ఒక్క లబ్‌డబ్‌తోనే గుట్టు పట్టేస్తుంది.. 

A small size heart was developed with cells extracted from a person - Sakshi

హార్ట్‌ ఫెయిల్యూర్‌ను ముందుగానే కచ్చితంగా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యంత్రం ఒకే ఒక్క లబ్‌డబ్‌తోనే సమస్యను గుర్తించగలగడం విశేషం. అరవై ఐదేళ్ల పైబడ్డ వారిలో కనీసం 10 శాతం మంది కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌తో మరణిస్తుంటారు. శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయడంలో గుండె విఫలం కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. కారణాలేవైనా.. ఈ పరిస్థితిని గుర్తించడం మాత్రం కష్టం.

కొన్ని రోజులపాటు ఈసీజీ తీసి పరిశీలించడం ద్వారా డాక్టర్లు హార్ట్‌ ఫెయిల్యూర్‌కు ఉన్న అవశాలను అంచనా వేస్తారు. అయితే సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఈసీజీ సమాచారాన్ని వేగంగా విశ్లేషించే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా గుండె ఒక్కసారి కొట్టుకోగానే సమస్యను గుర్తించగలిగారు. దీనిపై మరిన్ని విస్తృత పరిశోధనలు చేపడతామని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్‌వాచీలు, హెల్త్‌ బ్యాండ్స్‌లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నారు. 

చిన్ని గుండె సిద్ధమైంది 
త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ రవి బిర్లా ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణాలతో చిన్న సైజు గుండెను అభివృద్ధి చేశారు. తెల్ల రక్త కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో ఈ మూలకణాలు కార్డియో మయోసైట్స్‌గా రూపాంతరం చెందుతాయి. పోషకాలు కొన్నింటిని కలిపి.. ప్రత్యేకంగా తయారు చేసిన బయో ఇంక్‌ సాయంతో తాము పొరలు పొరలుగా గుండెను తయారు చేశామని, బయోలైఫ్‌ 4డీ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అయిన రవి బిర్లా తెలిపారు.  

ఒక రోగి తాలూకూ నిజమైన గుండె వివరాల ఆధారంగానే ఈ కృత్రిమ గుండె తయారైందని తెలిపారు. నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని శరీరం లోపలి పరిస్థితులను తలపించే బయో రియాక్టర్‌లో ఉంచినప్పుడు కణాలన్నీ కండరాల మాదిరిగా దృఢంగా మారాయని, ఫలితంగా అనుకన్న పరిమాణం కంటే తక్కువ సైజు గుండె ఏర్పడిందని తెలిపారు. ఇదే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తే గుండెలను కృత్రిమంగా తయారు చేసి అమర్చుకునే రోజులు దగ్గరకొచ్చినట్లే అని అంచనా వేస్తున్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top