చేయగలిగిన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి...

University Of Basel Survey On Goals - Sakshi

అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని సాధించలేకపోయామని బాధపడేకంటే జీవితంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పర్చుకోవడమే చీకూ చింతాలేని, ఆరోగ్యకరమైన ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఆచరణయోగ్యమైన లక్ష్యాలను ఏర్పర్చుకున్న వారే ఆనందంగా ఉండగలుగుతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ బేసెల్‌ మానసిక శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. 

సంపద, ఆరోగ్యం, అర్థవంతమైన పని, కమ్యూనిటీ, జీవిత లక్ష్యాలు, ఆవ్యక్తిని నడిపించేవారిని బట్టి ఆ వ్యక్తి స్వభావం ఆధారపడి ఉంటుందని స్విట్జర్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బేసెల్‌ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చి చెప్పింది. 

ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? లేదా అనుకున్నవి సాధించలేనప్పుడు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలు వారు పెట్టుకున్న లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని జెర్మన్‌ భాష మాట్లాడే ప్రాంతాల్లోని 18 ఏళ్ళ నుంచి 92 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్న 973 మందిపై చేసిన ఈ సర్వే వివరాలను యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పర్సనాలిటీ లో ప్రచురించారు. అధ్యయనంలో పాల్గొన్న సగానికిపైగా మందిని రెండు, మూడేళ్ళ తరువాత కూడా మళ్ళీ సర్వే చేసారు. 

ఆరోగ్యం, కమ్యూనిటీ, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక సంబంధాలూ, సంపద, కీర్తి ప్రతిష్ట, కుటుంబమూ, భవిష్యత్‌ తరాల పట్ల బాధ్యత, అర్థవంతమైన పని తదితర పది అంశాలపై ఈ అధ్యయనం జరిపారు. ఒక వ్యక్తి ఏర్పర్చుకున్న సాధించగలిగే వ్యక్తిగత లక్ష్యాలు ఆ వ్యక్తి శ్రేయస్సుపైనా, భవిష్యత్‌ ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనుషులు దేనిమీదైనా నియంత్రణ కలిగి ఉన్నప్పుడు, దేన్నైనా సాధించినప్పుడు ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నట్టు, వాళ్ళు ఊహించిన దానికన్నా మంచి జీవితాన్ని అనుభవించినట్టు తేలింది. 

సామాజిక సంబంధాలకు సంబంధించిన లక్ష్యాలూ, ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు వారి వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవిత లక్ష్యాలూ, వ్యక్తి శ్రేయస్సూ వారి వారి వయస్సుని బట్టి ఆధారపడి ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆయా సందర్భాన్నీ, పరిస్థితిని బట్టీ ప్రజలు తాము సాధించాలనుకునే లక్ష్యాలు ఆధారపడి ఉంటాయి. యువతరం తమ వ్యక్తిగత అభివృద్ధీ, హోదా, ఉద్యోగం, సామాజిక సంబంధాలను ప్రథమ లక్ష్యాలుగా భావిస్తుంటే, వయోజనులు మాత్రం సామాజిక సంబంధాలూ, ఆరోగ్యం తమకు ప్రథమ ప్రాధాన్యత అని అభిప్రాయపడుతున్నారు. 

    
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top