నవ్వుల సడినీ, విషాదపు తడినీ కొలిచేస్తారు సుమండీ!

Ohio University Developed Felling Calculator - Sakshi

వర్షించే మేఘాలనూ, శీతాకాలం వణికించే మంచురాత్రులనూ, సెగలుపుట్టించే వేసవి వేడినీ కొలిచే సాధనాలున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచ మానవాళి ముఖకవళికలను బట్టి వారిలోని ఆనందాశ్చర్యాలకూ లెక్కకట్టేస్తున్నారు పరిశోధకులు. మీలోని దుఃఖాన్నీ, ఆనందాన్నీ, కోపాన్నీ, విషాదాన్నీ స్కేల్‌తో కొలిచిమరీ మీ అభివ్యక్తిని ఇట్టే పట్టేస్తారు. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? ఉంటే ఎంత సంతోషంగా ఉన్నారు? కోపమా? అయితే దాని బరువెంత? ఇలా మీ ముఖాన విరిసే అన్ని హావభావాలనూ ముఖ కండరాల కదలికలను బట్టి అంచనా కట్టేస్తున్నాయి తాజా అధ్యయనాలు. అలా లెక్కలు వేసే ప్రపంచంలో ఎన్ని రకాల నవ్వులు పూయించొచ్చో, ఎన్ని రకాలుగా మీలోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారో తేల్చి చెప్పేశారు.

ఆనందానికి 17 వ్యక్తీకరణలు..  
ప్రపంచవ్యాప్తంగా మనుషులు విసుగుని ప్రదర్శించడానికి ఒకే ఒక్క ముఖ కవళిక ఉందట. కానీ మనలోని సంతోషాన్నీ, ఆనందాన్నీ, ఉట్టిపడే ఉల్లాసాన్నీ 17 రకాలుగా మనం వ్యక్తీకరిస్తున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మనలో భయాన్ని మాత్రం కేవలం మూడు రకాలుగా ప్రదర్శిస్తున్నాం. ఆశ్చర్యాన్ని నాలుగురకాలుగా అభివ్యక్తీక రిస్తే, ప్రపంచ ప్రజలంతా తమలోని కోపాన్నీ, విషాదాన్నీ మాత్రం ఐదు విభిన్న ముఖ కవళికల ద్వారా, ముఖాకృతుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. మన ముఖంలోని కండరాల కదలికలను బట్టి మన నవ్వునీ, నవ్వుతున్న ప్పుడు మన కళ్ళ దగ్గర పడే చర్మపు ముడతలని బట్టి మనలోని ఆనందాన్ని చాలా సునాయాసంగా కొలిచేయొచ్చంటున్నారు పరిశోధకులు.  ‘‘ఈ పరిశోధన చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే సంతోషంలోని క్లిష్టమైన విషయాలెన్నింటినో ఇది విడమరిచి చెప్పింది’’అని ఓహియో యూనివర్సిటీ అధ్యాపకులు అలెక్సీ మార్టినెజ్‌ పేర్కొన్నారు.  

35 రకాల ఎమోషన్స్‌ కామన్‌
మనుషులు తమలోని ఆనందం, కోపం, సంతోషం, దుఃఖం, విషాదం లాంటి ఉద్విగ్నభరిత క్షణాలను వేనవేల రకాలుగా వ్యక్తీకరిస్తుంటారు. అయితే అందులో కేవలం 35 రకాల అభివ్యక్తులు మాత్రమే ఉంటాయని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. వివిధ రకాల ఫీలింగ్స్‌ని వివరించే 821 రకాల పదాలను ఇంటర్‌నెట్‌లో పరిశోధించి వాటిని మనుషుల ముఖాభినయాలతో పోల్చి చూసినట్టు ఐఈఈఈ జర్నల్‌లో ప్రచురించిన వ్యాసంలో వివరించారు. స్పానిష్‌లోనూ, చైనా భాషలోకీ, పార్సీ, రష్యన్‌ మొదలుకొని ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల్లోని మొత్తం 31 దేశాల భాషల్లోకి ఈ పదాలను అనువదించి సంబంధిత ముఖచిత్రాలతో పోల్చి చూశారు. ఈ అధ్యయనంలో దాదాపు 72 లక్షల ఫొటోల్లోని ముఖాభినయాలను పరిశీలించారు. అయితే కంప్యూటర్‌ ఆల్గరిథమ్స్‌ ఆధారంగా ముఖ కండరాల కదలికలను బట్టి 16,384 రకాలుగా మనుషులు తమలోని భావోద్వేగాలను వ్యక్తీకరించగలరని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. అయితే 72 లక్షల ఫొటోలను పరిశీలించిన మీదట అందులో 35 రకాల ఎమోషన్స్‌ సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top