ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిఘటిస్తాం

Pakistan rejects India move to scrap Article 370 - Sakshi

భారత్‌ చర్యను అడ్డుకుంటామన్న పాకిస్తాన్‌

అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని స్పష్టీకరణ

నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న పార్లమెంట్‌

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిప త్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్‌ ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేవాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రకటన ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమని అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ పేర్కొన్నారు.

ఈ విషయమై చర్చించేం దుకు ఆయన మంగళవారం ప్రత్యేకంగా పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమా వేశం ఏర్పాటు చేశారు. పలు కశ్మీరీ సంఘాలు, సంస్థలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపాయి. నీలం లోయలో భారత్‌ బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న సరిహద్దు ప్రాంతాలను విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించనుందని పాక్‌ అధికారులు తెలిపా రు. నియంత్రణ రేఖ వెంబడి పౌరులే లక్ష్యంగా భారత్‌ చేసిన క్లస్టర్‌ బాంబులతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ విదేశీ బృందంలో చైనా, బ్రిటన్, ఫ్రాన్సు, టర్కీ, జర్మనీ దౌత్యాధి కారులు ఉంటారన్నారు. అయితే, పాక్‌ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవి అబద్ధాలు, మోసమని పేర్కొంది.

‘అణ్వస్త్ర’ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తాయి: ఆర్టికల్‌–370 రద్దుతో అణ్వస్త్ర పాటవ ఇరుగుపొరుగు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. మలేసియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన... కశ్మీర్‌ హోదాను మార్చడం అన్యాయం, ఐరాస తీర్మానాల ఉల్లంఘన. భారత్‌ చర్యతో అణ్వస్త్ర పాటవ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయి’ అని తెలిపారు. కశ్మీర్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటామని, పాక్‌తో చర్చలు జరుపుతుంటామని మలేసియా ప్రధాని మహతీర్‌ పేర్కొన్నారని పాక్‌ మీడియా తెలిపింది. వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల సందర్భంగా ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ ఉంటుం దని కూడా ఆయన తెలిపారని పేర్కొంది.

కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తాం
కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న ఏకపక్ష, చట్ట విరుద్ధ చర్యను అడ్డుకునేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేస్తామని పాక్‌ పేర్కొంది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ‘భారత ప్రభుత్వ నిర్ణయం జమ్మూకశ్మీర్‌తోపాటు, పాకిస్తాన్‌ ప్రజలకు కూడా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్‌ తీసుకునే చట్ట విరుద్దమైన చర్యలను ప్రతిఘటించేందుకు ఈ వివాదంతో సంబంధం ఉన్న పాకిస్తాన్‌ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కశ్మీర్‌ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి దౌత్యపరమైన రాజకీయ, నైతికమద్దతును కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని తెలిపింది. కాగా, జమ్మూకశ్మీర్‌ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం పాక్‌ పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం
కశ్మీర్‌ విషయంలో భారత్‌ చర్యలను ఐరాస, ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ (ఓఐసీ)తోపాటు మిత్రదేశాలు, అంతర్జా తీయ మానవ హక్కుల సంఘాల దృష్టికి తీసుకెళతామని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ ఖురేషి తెలిపారు. త్వరలో ఇక్కడ పర్యటించనున్న అమెరికా ప్రతిని ధులకు కూడా ఈ విషయం తెలియ పరుస్తాం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌పై ఐరాస పలు తీర్మానాలు చేసింది. కశ్మీర్‌ను ఐరాస వివాదాస్పద ప్రాంతంగా గుర్తించిందన్న విషయాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా అంగీకరించారు’ అని ఆయన అన్నారు. ‘కశ్మీరీలకు పాక్‌ మద్దతు ఇకపై నా కొనసాగుతుంది. భారత్‌ నిర్ణయం తప్పని చరిత్రే రుజువు చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. భారత్‌ నిర్ణయం అక్కడి ప్రజల అభిప్రాయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top