తప్పు నాదే.. మన్నించండి

Thai Football Team Coach Emotional Letter from Cave - Sakshi

దాదాపు 15 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గుహలోనే చిక్కుకుపోయిన ఫుట్‌బాల్‌ టీమ్‌. పదిరోజుల అన్వేషణ .. ఇంటర్నేషనల్‌ ఆపరేషన్‌..  ఎట్టకేలకు ఆచూకీ లభ్యం. ఇప్పుడు వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా ఇన్నాళ్లపాటు కాపాడిన కోచ్‌.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేశారు. 

బ్యాంకాక్‌: 25 ఏళ్ల ఎక్కపోల్‌ చాంతవోంగ్‌.. ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌. గుహలోకి వాళ్లందరినీ తీసుకెళ్లింది ఆయనే. చిక్కుకుపోయిన వాళ్లలో అంతా మైనర్‌లే కాగా.. చాంతవోంగ్‌ వారిని కాపాడుతూ వస్తున్నారు. ‘తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. మీ పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. జరిగిన దాంట్లో తప్పు మొత్తం నాదే. మీ అందరికీ నా క్షమాపణలు. పిల్లలను జాగ్రత్తగా కాపాడేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా.. ఇట్లు... మీ చాంతవోంగ్‌’ అంటూ ఓ లేఖను రాశాడు. థాయ్‌ నేవీ సీల్‌(SEAL) ఫేస్‌బుక్‌ పేజీలో శనివారం ఆ లేఖను పోస్ట్‌ చేశారు. 

కాగా, పదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన చాంతవోంగ్‌.. ఆమె దూరపు బంధువైన ఓ మహిళ దగ్గర పెరిగాడు. ‘ఆంటీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ లేఖలో సదరు మహిళకు కూడా చాంతవోంగ్‌ జాగ్రత్త సూచించాడు. ఇదిలా ఉంటే ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌ రాయ్‌ ప్రొవిన్స్‌లో గత నెల 23న కోచ్‌తోపాటు 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్‌ టీమ్‌.. థామ్‌ లూవాంగ్‌ గుహ సందర్శనకు వెళ్లింది. ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. పిల్లలు గుహాలో చిక్కుకున్నారని తెలిశాక.. కోచ్‌ చాంతవోంగ్‌పైనే తీవ్ర విమర్శలు వినిపించాయి. అయితే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం.. తాను పస్తులుండి వారి ఆకలి తీర్చటం లాంటి విషయాలు వెలుగులోకి వచ్చాక వాళ్ల అభిప్రాయం మారి అతనిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   

ఇక 5 ఆప్షన్లే...

మిషన్‌ ఇంపాజిబుల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top