బంగారి రాజు!

Man Wearing 13 kgs Of Gold Goes Anywhere in Vietnam - Sakshi

అవును మీరు చూస్తున్నది నిజమే.. ఫొటోలో ఉన్న వ్యక్తి ధరించిన ఆభరణాలన్నీ నిజంగా బంగారంతో చేసినవే.. అయితే అతడు ఏదో ఫొటో కోసం అలా అలంకరించుకోలేదు.. ఎక్కడికి వెళ్లినా కూడా ఆ భారీ అభరణాలను ధరిస్తాడట. ఇంతకీ మనోడి గురించి చెప్పలేదు కదూ..! పేరు.. ట్రాన్‌ గోక్‌.. వియత్నాం దేశానికి చెందినవాడు. వయసు 36 ఏళ్లు. వృత్తి చమురు వ్యాపారి. ఇతడికి ఇలా భారీ ఆభరణాలు వేసుకుని తిరగడమంటే ట్రాన్‌కు మహా సరదా.. ఓ రకంగా పిచ్చి. అతడు వేసుకున్న బంగారు ఆభరణాలు మొత్తం 13 కిలోల బరువుంటాయట. బయటకి ఎక్కడికి వెళ్లినా కూడా అంత బరువున్న ఆభరణాలు వేసుకొని వెళ్లాల్సిందేనట. మరి దొంగలెవరైనా దాడి చేసి ఎత్తుకుపోతే అనుకుంటున్నారా.. ఎక్కడికి వెళ్లినా అతడి వెంట ఎప్పుడూ ఐదుగురు బాడీగార్డులు ఉండాల్సిందేనట. అంత బరువును మోయాల్సిన అవసరం ఏముందని ఎవరైనా అడిగితే.. ఈ బంగారం తనకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతాడట.

తాను ధరించిన ఆభరణాల్లో మెడ గొలుసు, లాకెట్‌ కలిపి 5 కిలోలు, చేతికి ధరించిన కంకణం 5 కిలోలు.. అర కిలో బరువుతో ఉండే నాలుగు ఉంగరాలు.. మొలతాడు కిలో ఉంటుందట. వీటి మొత్తం ఖరీదు దాదాపు రూ.4 కోట్లు ఉంటుందట. ఐదేళ్ల కిందటి నుంచే ఇంతటి భారీ ఆభరణాలు తయారు చేయించుకోవడం ప్రారంభించాడట ట్రాన్‌. ఇక్కడితో ఆగిపోకుండా తన కోసం బంగారు చొక్కా తయారు చేయించుకుంటున్నాడట కూడా. అయితే దానితో కష్టాలు కూడా ఉన్నాయి లెండి. అంత బరువు మెడ గొలుసు వేసుకోవడంతో తరచూ మెడనొప్పి వస్తుందట. అయితే డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నాడట కానీ బంగారం వేసుకోవడం మాత్రం ఆపట్లేదట మనోడు. యూట్యూబ్‌లో ఇతడి వీడియోలకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. అంతే ఇక సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫొటోలు తెగ వైరల్‌ అయిపోతున్నాయి. ఓ రకంగా రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు. భారత్‌లో కూడా ఓ బంగారు బాబు ఉన్నాడు లెండి. ముంబైలోని పింప్రికి చెందిన దత్తా ఫుగ్‌ ఏకంగా 3.2 కిలోల బంగారంతో చేసిన చొక్కాను ధరించేవాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top