, ఉమర్‌నాజిమ్, సులేమాన్‌నద్వి, ముఫ్తి అబ్దుర్రహ్మాన్, మౌలానా షావలీవుల్లా, ప్రభుత్వ ఖాజీ సలీంబాష ఖాద్రి, అహ్లెహదీస్‌ తరపున హాఫిజ్‌ మంజూర్‌ అహ్మద్, అహ్లె సున్నత్‌జమాత్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ ఇస్మాయిల్‌పీర్‌ ఖాద్రి, సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రితో పాటు జమాతే ఇస్లామీ హింద్‌ నగర అధ్యక్షుడు ఎస్‌.ఎ.అమీర్, గోదాముల అధినేత తాటిపాడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement