సిద్ధూ చేసింది తప్పే.. 

Navjot Singh Sidhu Hug To Pakistan Army Chief Trolled - Sakshi

చండీగఢ్‌/లాహోర్‌ : అటు క్రికెట్‌లోను.. ఇటు రాజకీయాల్లోను నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు వివాదాలు కొత్తేమీ కాదు. అయితే భారత్‌–పాక్‌ సంబంధాలు దిగజారిన ప్రస్తుత తరుణంలో.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారంలో ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో కౌగిలింతలు, ముచ్చట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాజ్‌పేయి మరణంతో విషాదంలో ఉన్న దేశ ప్రజల మనోభావాల్ని సిద్ధూ విస్మరించారని, అతను క్షమాపణ చెప్పాలని బీజేపీ, అకాళీదళ్‌లు ఇప్పటికే డిమాండ్‌ చేయగా.. ఇప్పుడు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ కూడా తన కేబినెట్‌ సహచరుడి చర్య సమర్ధనీయం కాదంటూ గట్టి షాకిచ్చారు. సిద్ధూ మాత్రం తన తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు.

నిజానికి సిద్ధూ పాకిస్తాన్‌ వెళ్లడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టలేదు. అయితే పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆప్యాయంగా హత్తుకుని ముచ్చటించడం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధాని పక్కన కూర్చోవడం వివాదాస్పమైంది.   ఆర్మీ కెప్టెన్‌గా కూడా పనిచేసిన అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ పట్ల సిద్ధూ వాత్సల్యం సరికాదు. ప్రతి రోజూ మన జవాన్లు అమరులవుతున్న విషయం అర్థం చేసుకోవాలి’అని ఘాటుగా స్పందించారు. సిద్ధూ పర్యటన అతని వ్యక్తిగతమని, అలాగే తన పక్కన కూర్చున్న వ్యక్తి పీఓకే చీఫ్‌ అన్న విషయం తెలిసుండకపోవచ్చని మరో ప్రశ్నకు అమరీందర్‌ సమాధానమిచ్చారు. దేశ ప్రతిష్టను సిద్ధూ ప్రమాదంలోకి నెట్టారని బీజేపీ విమర్శించగా.. పాక్‌ పర్యటనతో మన మర్యాదను మంటగలిపారని శిరోమణి ఆకాలీదళ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  

అందుకే పీఓకే చీఫ్‌ పక్కన కూర్చున్నా: సిద్ధూ 
ఇక ఆదివారం అట్టారి– వాఘా సరిహద్దు వద్ద భారత్‌ భూభాగం చేరుకున్నాక సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకరు(పాక్‌ ఆర్మీ చీఫ్‌) నా వద్దకు వచ్చి.. మనం ఒకే సంస్కృతికి చెందినవారం. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి వేడుకల నాటికి పాకిస్తాన్‌లోని గురుద్వారా కర్తార్‌పూర్‌ షాహిబ్‌ సందర్శనకు మార్గం సుగమం చేయాలని కోరినప్పుడు నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధాని పక్కనే కూర్చోవడంపై వివరణిస్తూ.. ‘మీరు ఎక్కడికైనా అతిథిగా వెళ్తే.. వారు కేటాయించిన చోట కూర్చోవాలి. నిజానికి నేను వేరే చోట కూర్చున్నాను. అయితే నన్ను పీఓకే చీఫ్‌ పక్కన కూర్చోమన్నారు’అని చెప్పారు.

భారత్‌ చేరుకోక ముందు లాహోర్‌లో మాట్లాడుతూ.. ‘ఇక్కడ లభించిన ప్రేమానురాగాలకు నేనెంతో ముగ్ధుడినయ్యాను. రెండు దేశాల మధ్య శాంతి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’అని సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణకు తాను సానుకూలమని.. ఐపీఎల్, పీఎస్‌ల్‌ విజేతల మధ్య పోటీ మంచి ఆలోచనని చెప్పారు. మరోవైపు వాఘా వద్ద సిద్ధూకు నిరసన సెగ తగిలింది. భారత్‌కు చేరుకునే సమయంలో ‘పగ్రీ సంబాల్‌ జట్టా’సంస్థకు చెందిన కార్యకర్తలు సిద్ధూకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top