అసంఘటిత రంగంపై కోవిడ్‌-19 ప్రకంపనలు

UN Report Says Million Workers In India May Sink Into Poverty Due To COVID-19 Crisis - Sakshi

ఐక్యరాజ్యసమితి : కరోనా మహమ్మారి విధ్వంసంతో భారత్‌లో​ని అసంఘటిత రంగంలో పనిచేసే 40 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని  ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కరోనావైరస్‌ మహమ్మారి అతిపెద్ద అంతర్జాతీయ సంక్షోభమని ఐఎల్‌ఓ-మానిటర్‌ రెండో ఎడిషన్‌ : కోవిడ్‌-19 పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపారాలు, కార్మికులపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ మహమ్మారి ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు మనం వేగంగా, నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలని పిలుపు ఇచ్చింది.

సరైన సమయంలో సరైన తక్షణ చర్యలు చేపడితేనే వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుకోగలుగుతామని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌ అన్నారు. ప్రపంచవ్యాపంగా 200 కోట్ల మంది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వీరంతా కోవిడ్‌-19 విసిరిన సవాళ్లతో ముప్పును ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌, నైజీరియా, బ్రెజిల్‌ సహా పలు దేశాల్లోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది సిబ్బంది, కార్మికులు లాక్‌డౌన్‌ ఇతర నియంత్రణలతో​ ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఐఎల్‌ఓ వెల్లడించింది.

చదవండి : మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్‌

భారత్‌లో అసంఘటిత రంగంలో పనిచేసే దాదాపు 40 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయే ముప్పు నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో చేపట్టిన లాక్‌డౌన్‌ చర్యలతో భారత్‌లో పెద్దసంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్ధలాలకు వెనుతిరిగారని పేర్కొంది. అంతర్జాతీయ సహకారానికి గడిచిన 75 ఏళ్లలో ఇదే అతిపెద్ద పరీక్షగా ముందుకొచ్చిందని, ఏ ఒక్క దేశం కుప్పకూలినా ఇతర దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. సరైన చర్యలతో కోవిడ్‌-19 పెను ప్రభావాన్ని పరిమితం చేయవచ్చని తెలిపింది. కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పనిగంటలు, రాబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top