సుష్మా విమానం సేఫ్‌

Sushma Swaraj Flight Tension In Mauritius - Sakshi

14 నిమిషాలపాటు ఏటీసీతో సంబంధాలు మాయం

న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రయాణిస్తున్న విమానం ఆదివారం కాసేపు ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)తో సంబంధాలు కోల్పోవడంతో ఆందోళన నెలకొంది.   14 నిమిషాల తర్వాత మళ్లీ విమానం జాడ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా), ఐబీఎస్‌ఏ (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా) సదస్సుల్లో పాల్గొనేందుకు సుష్మ శనివారం ఢిల్లీ నుంచి వాయుసేనకు చెందిన ఐఎఫ్‌సీ 31 ఎంబ్రాయర్‌ (మేఘదూత్‌) విమానంలో బయల్దేరి దక్షిణాఫ్రికా వెళ్లారు.

ఏకధాటిగా దక్షిణాఫ్రికా వరకు ప్రయాణించడానికి సరిపోయేంత ఇంధనాన్ని నింపుకునే సదుపాయం మేఘదూత్‌కు లేదు. దీంతో తిరువనంతపురం, మారిషస్‌లో విమానం ఆగి ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంది. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2.08 గంటలకు బయల్దేరి మాల్దీవుల గగనతలంలో ప్రయాణిస్తున్నంత వరకు కూడా అంతా సవ్యంగా ఉంది. అయితే మేఘదూత్‌ మారిషస్‌ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా ఏటీసీతో విమానాలకు సంబంధాల విషయంలో తొలి 10, 20, 30 నిమిషాల్లోపు వివిధ దశల్లో హెచ్చరికలు జారీచేస్తారు.

30 నిమిషాల తర్వాత కూడా ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే విమానం జాడ తెలియడం లేదని ప్రకటిస్తారు. 4.44 గంటలకు సుష్మ ప్రయాణిస్తున్న విమానం జాడ మిస్సయింది.  దీంతో 12 నిమిషాల తర్వాత కూడా జాడ దొరకకపోవడంతో తొలి హెచ్చరిక జారీ అయింది. దీంతో ఆందోళన మొదలైంది. అయితే 4.58 గంటలకు విమానం రాడార్‌ పరిధిలోకి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాడార్లలో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని భారత వినాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అధికారి ఒకరు తెలిపారు.

మారిషస్‌ ప్రధానితో భేటీ
మారిషస్‌లో ఇంధనం నింపుకోవడానికి ఆగినసమయంలో ఆ దేశ ప్రధాని ప్రవీంద్‌ జగన్నాథంతో సుష్మ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపిన అనంతరం ఆమె దక్షిణాఫ్రికా వెళ్లారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top