
ఐఎస్ఐఎస్ ఫైటర్ల తలలు నరికి.. ఊళ్లో ప్రదర్శన!
ఇటీవలి కాలంలో తొలిసారిగా.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలను నరికి, వాటిని ఊళ్లో మెయిన్ రోడ్డు వద్ద ప్రదర్శించారు!
ఇన్నాళ్లూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఘాతుకాలు చేయడం చూశాం. తమకు నచ్చనివాళ్లను బందీలుగా పట్టుకుని వాళ్ల తలలు నరికేయడం, నేరుగా తలపై తుపాకితో కాల్చి సముద్రంలో పారేయడం లాంటివి మనకు తెలుసు. కానీ ఇటీవలి కాలంలో తొలిసారిగా.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలను నరికి, వాటిని ఊళ్లో మెయిన్ రోడ్డు వద్ద ప్రదర్శించారు! ఈ ఘటన అఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్ ప్రాంతంలో జరిగింది. ఓ అఫ్ఘాన్ మంత్రికి అత్యంత నమ్మకస్థులుగా ఉండే గ్రామ మిలీషియా సభ్యులు ఈ పనికి పాల్పడ్డారు. దీంతో ఐఎస్ఐఎస్‌కు, దాని ప్రత్యర్థులకు మధ్య దారుణమైన హింసాత్మక ఘటనలు అఫ్ఘాన్‌లో పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.
అఫ్ఘాన్‌లో ఇన్నాళ్లూ తాలిబన్లదే రాజ్యం. అక్కడ వాళ్లు గీసిన గీత దాటడానికి వీల్లేదు. కానీ ఇటీవలి కాలంలో ఐఎస్ఐఎస్ కూడా అఫ్ఘాన్ గ్రామాల్లోకి చొరబడి, అక్కడ బలం పుంజుకోడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకోడానికి అఫ్ఘాన్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ హాజీ జాహిర్‌కు నమ్మకస్థులైన స్థానిక మిలీషియా సభ్యులు మాత్రం అటు తాలిబన్లతోను, ఇటు ఇస్లామిక స్టేట్ ఉగ్రవాదులతోను కూడా పోరాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మిలీషియాకు చెందిన నలుగురు సభ్యులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని తలలు నరికేశారు. దానికి ప్రతీకారంగా, నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మిలీషియా సభ్యులు పట్టుకుని, వాళ్ల తలలు నరికేసి, ఊళ్లోని మెయిన్ రోడ్డులో ప్రదర్శనగా పెట్టారు. ఈ ఘటనను డిప్యూటీ స్పీకర్ సమర్థించినట్లు కూడా తెలుస్తోంది.