అల్ప సంతోషం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: జిన్‌పింగ్‌

Xi Jinping Says Dont Be Complacent Amid China Lowers Covid 19 Risk - Sakshi

బీజింగ్‌: దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తూనే ఉందని.. కాబట్టి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ చర్యల సెంట్రల్‌ గైడింగ్‌ గ్రూపు సమావేశంలో గురువారం జిన్‌పింగ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘‍కరోనా సంక్షోభం నేపథ్యంలో బాహ్య ప్రపంచం నుంచి ఎదురయ్యే ప్రతికూల సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలి. హుబేలో మహమ్మారి నియంత్రణ, నివారణ చర్యలు కొనసాగించాలి. జాగ్రత్త వహించాలి. అల్ప సంతోషం వద్దు’’ అని పేర్కొన్నారు. (నివురుగప్పిన నిప్పులా వుహాన్‌)

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్‌ నగరం సహా ఇతర కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన క్రమంలో జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వుహాన్‌లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల గురువారం నుంచి ఫ్యాక్టరీలను తెరిచారు. ఇక మే 7 నాటికి చైనాలో రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. కరోనా సోకిన ఆ ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారేనని పేర్కొంది. స్థానికంగా ఒక్క కేసు కూడా బయటపడలేదని తెలిపింది. మెత్తంగా దేశంలో మొత్తం ఇప్పటిదాకా 82,885 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా... కరోనా లక్షణాలు లేకున్నా బుధవారం నాటికి ఆరుగురు వ్యక్తులకు వైరస్‌ సోకినట్లు తేలిందని హుబే ఆరోగ్య కమిషన్‌ వెల్లడించడం గమనార్హం. (కరోనా కట్టడికి చైనా మరో కీలక నిర్ణయం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top