మెతుకు పడేస్తే మూడినట్లే.. | karnataka govt take new decision on food wastage | Sakshi
Sakshi News home page

మెతుకు పడేస్తే మూడినట్లే..

Dec 14 2017 3:46 AM | Updated on Oct 5 2018 6:36 PM

karnataka govt take new decision on food wastage - Sakshi

సాక్షి, బెంగళూరు : ఒక్క పూట భోజనం దొరక్క అల్లాడిపోయే నిరుపేదలు ఒక వైపు.. పెళ్లిళ్లు, విందులు, సంబరాల పేరిట ఆహారాన్ని కుప్పతొట్టిపాలు చేస్తున్న వారు మరో వైపు. రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన పంట అన్నార్తులకు చేరకుండానే చెత్తబుట్టల్లోకి చేరిపోతోంది. ఈ విధంగా ఆహారం వ్యర్థమవుతుండడాన్ని నిరోధించేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు పూనుకుంది. ఇది అమల్లోకి వస్తే ఆహారాన్ని వ్యర్థం చేసిన వారికి గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా తప్పదు.

కళ్లుతిరిగే వృథా
దేశ ఐటీ సిటీలో పెళ్లిళ్లు, విందులు, ఇతర కార్యక్రమాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో కలుపుకుని భారీగా ఆహారం వృథా అవుతోంది. ఇలా ఏడాదికి వ్యర్థమవుతున్న ఆహారంతో 2.6 కోట్ల మంది ఒక పూట భోజనం చేయవచ్చు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో ఏటా 943 టన్నుల ఆహారం చెత్తకుప్పలో చేరుతోందని తేలింది. దీంతో ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు ఏ ప్రాంతంలోనైనా సరే ఆహారాన్ని వృథా చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి యూటీ ఖాదర్‌ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర న్యాయశాఖ ‘కర్ణాటక ఆహార వ్యర్థ నియంత్రణ, వినిమయ చట్టం’ పేరిట ముసాయిదా బిల్లును రూపొందిస్తోంది. కళ్యాణ మండపాలు, హోటళ్లు, సంస్థలు, సమూహాలు ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి.

కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ
ముసాయిదాను చట్టంగా చేసిన తర్వాత దీన్ని అమలు చేసేందుకుగాను ప్రతి జిల్లాలో కలెక్టర్‌ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటవుతుంది. ఇందులో ఆహార, పౌర సరఫరాలశాఖ అధికారితో పాటు జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. వీరు ఇతరుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు తామే సుమోటోగా తీసుకొని కూడా కేసులు నమోదు చేస్తారు. విచారణ కోసం జిల్లాకు ఒక కోర్టును ఏర్పాటు చేస్తారు. ఆహారాన్ని వృథా చేసినట్లు విచారణలో రుజువైతే సంబంధిత రెస్టారెంట్‌ల యజమానులు, కళ్యాణ మండపాల నిర్వాహకులతో పాటు పెళ్లిళ్లు, విందులు నిర్వహించిన వారికి కూడా శిక్ష విధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement