బస్సు, రైలు ప్రయాణం ఫ్రీ

Public Transportation Trips Free APTA Services - Sakshi

కాలుష్య నియంత్రణకు ‘లక్సంబర్గ్‌’ నిర్ణయం

చరిత్ర సృష్టించనున్న ఐరోపా దేశం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గాలి కాలుష్యం ప్రధానమైంది. వ్యక్తిగత వాహనాలు ఎక్కువైపోవడం దీనికొకకారణం. మనిషి మనుగడకు ముప్పుగా పరిణమించిన వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమకు చేతనైన ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఐరోపాలో బుల్లి దేశమైన లక్సంబర్గ్‌ ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది. త్వరలో లక్సంబర్గ్‌ ప్రభుత్వం దేశంలో ప్రజా రవాణాను ఉచితం చేయనుంది. అంటే ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్‌ కొనాల్సిన పని ఉండదు. అది అమల్లోకి వస్తే ప్రపంచంలో ఇలాంటి విధానం అమలు చేస్తున్న తొలి దేశం లక్సంబర్గే అవుతుంది. 2020 నుంచి దేశంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని గ్జేవియర్‌ బెటెల్‌ ప్రకటించారు. ఉచిత రవాణా వల్ల వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయని దాంతో గాలి కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వివరించారు. అంతేకాకుండా దీనివల్ల ట్రాఫిక్‌ రద్దీ కూడా తగ్గుతుందన్నారు.

బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య ఉన్న చిన్న దేశం లక్సంబర్గ్‌. జనాభా 6 లక్షలు. దేశంలో ప్రతి వెయ్యి మందికి 647 కార్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఏడాదిలో 32.21 గంటలు ప్రయాణాల్లోనే గడుపుతున్నారు. ప్రతిరోజూ పొరుగు దేశాల నుంచి లక్షా 90వేల మంది వచ్చి ఇక్కడ పనులు చేసుకుని వెళ్లిపోతుంటారు. వారిలో కొందరు సొంత వాహనాల్లో వస్తే, మరికొందరు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల దేశంలో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఎన్నికలప్పుడు ఇదీ కీలక ప్రచారాంశం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను ఉచితం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇతర దేశాలను కూడా ఈ దిశగా ఆలోచించేలా చేస్తోంది. 2013 లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉ చిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. తలిన్‌లో ప్రజలు 2యూరోలతో హరిత రవాణా పాస్‌ కొను క్కుని అన్ని మున్సిపల్‌ బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. సీనియర్‌ సిటిజన్లకు ఎప్పటి నుంచో అక్కడ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది.
 
ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు ఆదా..  
ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలున్నాయని అమెరికన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(అప్టా) తెలిపింది. ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టే ప్రతి డాలరుకు 4 డాలర్లు తిరిగి వస్తుందని ఆప్టా తెలిపింది. దీనివల్ల గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంది. సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రభుత్వ వాహనాలు ఉపయోగించడం వల్ల అమెరికాలో ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదా చేయవచ్చని ఆప్టా అంచనా వేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top