
రాడ్‌తో అతడి తలపై బాదడంతో పాటు, కళ్లలో మట్టి కొట్టి దాడికి పాల్పడ్డారు.
కాలిఫోర్నియా : అమెరికాలో తెల్లజాతీయులు మరోసారి రెచ్చిపోయారు. ‘ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీ దేశానికి తిరిగి వెళ్లిపొమ్మంటూ’ ఓ సిక్కు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియా పత్రిక మాడెస్టొ బీ కథనం ప్రకారం.. ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్న సిక్కు వ్యక్తి కెయిస్ అనే ప్రదేశంలో తన ట్రక్కును ఆపి ఉండగా ఇద్దరు వ్యక్తులు అతడి దగ్గరికి వచ్చారు. ‘నీకు ఇక్కడేం పని’ అంటూ గట్టిగా అరుస్తూ.. రాడ్‌తో అతడి తలపై బాదడంతో పాటు, కళ్లలో మట్టి కొట్టి దాడికి పాల్పడ్డారు. అతడి ట్రక్కుపై ‘మీ దేశానికి వెళ్లిపో అంటూ బ్లాక్ పేయింట్‌తో స్ప్రే చేస్తూ అతడిని భయపెట్టారు.
కాగా దుండగులు దాడి చేసిన సమయంలో సదరు వ్యక్తి టర్బన్(తలపాగా) ధరించడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కథనం ఫేస్‌బుక్‌లో వైరల్ కావడంతో ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. జాత్యహంకార దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఇటువంటి హీనమైన చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు.