భారీ రెస్క్యూ ఆపరేషన్‌.. ఉత్కంఠకు తెర

Missing Thai Football Team Found Safely in Tham Luang Cave - Sakshi

దాదాపు పది రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కనిపించకుండా పోయిన ఫుట్‌బాల్‌ టీమ్‌ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని ప్రకటించిన థాయ్‌లాండ్‌ అధికారులు.. భారీ రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసినట్లు సోమవారం ప్రకటించారు. గుహలోనే చిన్నారులంతా చిక్కకు పోయారని, అంతా సజీవంగా ఉన్నారని ప్రకటించారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. 

సుమారు 12 మంది సభ్యులు(అంతా 13-16 ఏళ్లలోపు వాళ్లే).. కోచ్‌(25)తోపాటు అంతా మృత్యుంజయులుగా నిలిచారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌ రాయ్‌ ప్రొవిన్స్‌లో ఈ నెల 23న చెందిన సదరు ఫుట్‌బాల్‌ టీమ్‌ ప్రాక్టీస్‌ ముగిశాక దగ్గర్లోని థామ్‌ లూవాంగ్‌ గుహ సందర్శనకు వెళ్లింది. (మయన్మార్‌-లావోస్‌-థాయ్‌లాండ్‌ సరిహద్దులో ఉండే సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే గుహ అది). సాధారణంగా వర్షాకాలంలో ఈ గుహ చుట్టూ, లోపలికి నీరు చేరుతుంది. అందుకే ఆ సమయంలో గుహలోని అనుమతించరు. కానీ, వర్షాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయంతో ఆ ఫుట్‌బాల్‌ టీమ్‌ లోపలికి వెళ్లింది. అంతలో భారీ వర్షం పడటం.. నీరు ఒక్కసారిగా లోపలికి చేరటంతో వారంతా అందులో చిక్కుకుపోయారు.  ప్రాక్టీస్‌కు వెళ్లిన వాళ్లు తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. గుహ వెలుపల సైకిళ్లు కనిపించటంతో అధికారులు గాలింపు చేపట్టారు. 

పదిరోజుల పాటు ఉత్కంఠే... భారీ వర్షాలు, బురద దట్టంగా పేరుకుపోవటంతో సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది. థామ్‌ లూవాంగ్‌ గుహ, విషపూరితమైన పాములతో నిండి ఉండటం, పైగా లోపలి మార్గాలు చాలా ఇరుక్కుగా ఉండటంతో.. అన్నిరోజులు వారు బతకటం కష్టమని భావించారు. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అయితే అధికారులు మాత్రం ఆశలు వదులుకోలేదు. థాయ్‌ నేవీ సీల్‌(SEAL) డైవర్స్‌తోపాటు ముగ్గురు బ్రిటీష్‌ డైవర్స్‌, యూస్‌ఫసిఫిక్‌ కమాండ్‌కు చెందిన అమెరికా మిలిటరీ బృందం, పారా రెస్క్యూ సిబ్బంది, మరికొందరు రక్షణ నిపుణులు రంగంలోకి దించి భారీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. భారీ వర్షాలతో లోపలికి నీరు చేరినా.. సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆ బృందం తమ గాలింపును కొనసాగించింది. 

మరోవైపు ప్రజలు, బౌద్ధ సన్యాసులు వారంతా సురక్షితంగా తిరిగి రావాలని పూజలు చేశారు. ఎట్టకేలకు పదిరోజులకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి.  సోమవారం(జూలై 2న) వారిని కనుగొన్నట్లు సహాయక బృందం ప్రకటించింది. ‘అంతా సురక్షితంగా ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని చియాంగ్‌ రాయ్‌ గవర్నర్‌ నారోంగ్‌సక్‌ ఒసోట్టనాక్రోన్‌ ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ మేరకు సహాయక​ సిబ్బంది అక్కడికి చేరుకున్న ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. ‘సహాయక బృందాన్ని చూడగానే వారంతా సంతోషం వ్యక్తం చేయటం.. ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా కావాలని.. తమను వెంటనే బయటకు తీసుకెళ్లాలని ఓ బాలుడు కోరటం’ వీడియోలో ఉంది. అధికారుల కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top