పాకిస్థాన్ దళాలకు పూర్తి మద్దతిస్తాం ..!
తమ మాతృభూమిపై ఏ దేశం దాడికి దిగినా పాకిస్థాన్ దళాలకు తమ పూర్తి మద్దతునిస్తామని బజౌర్ ఏజెన్సీ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.
బజౌర్ః భారత్ తో పాటు ఇతర దేశాల దాడులను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ గిరిజనులు ప్రతిజ్ఞ చేశారు. మాతృభూమి రక్షణకు పనిచేసే దళాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పాకిస్థాన్ లోని ఇనాయత్ కాలేలో జరిగిన ఓ భారీ ర్యాలీ సందర్భంగా మమోన్డ్ తెగ ప్రజలు ఈ ప్రత్యేక ప్రకటన చేశారు.
పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కు చెందిన స్థానిక ఛాప్టర్ గిరిజన ప్రాంతాల్లో భారత్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది. పాక్ ఆర్మీకి అనుకూలంగా, భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీలో నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. ఇనాయత్ కాలీ బజార్ నుంచి కొనసాగిన కవాతులో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన అనేకమంది గిరిజనులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వానికి, పాకిస్థాన్ ను భయపెడుతూ ప్రకటనలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. తమ మాతృభూమిపై ఏ దేశం దాడికి దిగినా పాకిస్థాన్ దళాలకు తమ పూర్తి మద్దతునిస్తామని బజౌర్ ఏజెన్సీ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడి ప్రజలు నిజమైన దేశ భక్తులని, సొంత గడ్డకు అన్యాయం జరిగినా, శత్రువులు దాడి చేయాలని చూసినా చూస్తూ ఊరుకోరని, వారిని తిప్పి కొట్టేందుకు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమని ర్యాలీ సందర్భంగా బజౌర్ ఏజెన్సీ ప్రజలు వెల్లడించారు.
ఇప్పటికైనా పాకిస్థాన్ పై దూకుడుగా ప్రకటనలు చేయడం మానుకోవాలని, అలాగే ఎల్వోసీ వద్ద కాల్పుల నియంత్రణకు ప్రయత్నించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నియంత్రణ రేఖవద్దకాల్పులు జరపడం, తీవ్ర ప్రకటనలు చేయడంతో భారత ప్రభుత్వం యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని, ఇరు దేశాల ప్రజల ప్రయోజనార్థం ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల ఆమోదంతో నిర్వహించిన సమావేశంలో వారంతా భారత్ కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. దురాక్రమణలనుంచి దేశాన్ని రక్షించేందుకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఏకమౌతారనేందుకు ఇదే నిదర్శనమని నిరూపించారు. అలాగే కాశ్మీర్ లో హింసకు వ్యతిరేకంగా కాశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా భారత్ బలవంతపు వివాదాన్ని పరిష్కరించాలని, అందుకు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం ఓ రిజల్యూషన్ పాస్ చేయాలని వారు కోరారు.


