భాషకు అతీతం సినిమా..!

Kommineni Srinivasa Rao Interviews Shekhar Kammula

కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రముఖ దర్శకుడు, నిర్మాత శేఖర్‌ కమ్ముల

సినిమా కళ భాషకు అతీతమైనదని.. జీవనవిధానం, నిర్దిష్ట ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం వంటి భిన్న కోణాలను వెతుక్కోవడమే సినిమా పని అని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడు శేఖర్‌ కమ్ముల పేర్కొన్నారు. దశాబ్దాలుగా మూస పద్ధతికి అలవాటు పడిన తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే కొత్తదనం వైపు అడుగులేస్తోందన్నారు. అమ్మాయిల పాత్రను మరీ తక్కువగా చేసి చూపుతున్న సమయంలో, వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్న నేపథ్యంలో.. కొంచెం అభిరుచి, ఆత్మగౌరవం ఉన్న హీరోయిన్ని పెట్టి తీయడం మహిళా పక్షపాతం కాదని అన్నారు.  సినిమా కథకు ఎప్పటికైనా కంటెంటే ప్రధానమని, విషయం లేకుండా ఎన్ని మెరుపులు, రంగులద్దినా సినిమాను జనం చూడరనీ అంటున్న శేఖర్‌ కమ్ముల అభిప్రాయాలు ఆయన మాటల్లోనే

ఒక మాండలికంతో ఫిదా సినిమాను సక్సెస్‌ చేశారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?
సాధారణంగా కుటుంబ కథా చిత్రాలు అంటే మనందరి మనస్సుల్లో మూసపద్ధతే ఉంటుంది. పల్లెటూరు అంటే కోనసీమే మెదులుతుంది. దశాబ్దాలుగా మన ఆలోచన అలాగే సాగింది. ఫిదా సినిమాకు అమెరికా అబ్బాయి, తెలుగు అమ్మాయితో కథ అని, తెలంగాణ మాండలికంలో రాయాలని అనుకున్నాను. అక్కడి జీవన విధానం, ఆ మాండలికంతో పూర్తిగా తెలంగాణ సినిమాగా చేయాలనుకున్నాను. తెలంగాణ అంటే పోరాటాలు, ఉద్యమాలే గుర్తుకొస్తుంటాయి. అందుకే తెలంగాణ కుటుంబం నేపథ్యంలో ఎందుకు కథ రాయకూడదు అనిపించింది. అదే ఫిదా సినిమా.

తెలంగాణ  సరే.. ఆంధ్రాలో, రాయలసీమలో ఆ సినిమాను ఎలా స్వీకరించారు?
అద్భుతంగా ఆదరించారు. సినిమా నిర్మాణంలో నా ఆలోచనలు భాషకు అతీ తంగా ఉంటాయి. సినిమా భాషకు అతీతంగానే జనాలను కదిలిస్తుంది. అప్పుడే అది సూపర్‌ హిట్‌ అవుతుంది. జనాలను కదిలింపజేయడం ఎలా అనేదే మన ప్రయత్నం.

సినిమాల్లో ప్రామాణిక భాష అని ఉంటుందా?
ఉండకూడదు. కథను ఒక ప్రాంతానికి సంబంధించి చెబితే దానికి కట్టుబడి సినిమా తీయడమే సరైంది. తెలంగాణ భాషలో పూర్తి సినిమా అన్న గుర్తింపు ఫిదాతో మొదలు కావడం మంచి పరిణామం. తెలంగాణలో కూడా ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్లి అక్కడి జీవితాన్ని ప్రతి బింబిస్తే అది ఒక కొత్త కోణం. అలాంటి భిన్న కోణాలను వెతుక్కోవడమే సినిమా పని. కొన్ని దశాబ్దాలుగా అలా వెతుక్కోకపోవడమే మన తప్పు. అలా ఇప్పుడు శ్రీకాకుళాన్ని వెతుక్కోవచ్చు. రాయలసీమనూ వెతుక్కోవచ్చు. ప్రాంతీయ యాస, సంస్కృతిని చూపగలగడం తెలుగు సినిమాకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది.

మీ కథలో హీరోయిన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా? మీరు మహిళా పక్షపాతా?
అమ్మాయిల పాత్రను మరీ తక్కువ చేసి చూపుతున్న సమయంలో, వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్న నేపథ్యంలో.. కొంచెం అభిరుచి ఉన్న హీరోయిన్ని ఆనంద్‌ సినిమాలో చూపేసరికి మహిళా పక్షపాతిని అని ముద్రవేశారు. తర్వాత కూడా అదే కొనసాగింది. ఇక ఫిదా అయితే దానికి ఒక ఆత్మ ఉంది. పురా ణాల్లో, జానపద గాథల్లో, చందమామ కథల్లో అయినా సరే.. రాజకుమారుడు కోటలోకి వచ్చి అమ్మాయిని తీసుకెళతాడే గానీ ఆ కోటలోనే ఉండిపోడు కదా! ఆ ప్రశ్నకు సమాధానమే ఫిదా.

ఆనంద్‌లో హీరోయిన్‌ అత్తమీద తిరగబడే కోడలు. ఆ ఆలోచన ఎలా వచ్చింది?
ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రలను తీసుకోవడం అంటే అవేమీ పెద్ద గొప్ప విషయాలు కాదు. నేను చేసింది గొప్ప పని అనుకోను. కానీ వేరే వాళ్లెవరూ ఆ మాత్రమైనా చేయలేదు. ఫిదాలో కొంచెం మలుపు తిప్పి ఆ అంశాన్నే తీసుకొచ్చాను.

సినిమాను వినోదంగా చూస్తారా లేక సందేశంగా చూస్తారా?
సందేశంగానే చూస్తాను. అలాగని నా సినిమాను చూసి జనం స్ఫూర్తి పొందుతారను కోను.. శ్యాంబెనగల్‌ వంటి వారితో నన్ను నేను పోల్చుకోలేను. నేను సినిమాకు చక్కెర పూత పూస్తాను. ఫిదా సినిమాకు డబ్బులొచ్చేశాయి. భయంకరంగా హిట్ట యింది. వచ్చిండే వంటి పాటలు రిపీట్‌గా చూస్తున్నారు. కానీ సినిమాలో నేను చూపించిన పాయింట్‌ని పట్టుకున్నారా లేదా అనేదే నా ఆకాంక్ష. అబ్బాయి అమెరికా నుంచి రావడం. అమ్మాయి చాయిస్‌ను గుర్తించడం, అమ్మాయి వెంటబడి వేధించి, ప్రేమించే నేపథ్యంలో ఒక అమ్మాయి చాయిస్‌ని అతడు గౌరవించడం, ఆ చాయిస్‌ ఆమె హక్కు అనడం. నా చాయిస్‌ నువ్వు కాదు అని వ్యతిరేకిస్తేనే యాసిడ్‌ దాడులు జరుపుతున్న నేపథ్యానికి భిన్నంగా అలాంటి అంశాలు చాలా చెప్పాను ఫిదాలో.

సినిమాలో హీరో పదిమందిని చావగొట్టడం ఎలా సాధ్యం?
మన సినిమా తొలినుంచి ఇలానే వచ్చింది. మన వాళ్లకు హీరోను ఆరాధించడం ఎక్కువ. తాము జీవితంలో తీర్చుకోలేని ఎన్నో కోరికలను, ఆశలను హీరోలో చూస్తుంటారు. హీరో అలాంటివి చేస్తే పొంగిపోతారు. కాని 20 ఏళ్లకు ముందు, ఇప్పుడు సినిమా తీయడంలో మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా వస్తుంది.

పూర్వపు దర్శకుల చిత్రాలతో ఇప్పటి సినిమాలను చూస్తే మీ అనుభూతి ఏమిటి?
నా వరకు అయితే కథా విషయమే కింగ్‌ అని నేను నమ్ముతాను. సినిమాకు ఎంత గ్రాఫిక్స్, ఎన్ని రంగులు అద్దినా విషయం ఉంటేనే ఆడుతుందని నా నమ్మకం. పాత రోజుల్లో ఏమీ లేకపోయినా చాలాగొప్ప సినిమాలు తీశారు. కారణం బలమైన కథావిషయాన్ని ఎంచుకోవడమే. ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శకులు తీసిన సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి సినిమాలు మళ్లీ రాలేదు. ఇప్పుడు తీసినా చూస్తారనుకోను.

డ్రగ్స్‌ వ్యవహారంతో టాలీవుడ్‌ ఎందుకు విమర్శలకు గురవుతోంది?
సినిమా పరిశ్రమే అనే కాదు. మాదకద్రవ్యాల వ్యవహారం ఎక్కడైనా నష్టదాయకమే. ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుని దాన్ని అరికట్టాలి. సినిమావాళ్లా, బయటివాళ్లా, కాలేజీ విద్యార్థులా అని కాదు. ప్రభుత్వం ఏం చేసైనా సరే దానికి వ్యతిరేకంగా ఫలితం తీసుకురావాలి.

సినిమా జీవితం మీకు ఎలాంటి అనుభవాన్ని, సంతృప్తిని ఇచ్చింది?
చాలా హ్యాపీగా ఉన్నాను. రాజీ పడకుండా సినిమాలు తీయగలగడం, సాధారణ కుటుంబ నేపథ్యం కలిగి ఉండి, ఎక్కువ డబ్బులు లేకుండా ఇన్ని సంవత్సరాలు సినిమా తీయగలగడం, వ్యక్తిగతంగా నాకు పెద్దగా ఎదురు దెబ్బలు తగలకపోవడం, దీంతో అదే నిబద్ధతతో సినిమా తీయగలుగుతున్నాను. నిజంగా ఇది నా అదృష్టమే.

వెండితెర వెనుక మహిళల పట్ల ఘోరంగా ప్రవర్తిస్తుంటారని అంటుంటారు. నిజమా?
నిర్భయ ఉదంతం చూసింతర్వాత దేశంలో మహిళలకు ఎక్కడ గౌరవం ఉందనుకోవాలి? ఆ ఘటన స్త్రీల పట్ల వేధింపులకు పరాకాష్ట. అందుకే మహిళల వ్యక్తిత్వాన్ని ఎత్తిచూపే ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి సినిమాలు మరిన్ని రావాలి.

వర్తమాన సమాజంలో మీకు ఎవరు ఆదర్శం?
నిక్కచ్చిగా చెప్పాలంటే మన పిల్లలకు వెతుక్కుని చూపెట్టాల్సినంత ఆదర్శవం తులు ఎవరూ లేరు.  ప్రపంచంలోనే లేరు. మన దేశంలో మరీ ఘోరం. పలానా వారిని చూసి మీరు నేర్చుకోవాలి అని మనపిల్లలకు చూపడానికి తగిన ఆదర్శవం తులు లేరు. నా వరకు ఆదర్శవంతుడు మా నాన్నే. ఆయన నిజాయితీగా తన ఉద్యోగం చేసుకుంటూ, మమ్మల్ని నీతిగా పెంచాడు. ఆయనలాగా నా పిల్లలను నేను పెంచగలను అని కూడా నేను ఇప్పుడు అనుకోలేను. నా జీవితంలో ఎవరయినా హీరో రావాలి, చూసి నేను చప్పట్లు కొట్టాలి అని చూస్తున్నా కాని ఎవరూ తగల్లేదు.

మీ జీవితంలో బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏది?
డాలర్‌ డ్రీమ్స్‌ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో ఎంతో సంతోషం కలిగింది. చిన్న సినిమా, ఒకే ప్రింటు. వందలసార్లు ఆడించి అరిగిపోయిన ప్రింట్‌నే జ్యూరీకి పంపాం. అవార్డు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. బహుశా విధి అనుకుంటాను.

సమాజానికి, ప్రత్యేకించి యువతకి మీరిచ్చే సందేశం?
కొంచెం ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని చెబుతాను. మూస పద్ధతిలో ఉండొద్దు. ఫిదా సినిమాలో భానుమతి అంటుంది కదా.. బ్రాయిలర్‌ కోడి అని. మన ఆసక్తి, ఆలోచనా విధానం కొంచెం భిన్నంగా ఉన్నా, భయపడకుండా అటువైపే వెళ్లాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాస్త ఓపెన్‌గా, విశాల దృష్టితో చూడాలంటాను.
(శేఖర్‌ కమ్ములతో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకుల్లో చూడండి)

/

Read latest Interview News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top