సహకారం మరింత విస్తృతం | Much more broaden cooperation | Sakshi
Sakshi News home page

సహకారం మరింత విస్తృతం

Apr 4 2016 1:37 AM | Updated on Aug 20 2018 7:34 PM

సహకారం మరింత విస్తృతం - Sakshi

సహకారం మరింత విస్తృతం

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద వ్యతిరేక అంశాలతోలపాటు పలు కీలకాంశాల్లో సహకారాన్ని కొనసాగించాలని భారత ప్రధాని మోదీ, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ నిర్ణయించారు.

భారత్,సౌదీ అరేబియా నిర్ణయం
♦ ఉగ్రవాదంపై పోరు సహా ఐదు ఒప్పందాలపై సంతకాలు
♦ మోదీకి సౌదీ అత్యున్నత పౌర పురస్కారం
 
 రియాద్: ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద వ్యతిరేక అంశాలతోలపాటు పలు కీలకాంశాల్లో సహకారాన్ని కొనసాగించాలని భారత ప్రధాని మోదీ, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ నిర్ణయించారు. ఆదివారం జరిగిన విస్తృతస్థాయి చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా.. ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. భారత చమురు వినియోగంలో 5వ వంతు సరఫరా చేస్తున్న సౌదీ ఇకపై దీన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు సౌదీలో చిన్న నేరాలకు శిక్ష అనభవిస్తున్న భారతీయులను విడుదల చేసే అంశంపైనా మోదీ చర్చించారు.

సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలతోపాటు పలు అంశాల్లో పరస్పర సహాయం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సౌదీ రాజుతో సమావేశానికి ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి అదెల్ అల్‌జుబేర్, సౌదీ అరేబియా జాతీయ చమురు సంస్థ ‘అరామ్‌కో’ హెడ్ ఖాలిద్ అల్ ఫలీహ్‌లతో ఇరుదేశాలకు లాభం చేసే అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు. అరామ్‌కో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ స్వర్గధామమని ఆ సంస్థ ప్రతినిధులు మోదీతో తెలిపారు. రెండు దశాబ్దాలుగా భారత-సౌదీ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతున్నాయి.

ఇరుదేశాలు చమురుతోపాటు వివిధ అంశాల్లో సత్సంబంధాల కోసం చొరవతీసుకుంటూనే ఉన్నాయి. అంతకుముందు, సౌదీలోని 30 మంది స్థానిక, భారతీయ కంపెనీల సీఈఓలతో మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో రక్షణ, శక్తి, రైల్వే, ఆరోగ్యం, వ్యవసాయరంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మోదీ వారిని కోరారు. ప్రతి ఏడాదీ భారత్‌లో కొత్త సౌదీ అరేబియా నిర్మాణం జరగాలన్నారు. ‘ఇన్నాళ్లూ అమ్మకందారుడు-కొనుగోలుదారుడు అనే సంబంధమే ఉండేది. కానీ, విస్తరిస్తున్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌లో పెట్టుబడులు పెంచటం వల్ల ఇరు దేశాల ప్రజలు లాభపడే అవకాశం ఉంటుంది. అమ్మకం-కొనుగోలును మించి భారత్-సౌదీ సంబంధాలను చూడాలి’ అని మోదీ అన్నారు. అంతకుముందు మోదీకి సౌదీ రాజ ప్రసాదాంలో అధికారిక స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీకి సౌదీ ప్రభుత్వపు అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లా’ను రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అందజేశారు. మనీల్యాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల కట్టడి పరస్పర నిఘా సహకారం, సౌదీలో భారత ఉద్యోగుల నియామకాలతోపాటు ఐదు ఒప్పందాలు చేసుకున్నాయి.

 కేరళ మసీదు బంగారు ప్రతిరూపం
 సౌదీ పర్యటన సందర్భంగా మోదీ.. సౌదీ రాజుకు కేరళలోని ‘చేరమన్ జుమా మసీదు’ బంగారు నమూనాను కానుకగా ఇచ్చారు. క్రీ.శ. 629లో అరబ్ వర్తకులు దీన్ని నిర్మించినట్లుగా చెబుతారు. మహ్మద్ ప్రవక్త సమకాలీనుడైన చేర రాజు చేరమన్ పెరుమాల్ మక్కాలో ప్రవక్తను కలసి ఇస్లాంను స్వీకరించాడని.. ఆ తర్వాత పలువురు వర్తకుల ద్వారా తన బంధువులకు సమాచారం పంపి చేరమాన్ జుమా మసీదును నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తీసుకుంటున్న తాత్కాలిక చర్యలతో ఉపశమనం ఉండదని..కూకటి వేళ్లతో పెకిలిస్తేనే పరిష్కారం ఉంటుందని ఓ అరబ్ పత్రికతో మోదీ పేర్కొన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని మోదీ ఆదివారం రాత్రి స్వదేశానికి బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement