సిరియాలో మళ్లీ నరమేధం ; 200 మంది హతం

Syria forces deadliest attack on Ghouta several killed - Sakshi

గౌటా ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించిన ప్రభుత్వ బలగాలు

బీరుట్‌ : గత కొన్నేళ్లుగా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంపై సిరియన్‌ ఆర్మీ  ఆది, సోమవారాల్లో బాంబుల వర్షం కురిపించడంతో ఏకంగా రెండు వందల మంది పౌరులు మృత్యువాతపడ్డారు. వీరిలో 57 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 300 మందికి గాయాలయ్యాయి. సిరియాలోని ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

కేవలం సోమవారం నాటి దాడుల్లోనే 127 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. భారీ సంఖ్యలో క్షతగాత్రులకు సరిపడా పడకలు లేకపోవడంతో బాధితులకు చికిత్స చేయడం కష్టసాధ్యంగా మారుతోందని డాక్టర్లు తెలిపారు. డమాస్కస్‌ శివార్లలో 2015 తర్వాత జరిగిన అతి పెద్ద దాడులు ఇవేనని  మానవ హక్కుల పరిశీలన సంస్థ చీఫ్‌ రమి అబ్దెల్‌ రెహమాన్‌ తెలిపారు. గౌటాలో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతంలో మరోసారి భారీ దాడికి అవకాశం ఉందని అల్‌–వతన్‌ పత్రిక తెలిపింది.

తూర్పు గౌటా ప్రాంతం 2012 నుంచి రెండు ఉగ్రవాదసంస్థల ఆధీనంలోనే ఉంది. డమాస్కస్‌ శివారు ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌–అసద్‌ సైన్యాన్ని పంపించారు. దీంతో పలు పట్టణాలపై సైన్యం విమానాలతో దాడులు చేపట్టింది.  ఈ నెల మొదట్లో కూడా ప్రభుత్వ బలగాలు తిరుగుబాటు దారులపై ఐదు రోజుల పాటు చేపట్టిన దాడుల్లో 250 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ పౌరుల హత్యలను తక్షణం ఆపేయాలని సిరియా ప్రభుత్వాన్ని కోరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top