శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం

Srilanka President Sirisena Party to Support No-Confidence Motion Against PM - Sakshi

కొలంబో : శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఏప్రిల్‌ 4న అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న శ్రీలంక ప్రధానమంత్రి రణీల్‌ విక్రమసింఘేకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్టీ షాక్‌ ఇచ్చింది. సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ (ఎస్‌ఎల్పీ)  ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు(ఎస్‌సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్‌ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా సిరిసేన పార్టీ పట్టుబట్టింది. కానీ ప్రధాని ఇందుకు నిరాకరించడంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ సీనియర్‌ నేత, విమానయాన శాఖ మంత్రి నిమల్‌ సిరిపాల డి సిల్వా తెలిపారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎస్‌ఎల్పీ తీసుకున్న నిర్ణయంతో ప్రధాని చిక్కుల్లో పడ్డారు.

అవిశ్వాసాన్ని దీటుగా ఎదుర్కొంటాం..
ప్రధాని విక్రమసింఘే పార్టీ యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) అధికార ప్రతినిధి, మంత్రి హర్ష డి సిల్వా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటామని, వారిని ఓడించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంఖ్యా బలం ఉన్నప్పటికీ...
గత నెలలోనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మనానికి సంబంధించిన నోటీసులు స్పీకర్‌ కరు జయసూర్యకు అందజేశాయి. 225 స్థానాలున్న శ్రీలంక అసెంబ్లీలో ప్రధాని పార్టీ యూఎన్‌పీ 106 మంది సభ్యులను కలిగి ఉంది. సిరిసేన ఎస్‌ఎల్పీ పార్టీతో పాటు, మాజీ అధ్యక్షుడు రాజపక్సే పార్టీల సంఖ్యా బలం 96. యూఎన్‌పీ మిత్రపక్షమైన శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌ కూడా యూఎన్‌పీ తీరు పట్ల అసంతృప్తిగానే ఉంది.  సుమారు పన్నెండు మంది సొంత ఎంపీలు కూడా ప్రధానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారని సిరిసేన అభిప్రాయపడ్డారు. ఇక శ్రీలంకలోని ప్రధాన తమిళ పార్టీ కూడా అవిశ్వాసానికి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షునితో సమావేశమైన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆ పార్టీ నాయకుడు ఆర్‌ సంథన్‌ తెలిపారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన సంఖ్యా బలం ఉన్నప్పటికీ సొంత పార్టీలో ప్రధానికి పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఓడిపోతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించిన కారణంగా అధ్యక్షుడు సిరిసేన ప్రధాని బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top