
లండన్: బ్రిటన్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీ సాజిద్ జావెద్ ఆ దేశ హోం మంత్రిగా నియమితులయ్యారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బలవంతంగా పంపించే విషయంలో పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు ఇంతవరకూ హోం మంత్రిగా ఉన్న అంబర్ రూడ్ సోమవారం పదవి నుంచి వైదొలిగారు. దీంతో సాజిద్‌ను హోంమంత్రిగా నియమించారు. ప్రస్తు తం ఆయన కమ్యూనిటీస్, స్థానిక సంస్థలు, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాజిద్ కుటుంబం 1960 ల్లో బ్రిటన్‌కు తరలివచ్చింది.
బ్రిటన్ చరిత్రలో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించే మొదటి దక్షిణాసియా వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. ఇప్పటికే పాక్ మూలాలున్న సాదిక్ ఖాన్ లండన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగ తి తెలిసిందే. తన నియమాకం అనంతరం సాజిద్ మాట్లాడుతూ.. దేశంలోని వలస విధానాన్ని సమీక్షిస్తానని, ప్రజల్ని గౌరవం, మర్యాదతో చూస్తామని చెప్పారు. 2010 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్న సాజిద్.. గతంలో వాణిజ్య, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.