నవాజ్‌ షరీఫ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

నవాజ్‌ షరీఫ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష

Published Fri, Jul 6 2018 5:18 PM

Nawaz Sharif Sentenced 10 Year Jail Term - Sakshi

ఇస్లామాబాద్‌ : అవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్‌ తనయ మర్యమ్‌, అల్లుడు కెప్టెన్‌ సర్దార్‌లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా కుంభకోణంలో బయటపడ్డ షరీఫ్‌ అవినీతి బాగోతంపై పాకిస్తాన్‌ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

షరీఫ్‌పై మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో లండన్‌ అవెన్‌ఫీల్డ్‌లోని నాలుగు ఫ్లాట్ల కేసు ఒకటి. కాగా, తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా షరీఫ్‌ కోర్టును కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఈ మేరకు ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా కేసును విచారిస్తూ వస్తోంది.

శుక్రవారం కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి నవాజ్‌ షరీఫ్‌ 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలియన్‌ పౌండ్ల జరిమానా విధించారు. మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్‌ పౌండ్ల జరిమానా, సర్దార్‌కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, తీర్పు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు పాకిస్తాన​ జాతీయ పత్రిక డాన్‌ పేర్కొంది. కోర్టు ప్రసారాలను లండన్‌ నుంచి షరీఫ్‌ ఫ్యామిలీ లైవ్‌లో తిలకించినట్లు రిపోర్టులు కూడా వస్తున్నాయి.

Advertisement
Advertisement