కట్టుకున్నోడిని కడతేర్చిం‍ది

Wife killed husband in Khammam district - Sakshi

అతడు ముఠా కూలీ, ఆమె కూరగాయల వ్యాపారి. వారికిద్దరు కూతుళ్లు. భార్యాభర్త మధ్య నిత్యం గొడవలు. ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నదన్నది అతడి అనుమానం. తాగొచ్చి, అనుమానిస్తూ, హింసిస్తున్నాడన్నది ఆమె కోపం. గొడవలు.. అనుమానం.. కోపం.. ఇవన్నీ కలిసి అతడి నిండు ప్రాణాలను బలిగొన్నాయి.. ఆమెను హంతకురాలిగా మిగిల్చాయి... వారిద్దరి కూతుళ్లను అనాథలుగా మార్చేశాయి.

కారేపల్లి:
ఓ ఇల్లాలు.. తన భర్తను గొంతు నులిమి చంపేసింది. కారేపల్లి మండలంలోని సామ్యతండా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఇది జరిగింది. ఆ దంపతుల కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు... సామ్యతండాకు చెందిన బాణోతు శ్రీను(35) నిరుపేద కూలీ. అప్పుడప్పుడు రైల్వే కాం ట్రాక్ట్‌ పనులకు ముఠా కూలీగా గోవా, నాం దేడ్, విజయవాడ వెళుతుండేవాడు. ఆయన భార్య లక్ష్మి, ఇల్లందు మెయిన్‌ రోడ్డులో కూరగాయలు అమ్ముతోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు పూజిత, శ్రీకావ్య. కారేపల్లి హైస్కూల్‌లో 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్నారు. లక్ష్మి ప్రవర్తనను శ్రీను గత కొన్నేళ్లుగా అనుమానిస్తున్నాడు. అప్పుడప్పుడు మద్యం తాగొచ్చి ఆమెతో గొడవ పడుతుండేవాడు. మంగళవారం రాత్రి కూడా వీరి మధ్య ఇంట్లో స్వల్ప వాగ్వాదం జరిగింది.

బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయం. శ్రీను గాఢ నిద్రలో ఉన్నాడు. భార్య లక్ష్మి మేల్కొని ఉంది. ఆమె తన జాకెట్‌ వస్త్రంతో అతడి మెడకు ఉరి బిగించి, గట్టిగా లాగింది. అతడు గింజుకున్నాడేమో.. మెడకు గాయాలయ్యాయి. అతడి ప్రాణాలు పోయాయి. గురువారం తెల్లవారుజామున 4.00 గంటల సమయం. పెద్ద కుమార్తె పూజిత, బహిర్భూ మికని నిద్ర లేచింది. అప్పటికే తల్లి మేల్కొని ఉంది. కూతురితో.. ‘మీ నాన్న చచ్చిపోయా డు’ అని చెప్పి, ఆ వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పూజిత బిగ్గరగా ఏడుస్తూ, అదే గ్రామంలో ఉంటున్న పిన్ని (బాబాయి భార్య) ఉషకు ఫోన్‌ చేసి చెప్పింది. ఉష కుటుంబీకులతోపాటు అదే గ్రామంలోగల సమీప బం ధువులు, చుట్టుపక్కల వారు వచ్చారు. శ్రీను మృతదేహాన్ని చూసి రోదించారు. కారేపల్లి సీఐ సాంబరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిరణ్‌కుమార్, సిబ్బంది వచ్చారు. శ్రీను తండ్రి బాణోతు దస్రు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో లొంగుబాటు..!
భర్తను హత్య చేసిన లక్ష్మి, నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయింది(ట). విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం, పోలీసులతో ఆమె ఇలా చెప్పింది.. ‘‘తరచుగా మద్యం తాగొచ్చి వేధించేవాడు. అనుమానిస్తూ కొట్టే వాడు. విసిగిపోయాను. నేనే చంపాను’’.

మరొకరు సహకరించారా..?!
‘‘శ్రీనును ఆమె ఒక్కతే చంపలేదు. మరొకరు సహకరించారు’’ అని, అతడి (హతుడి) కు టుంబీకులు కొందరు ఆరోపించారు. వారు ఏమన్నారంటే... ‘‘ఆమెకు వేరెవరితోనో వివాహేతర సంబంధం ఉంది. అందుకే గొడవ లవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీను మ ద్యానికి బానిసగా మారాడు. మద్యం–నిద్ర మత్తులో ఉన్న శ్రీనును లక్ష్మి, మరింకెవరో కలిసి చంపి ఉంటారు. గొంతుకు గాయాలయ్యాయంటే.. జాకెట్‌ముక్కతో ఎంత బలం గా లాగి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క తే చంపిందంటే నమ్మడం కష్టం. కచ్చితంగా ఇంకొకరు ఉన్నారు. ఆ ఇంకొకరు ఎవరన్నది తేలాలి’’.

అనాథలుగా పిల్లలు...
‘‘తండ్రి ప్రాణాలు పోయాయి. తల్లి జైలుకు వెళుతుంది. వారిద్దరి కూతుళ్ల భవిష్యత్తు ఏమిటి..? వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారు..? కేసు నమోదై, జైలుకు వెళితే.. ఆమె తిరిగొచ్చేంత వరకు ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగలాల్సిందేనా..? ఆ దంపతుల ‘పాపం’.. పిల్లలిద్దరికీ శాపంగా మారిందా..? ’’ పిల్లలిద్దరిదీ అంతులేని రోదన. అందరిలోనూ ఇదే వేదన.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top